Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యిర్మీయా 1 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 బెన్యామీనుదేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై, హిల్కీయా కుమారుడైన యిర్మీయా వాక్యములు

2 –ఆమోను కుమారుడైన యోషీయా యూదాకు రాజై యుండగా అతని యేలుబడి పదుమూడవ సంవత్సరమున యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్ష మాయెను.

3 మరియు యోషీయా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజైయుండగాను, యోషీయా కుమారుడగు సిద్కియా యూదాకు రాజై యుండగాను, అతని యేలుబడి పదునొకండవ సంవత్సరాంతమువరకును, అనగా ఆ సంవత్సరమున అయిదవ నెలలో యెరూషలేము చెరదీసికొని పోబడు వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను.

4-5 యెహోవావాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను–గర్భములో నేను నిన్ను రూపింపకమునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడకమునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని.

6 అందుకు–అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము నేను బాలుడనే; మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా

7 యెహోవా నాకీలాగు సెలవిచ్చెను– నేను బాలుడననవద్దు; నేను నిన్ను పంపువారందరియొద్దకు నీవు పోవలెను, నీకాజ్ఞాపించిన సంగతులన్నియు చెప్పవలెను.

8 వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను; ఇదే యెహోవా వాక్కు.

9 అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరుముట్టి యీలాగు సెలవిచ్చెను–ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను.

10 పెల్లగించుటకును విరుగగొట్టుటకును, నశింపజేయుటకును పడద్రోయుటకును, కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనములమీదను రాజ్యములమీదను నిన్ను నియమించియున్నాను.

11 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై –యిర్మీయా, నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకు – బాదముచెట్టు చువ్వ కనబడుచున్నదని నేననగా

12 యెహోవా–నీవు బాగుగా కనిపెట్టితివి; నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతుర పడుచున్నాననెను.

13 రెండవమారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై–నీకేమి కనబడుచున్నదని సెలవియ్యగా నేను–మసలుచున్న బాన నాకు కనబడుచున్నది; దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగియున్నదంటిని.

14 అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను–ఉత్తర దిక్కునుండి కీడు బయలుదేరి యీ దేశనివాసులందరిమీదికి వచ్చును.

15 ఇదిగో నేను ఉత్తరదిక్కున నున్న రాజ్యముల సర్వవంశస్థులను పిలిచెదను, వారు వచ్చి ప్రతివాడును యెరూషలేము గుమ్మములలోను, యెరూషలేము చుట్టునున్న ప్రాకారములన్నిటికి ఎదురుగాను, యూదాపట్టణములన్నిటికి ఎదురుగాను తమ సింహాసనములను స్థాపింతురు.

16 అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్యదేవతలకు ధూపము వేసి, తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుటయను తమ చెడుతనమంతటినిబట్టి నేను వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటింతును.

17 కాబట్టి నీవు నడుముకట్టుకొని నిలువబడి నేను నీకాజ్ఞాపించునదంతయు వారికి ప్రకటనచేయుము; భయపడకుము లేదా నేను వారి యెదుట నీకు భయము పుట్టింతును.

18 యూదారాజుల యొద్దకు గాని ప్రధానులయొద్దకు గాని యాజకులయొద్దకు గాని దేశనివాసులయొద్దకు గాని, యీ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను, ప్రాకారముగల పట్టణముగాను ఇనుపస్తంభముగాను ఇత్తడి గోడలుగాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించియున్నాను.

19 వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై యున్నందునవారు నీపైని విజయము పొంద జాలరు; ఇదే యెహోవా వాక్కు.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan