Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

న్యాయాధి 1 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 యెహోషువ మృతినొందిన తరువాత ఇశ్రాయేలీయులు–కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయునట్లు ప్రార్థనచేయగా

2 యెహోవా–ఆ దేశమును యూదావంశస్థుల కిచ్చియున్నాను, వారు పోవలెనని సెలవిచ్చెను.

3 అప్పుడు యూదావంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో–మనము కనానీయులతో యుద్ధము చేయుటకు–మా వంతులోనికి మాతోకూడ రండి, మేమును మీతోకూడ మీ వంతులోనికి వచ్చెదమని చెప్పగా షిమ్యోనీయులు వారితోకూడ పోయిరి.

4 కనానీయులమీదికి యూదావంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీయులను వారి కప్పగించెను గనుక వారు బెజెకులో పదివేలమంది మనుష్యులను హతముచేసిరి.

5 వారు బెజెకులో అదోనీ బెజెకును చూచి వానితో యుద్ధముచేసి కనానీయులను పెరిజ్జీయులను హతముచేసిరి.

6 అదోనీ బెజెకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలుచేతుల బొట్టన వ్రేళ్లను కోసివేసిరి.

7 అప్పుడు అదోనీ బెజెకు–తమ కాళ్లు చేతుల బొట్టనవ్రేళ్లు కోయబడిన డెబ్బదిమంది రాజులు నా భోజనపు బల్లక్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చెననెను. వారు యెరూషలేమునకు అతని తోడుకొనిరాగా అతడు అక్కడ చనిపోయెను.

8 యూదావంశస్థులు యెరూషలేముమీదికి యుద్ధము చేసి దానిని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చి వేసిరి.

9 తరువాత యూదావంశస్థులు మన్యములయందును దక్షిణదేశమందును లోయయందును నివసించిన కనానీయులతో యుద్ధము చేయుటకు పోయిరి.

10 మరియు యూదా వంశస్థులు హెబ్రోనులో నివసించిన కనానీయులమీదికి పోయి, షేషయిని అహీమానును తల్మయిని హతముచేసిరి.

11 ఆ హెబ్రోను పేరు కిర్యతర్బా. అక్కడనుండి వారు దెబీరు నివాసులమీదికి పోయిరి. పూర్వము దెబీరు పేరు కిర్యత్సేఫెరు.

12 కాలేబు–కిర్యత్సేఫెరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి పెండ్లిచేసెదనని చెప్పగా

13 కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తెయైన అక్సాను అతనికిచ్చి పెండ్లిచేసెను.

14 ఆమె తన పెనిమిటి యింట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు–నీకేమి కావలెనని యడిగెను

15 అందుకామె–దీవెన దయచేయుము; నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు, నీటి మడుగులను కూడ నాకు దయచేయుమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను.

16 మోషే మామయైన కేయిను కుమారులు యూదా వంశస్థులతోకూడ ఖర్జూరచెట్ల పట్టణములోనుండి అరాదు దక్షిణదిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్లి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి.

17 యూదావంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతోకూడ పోయి జెఫతులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలముచేసి ఆ పట్టణమునకు హోర్మా అను పేరు పెట్టిరి.

18 యూదావంశస్థులు గాజాను దాని ప్రదేశమును అష్కె లోనును దాని ప్రదేశమును ఎక్రోనును దాని ప్రదేశమును పట్టుకొనిరి.

19 యెహోవా యూదావంశస్థులకు తోడై యున్నందునవారు మన్యదేశమును స్వాధీనపరచుకొనిరి. అయితే మైదానమందు నివసించువారికి ఇనుపరథములున్నందున వారిని వెళ్లగొట్టలేకపోయిరి.

20 మోషే చెప్పినట్లువారు కాలేబుకు హెబ్రోను నియ్యగా అతడు ముగ్గురు అనాకీయులను అక్కడనుండి పారదోలి దానిని స్వాధీన పరచుకొనెను.

21 యెరూషలేములో నివసించు యెబూసీ యులను బెన్యామీనీయులు వెళ్లగొట్టలేదు; యెబూసీయులు బెన్యామీనీయులతోకూడ నేటివరకు యెరూషలేములో నివసించుచున్నారు.

22 యోసేపు ఇంటివారు బేతేలుకు వెళ్లినప్పుడు యెహోవావారికి తోడైయుండెను.

23 పూర్వము లూజనబడిన బేతేలును వేగుచూచుటకు యోసేపు ఇంటివారు దూతలను పంపగా

24 ఆ వేగులవారు ఆ పట్టణమునుండి ఒకడు వచ్చుట చూచి–నీవు దయచేసి యీ పట్టణములోనికి వెళ్లు త్రోవను మాకు చూపినయెడల మేము నీకు ఉపకారము చేసెదమని చెప్పిరి.

25 అతడు పట్టణములోనికి పోవు త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణమును కత్తివాత హతము చేసిరిగాని ఆ మనుష్యుని వాని కుటుంబికుల నందరిని పోనిచ్చిరి.

26 ఆ మనుష్యుడు హిత్తీయుల దేశమునకు వెళ్లి ఒక పట్టణమును కట్టించి దానికి లూజు అను పేరుపెట్టెను. నేటివరకు దానికదే పేరు.

27 మనష్షీయులు బేత్షెయానును దాని పల్లెలను, తయి నాకును దాని పల్లెలను, దోరునివాసులను దోరు పల్లెలను, ఇబ్లెయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను, మెగిద్దో పల్లెలను, స్వాధీనపరచుకొనలేదు; ఏలయనగా కనానీయులు ఆ దేశములో నివసింపవలెనని గట్టిపట్టు పెట్టియుండిరి.

28 ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టిపనులు చేయించుకొనిరి కాని వారిని బొత్తిగా వెళ్లగొట్టలేదు.

29 ఎఫ్రాయిమీయులు గెజెరులో నివసించిన కనానీయులను వెళ్లగొట్టలేదు, గెజెరులో కనానీయులు వారిమధ్యను నివసించిరి.

30 జెబూలూనీయులు కిత్రోను నివాసులను నహలోలు నివాసులను వెళ్లగొట్టలేదు, కనానీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టిపనులు చేయువారైరి.

31 ఆషేరీయులు అక్కో నివాసులను సీదోను నివాసులను అహ్లాబు వారిని అక్జీబువారిని హెల్బావారిని ఆఫెకువారిని రెహోబు వారిని

32 మరియు ఆ దేశనివాసులైన కనానీయులను వెళ్లగొట్టక వారి మధ్య నివసించిరి. నఫ్తాలీయులు బేత్షెమెషు వారిని బేతనాతువారిని వెళ్లగొట్టలేదుగాని

33 బేత్షెమెషు నివాసులచేతను బేతనాతు నివాసులచేతను వెట్టి పనులు చేయించుకొనిరి.

34 అమోరీయులు దానీయులను పల్లపు దేశమునకు దిగనియ్యక మన్యమునకు వారిని వెళ్లగొట్టిరి.

35 అమోరీయులు అయ్యాలోను నందలి హెరెసు కొండలోను షయల్బీములోను నివసింపవలెనని గట్టిపట్టు పెట్టియుండగా యోసేపు ఇంటివారు బలవంతులై వారిచేత వెట్టిపనులు చేయించుకొనిరి

36 అమోరీయుల సరిహద్దు అక్రబ్బీము మొదలుకొని హస్సెలావరకు వ్యాపించెను.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan