Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యాకోబు 3 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి.

2 అనేకవిషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును.

3 గుఱ్ఱములు మనకు లోబడుటకై నోటికి కళ్లెముపెట్టి, వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా

4 ఓడలను కూడ చూడుడి; అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కానిచేత త్రిప్పబడును.

5 ఆలాగుననే నాలుక కూడ చిన్న అవయవమైనను బహుగా అదిరి పడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును!

6 నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును.

7 మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతిజాతియు నరజాతి చేత సాధుకాజాలును, సాధు ఆయెను గాని

8 యే నరుడును నాలుకను సాధుచేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే.

9 దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.

10 ఒక్కనోటనుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును; నా సహోదరులారా, యీలాగుండకూడదు.

11 నీటిబుగ్గలో ఒక్క జెలనుండియే తియ్యని నీరును చేదునీరును ఊరునా?

12 నా సహోదరులారా, అంజూరపుచెట్టున ఒలీవ పండ్లయినను ద్రాక్షతీగెను అంజూరపు పండ్లయినను కాయునా? అటువలెనే ఉప్పు నీళ్లలోనుండి తియ్యని నీళ్లును ఊరవు.

13 మీలో జ్ఞాన వివేకములుగలవాడెవడు? వాడు జ్ఞానముతోకూడిన సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను.

14 అయితే మీ హృదయములలో సహింపనలవికానిమత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు.

15 ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్నది.

16 ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.

17 అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది.

18 నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan