Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెషయా 7 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 యూదా రాజైన ఉజ్జియా మనుమడును యోతాము కుమారుడునైన ఆహాజు దినములలో సిరియారాజైన రెజీనును ఇశ్రాయేలురాజును రెమల్యా కుమారుడునైన పెకహును యుద్ధము చేయవలెనని యెరూషలేముమీదికి వచ్చిరి గాని అది వారివలన కాకపోయెను

2 అప్పుడు–సిరియనులు ఎఫ్రాయిమీయులను తోడు చేసికొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా, గాలికి అడవి చెట్లు కదలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలెను.

3 అప్పుడు యెహోవా యెషయాతో ఈలాగు సెలవిచ్చెను–ఆహాజు నెదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షెయార్యాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువకడకు పోయి అతనితో ఈలాగు చెప్పుము

4 –భద్రముసుమీ, నిమ్మళించుము; పొగరాజుచున్న యీ రెండు కొరకంచు కొనలకు, అనగా రెజీనును, సిరియనులు, రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియ నీయకుము.

5 సిరియాయు, ఎఫ్రాయిమును, రెమల్యా కుమారుడును నీకు కీడుచేయవలెనని ఆలోచించుచు

6 మనము యూదా దేశముమీదికి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టాబెయేలను వాని కుమారుని దానికి రాజుగా నియమించెదము రండని చెప్పుకొనిరి.

7 అయితే ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఆ మాట నిలువదు, జరుగదు.

8 దమస్కు సిరియాకు రాజధాని; దమస్కునకు రెజీను రాజు; అరువదియయిదు సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండ నాశనమగును.

9 షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని; షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు; మీరు నమ్మకుండినయెడల స్థిరపడక యుందురు.

10-11 యెహోవా ఇంకను ఆహాజునకు ఈలాగు సెలవిచ్చెను– నీ దేవుడైన యెహోవావలన సూచన నడుగుము. అది పాతాళమంత లోతైనను సరే ఊర్థ్వలోకమంత ఎత్తయినను సరే.

12 ఆహాజు–నేను అడుగను యెహోవాను శోధింపనని చెప్పగా

13 అతడు–ఈలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా, వినుడి; మనుష్యులను విసికించుట చాలదను కొని నా దేవుని కూడ విసికింతురా?

14 కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.

15 కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగు, తేనెను తినును.

16 కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివిరాకమునుపు నిన్ను భయపెట్టు ఆ యిద్దరు రాజుల దేశము పాడుచేయబడును.

17 యెహోవా నీ మీదికిని నీ జనము మీదికిని నీ పితరుల కుటుంబపువారి మీదికిని శ్రమదినములను, ఎఫ్రాయిము యూదానుండి తొలగిన దినము మొదలుకొని నేటివరకు రాని దినములను రప్పించును; ఆయన అష్షూరు రాజును నీమీదికి రప్పించును.

18 ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను, అష్షూరుదేశములోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును.

19 అవి అన్నియు వచ్చి మెట్టల లోయలలోను బండల సందులలోను ముండ్ల పొదలన్నిటిలోను గడ్డి బీళ్లన్నిటిలోను దిగి నిలుచును.

20 ఆ దినమున యెహోవా నది (యూఫ్రటీసు) అద్దరి నుండి కూలికి వచ్చు మంగలకత్తిచేతను, అనగా అష్షూరు రాజు చేతను తలవెండ్రుకలను కాళ్లవెండ్రుకలను క్షౌరము చేయించును, అది గడ్డముకూడను గీచివేయును.

21 ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును రెండు గొఱ్ఱెలను పెంచుకొనగా

22 అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును; ఏలయనగా ఈ దేశములో విడువ బడిన వారందరును పెరుగు తేనెలను తిందురు.

23 ఆ దినమున వెయ్యి వెండి నాణెముల విలువగల వెయ్యి ద్రాక్షచెట్లుండు ప్రతి స్థలమున గచ్చపొదలును బలు రక్కసి చెట్లును పెరుగును.

24 ఈ దేశమంతయు గచ్చ పొదలతోను బలురక్కసి చెట్లతోను నిండియుండును గనుక బాణములను విండ్లను చేతపట్టుకొని జనులు అక్క డికి పోవుదురు.

25 పారచేత త్రవ్వబడుచుండిన కొండలన్నిటిలోనున్న బలురక్కసి చెట్ల భయముచేతను గచ్చ పొదల భయముచేతను జనులు అక్కడికి పోరు; అది యెడ్లను తోలుటకును గొఱ్ఱెలు త్రొక్కుటకును ఉప యోగమగును.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan