Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెషయా 52 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 సీయోనూ, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్ర ములను ధరించుకొనుము ఇకమీదట సున్నతిపొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు.

2 ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము చెరపట్టబడిన సీయోను కుమారీ, నీ మెడకట్లు విప్పివేసికొనుము.

3 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –మీరు ఊరకయే అమ్మబడితిరి గదా రూకలియ్యకయే మీరు విమోచింపబడెదరు.

4 దేవుడైన యెహోవా అనుకొనుచున్న దేమనగా తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి. మరియు అష్షూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరచెను.

5 నా జనులు ఊరకయే కొనిపోబడియున్నారు వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు ఇదే యెహోవా వాక్కు దినమెల్ల నా నామము దూషింపబడుచున్నది

6 కావున ఇచ్చట నేనేమి చేయవలెను? ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా నామము తెలిసికొందురు నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దిన మున తెలిసికొందురు.

7 సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి.

8 ఆలకించుము నీ కావలివారు పలుకుచున్నారు కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు యెహోవా సీయోనును మరల రప్పించగా వారు కన్నులార చూచుచున్నారు.

9 యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా, ఉత్సహించి యేకముగా సంగీతగానము చేయుడి యెహోవా తన జనులను ఆదరించెను యెరూష లేమును విమోచించెను.

10 సమస్తజనముల కన్నులయెదుట యెహోవా తన పరిశుద్ధబాహువును బయలుపరచి యున్నాడు. భూదిగంత నివాసులందరు మన దేవుని రక్షణ చూచెదరు.

11 పోవుడి పోవుడి అచ్చటనుండి వెళ్లుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దానియొద్దనుండి తొలగిపోవుడి యెహోవా సేవోపకరణములను మోయువారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి

12 మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవురీతిగా వెళ్లరు. యెహోవా మీ ముందర నడచును ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును

13 ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహా ఘనుడుగా ఎంచబడును.

14 నిన్ను చూచి యే మనిషిరూపముకంటె అతని ముఖ మును, నరరూపముకంటె అతని రూపమును చాల వికారమని చాలమంది యేలాగు విస్మయమొందిరో

15 ఆలాగే అతడు అనేక జనములను చిలకరించును రాజులు అతని చూచి నోరు మూసికొనెదరు తమకు తెలియజేయబడని సంగతులువారు చూచెదరు తాము విననిదానిని గ్రహింతురు.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan