Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెషయా 38 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతనియొద్దకు వచ్చి–నీవు మరణమవుచున్నావు, బ్రదుకవు గనుక నీవు నీ యిల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా

2 అతడు తనముఖమును గోడతట్టు త్రిప్పుకొని

3 –యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో, కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా

4 యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

5 –నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము–నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చున దేమనగా–నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను;

6 ఇంక పదిహేను సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరురాజు చేతిలో పడకుండ విడిపించెదను.

7 యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవావలన నీకు కలిగిన సూచన;

8 ఆహాజు ఎండ గడియారముమీద సూర్యుని కాంతిచేత దిగిన నీడ మరల పదిమెట్లు ఎక్క జేసెదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పది మెట్లు మరల ఎక్కెను.

9 యూదారాజైన హిజ్కియా రోగియై ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచియించినది.

10 –నా దినములమధ్యాహ్నకాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను. నా ఆయుశ్శేషము పోగొట్టుకొని యున్నాను.

11 యెహోవాను, సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుదును. మృతుల లోకనివాసినై ఇకను మనుష్యులను కానక పోవుదునని నేననుకొంటిని.

12 నా నివాసము పెరికివేయబడెను గొఱ్ఱెలకాపరి గుడిసెవలె అది నాయొద్దనుండి ఎత్తి కొని పోబడెను. నేయువాడు తన పని చుట్టుకొనునట్లు నేను నా జీవము ముగించుచున్నాను ఆయన నన్ను బద్దెనుండి కత్తిరించుచున్నాడు ఒక దినములోగా నీవు నన్ను సమాప్తిచేయుచున్నావు.

13 ఉదయమగువరకు ఓర్చుకొంటిని సింహము ఎముకలను విరచునట్లు నొప్పిచేత నా యెముకలన్నియు విరువబడెను ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తిచేయుదువు

14 మంగలకత్తి పిట్టవలెను ఓదెకొరుకువలెను నేను కిచకిచ లాడితిని గువ్వవలె మూల్గితిని ఉన్నతస్థలముతట్టు చూచి చూచి నాకన్నులు క్షీణిం చెను నాకు శ్రమ కలిగెను; యెహోవా, నాకొరకు పూట బడి యుండుము.

15 నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమునుబట్టి నా సంవత్సరములన్నియు నేను మెల్లగా నడచు కొందును.

16 ప్రభువా, వీటివలన మనుష్యులు జీవించుదురు వీటివలననే నా ఆత్మ జీవించుచున్నది నీవు నన్ను బాగుచేయుదువు నన్ను జీవింపజేయు దువు

17 మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను నీ ప్రేమచేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుకతట్టు నా పాపములన్నియు నీవు పార వేసితివి.

18 పాతాళమున నీకు స్తుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతా స్తుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయిం చరు.

19 సజీవులు, సజీవులే గదా నిన్ను స్తుతించుదురు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించు చున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు యెహోవా నన్ను రక్షించువాడు

20 మన జీవితదినములన్నియు యెహోవా మందిరములో తంతివాద్యములు వాయింతుము.

21 మరియు యెషయా–అంజూరపుపండ్ల ముద్ద తీసికొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను.

22 మరియు హిజ్కియా–నేను యెహోవా మందిరమునకు పోయెదననుటకు గురుతేమని యడిగి యుండెను.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan