Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెషయా 19 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 ఐగుప్తునుగూర్చిన దేవోక్తి –యెహోవా వేగముగల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును ఐగుప్తీయుల గుండె కరగుచున్నది

2 నేను ఐగుప్తీయులమీదికి ఐగుప్తీయులను రేపెదను సహోదరులమీదికి సహోదరులు పొరుగువారిమీదికి పొరుగువారు లేచుదురు పట్టణముతో పట్టణము యుద్ధము చేయును రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును

3 ఐగుప్తీయులయొక్క శౌర్యము నశించునువారి ఆలోచనశక్తిని నేను మాన్పివేసెదను కావునవారు విగ్రహములయొద్దకును గొణుగువారి యొద్దకును కర్ణపిశాచిగలవారియొద్దకును సోదెగాండ్రయొద్దకును విచారింప వెళ్లుదురు.

4 నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించె దను బలాత్కారుడైన రాజు వారి నేలును అని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

5 సముద్రజలములు ఇంకిపోవును నదియును ఎండి పొడినేల యగును

6 ఏటి పాయలును కంపుకొట్టును ఐగుప్తు కాలువలు ఇంకి యెండిపోవును రెల్లును తుంగలును వాడిపోవును.

7 నైలునదీప్రాంతమున దాని తీరముననున్న బీడులును దానియొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడక పోవును.

8 జాలరులును దుఃఖించెదరు నైలునదిలో గాలములు వేయువారందరు ప్రలాపించె దరు జలములమీద వలలు వేయువారు కృశించిపోవుదురు

9 దువ్వెనతో దువ్వబడు జనుపనారపని చేయువారును తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు. రాజ్య స్తంభములు పడగొట్టబడును

10 కూలిపని చేయువారందరు మనోవ్యాధి పొందుదురు.

11 ఫరోయొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు సోయను అధిపతులు కేవలము అవివేకులైరి. ఆలోచనశక్తి పశుప్రాయమాయెను నేను జ్ఞాని కుమారుడను పూర్వపురాజుల కుమారుడనని ఫరోతో మీరెట్లు చెప్పుదురు?

12 నీ జ్ఞానులు ఏమైరి? సైన్యములకధిపతియగు యెహోవా ఐగుప్తునుగూర్చి నిర్ణయించినదానిని వారు గ్రహించి నీతో చెప్ప వలెను గదా?

13 సోయను అధిపతులు అవివేకులైరి నోపు అధిపతులు మోసపోయిరి. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి

14 యెహోవా ఐగుప్తుమీద మూర్ఖతగల ఆత్మను కుమ్మరించి యున్నాడు మత్తుడు తన వాంతిలో తూలిపడునట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తూలచేసియున్నారు

15 తలయైనను తోకయైనను కొమ్మయైనను రెల్లు అయినను ఐగుప్తులో పని సాగింపువారెవరును లేరు

16 ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీలవంటివారగుదురు. సైన్యములకధిపతియగు యెహోవావారిపైన తన చెయ్యి ఆడించును ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వణకి భయ పడుదురు.

17 యూదాదేశము ఐగుప్తునకు భయంకరమగును తమకు విరోధముగా సైన్యములకధిపతియగు యెహోవా ఉద్దేశించినదానినిబట్టి ఒకడు ప్రస్తాపించిన యెడల ఐగుప్తీయులు వణకుదురు.

18 ఆ దినమున కనానుభాషతో మాటలాడుచు యెహోవా వారమని ప్రమాణముచేయు అయిదు పట్టణములు ఐగుప్తుదేశములో ఉండును, వాటిలో ఒకటి నాశనపురము.

19 ఆ దినమున ఐగుప్తుదేశముమధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన యొక స్తంభమును ఉండును.

20 అది ఐగుప్తుదేశములో సైన్యములకధిపతియగు యెహో వాకు సూచనగాను సాక్ష్యార్థముగాను ఉండును. బాధకులనుగూర్చి వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన యొక రక్షకుని పంపును అతడు వారిని విమోచించును.

21 ఐగుప్తీయులు తెలిసికొనునట్లు యెహోవా తన్ను వెల్లడిపరచుకొనును ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలిసి కొందురువారు బలి నైవేద్యముల నర్పించి ఆయనను సేవించెదరు యెహోవాకు మ్రొక్కుకొనెదరు తాము చేసికొనిన మ్రొక్కుబడులను చెల్లించెదరు.

22 యెహోవావారిని కొట్టును స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టునువారు యెహోవావైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన నంగీకరించి వారిని స్వస్థపరచును.

23 ఆ దినమున ఐగుప్తునుండి అష్షూరుకు రాజమార్గ మేర్పడును అష్షూరీయులు ఐగుప్తునకును ఐగుప్తీయులు అష్షూరున కును వచ్చుచు పోవుచునుందురు ఐగుప్తీయులును అష్షూరీయులును యెహోవాను సేవిర చెదరు.

24 ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతోకూడ ఇశ్రాయేలు మూడవ జనమై భూమిమీద ఆశీర్వాద కారణముగనుండును.

25 సైన్యములకధిపతియగు యెహోవా –నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పనియైన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వ దించును.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan