నిర్గమ 11 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–ఫరో మీదికిని ఐగుప్తుమీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటుతరువాత అతడు ఇక్కడనుండి మిమ్మును పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చునప్పుడు ఇక్కడనుండి మిమ్మును బొత్తిగా వెళ్లగొట్టును. 2 కాబట్టి తన చెలికానియొద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తెయొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసికొనుడని ప్రజలతో చెప్పుము. 3 యెహోవా ప్రజలయెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను; అదిగాక ఐగుప్తుదేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను. 4 మోషే ఫరోతో ఇట్లనెను–యెహోవా సెలవిచ్చిన దేమనగా–మధ్యరాత్రి నేను ఐగుప్తుదేశములోనికి బయలు వెళ్లెదను. 5 అప్పుడు సింహాసనముమీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్లవరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లలందరును చచ్చెదరు; జంతు వులలోను తొలిపిల్లలన్నియు చచ్చును. 6 అప్పుడు ఐగుప్తు దేశమందంతట మహా ఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇకమీదట పుట్టదు. 7 యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడునట్లు, మనుష్యులమీదగాని జంతు వులమీదగాని ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. 8 అప్పుడు నీ సేవకు లైన వీరందరు నా యొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసి–నీవును, నిన్ను ఆశ్రయించియున్న యీ ప్రజలందరును బయలు వెళ్లుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్లుదుననెను. మోషే ఆలాగు చెప్పి ఫరో యొద్దనుండి అత్యాగ్రహముతో వెళ్లిపోయెను. 9 అప్పుడు యెహోవా–ఐగుప్తుదేశములో నా మహ త్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను. 10 మోషే అహరోనులు ఫరో యెదుట ఈ మహత్కార్యములను చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు తన దేశములోనుండి ఇశ్రాయేలీయులను పోనియ్య డాయెను. |
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India