Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

నిర్గమ 1 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేరులు ఏవనగా, రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను బెన్యామీను.

2-5 దాను నఫ్తాలి గాదు ఆషేరు. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టినవారందరు డెబ్బదిమంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను.

6 యోసేపును అతని అన్నదమ్ములందరును ఆ తరము వారందరును చనిపోయిరి.

7 ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబ లిరి; వారున్న ప్రదేశము వారితో నిండి యుండెను.

8 అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్తరాజు ఐగుప్తును ఏల నారంభించెను.

9 అతడు తన జనులతో ఇట్లనెను– ఇదిగో ఇశ్రాయేలు సంతతియైన యీ జనము మనకంటె విస్తారముగాను బలిష్ఠముగాను ఉన్నది.

10 వారు విస్తరింపకుండునట్లు మనము వారియెడల యుక్తిగా జరిగించుదము రండి; లేనియెడల యుద్ధము కలుగునప్పుడు కూడ మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధముచేసి యీ దేశములోనుండి, వెళ్లిపోదురేమో అనెను.

11 కాబట్టి వారిమీద పెట్టిన భారములలో వారిని శ్రమపెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారిమీద నియ మింపగా వారు ఫరోకొరకు ధాన్యాదులను నిలువచేయు పీతోము రామెసేసను పట్టణములను కట్టిరి.

12 అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టినకొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల యెడల అసహ్య పడిరి.

13 ఇశ్రాయేలీయులచేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి;

14 వారు ఇశ్రాయేలీయులచేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములోచేయు ప్రతిపనిలోను కఠినసేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి.

15 మరియు ఐగుప్తురాజు షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాటలాడి

16 –మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసానిపని చేయుచు వారిని కాన్పుపీటలమీద చూచినప్పుడు మగవాడైనయెడల వాని చంపుడి, ఆడుదైనయెడల దాని బ్రదుకనియ్యుడని వారితో చెప్పెను.

17 అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, ఐగుప్తురాజు తమ కాజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రదుకనియ్యగా

18 ఐగుప్తురాజు ఆ మంత్రసానులను పిలిపించి–మీరెందుకు మగపిల్లలను బ్రదుకనిచ్చితిరి? ఈ పని యేల చేసితిరి అని అడిగెను.

19 అందుకు ఆ మంత్ర సానులు–హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలవంటివారు కారు; వారు చురుకైనవారు. మంత్రసాని వారియొద్దకు వెళ్లకమునుపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పిరి.

20 దేవుడు ఆ మంత్రసానులకు మేలుచేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను.

21 ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను.

22 అయితే ఫరో–హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రదుకనియ్యుడి అని తన జనులందరికి ఆజ్ఞాపించెను.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan