Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ఎఫెసీయులకు 2 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతోకూడ బ్రదికించెను.

2 మీరు వాటినిచేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పునమునుపు నడుచుకొంటిరి.

3 వారితో కలిసి మనమందరమును శరీరముయొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించిమునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి.

4-5 అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను. కృప చేత మీరు రక్షింపబడియున్నారు.

6 క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచునిమిత్తము,

7 క్రీస్తుయేసునందు మనలను ఆయనతోకూడ లేపి, పరలోకమందు ఆయనతోకూడ కూర్చుండబెట్టెను.

8 మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.

9 అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.

10 మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.

11 కాబట్టిమునుపు శరీరవిషయములో అన్యజనులైయుండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారిచేత సున్నతిలేనివారనబడిన మీరు

12 ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోకమందు దేవుడులేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులైయుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.

13 అయిననుమునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు.

14 ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను.

15 ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి,

16 తన సిలువవలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధానపరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.

17 మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.

18 ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రిసన్నిధికి చేరగలిగియున్నాము.

19 కాబట్టి మీరిక మీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు.

20 క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

21 ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది.

22 ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan