Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

దానియేలు 3 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమయొకటి చేయించి, బబులోనుదేశములోని దూరాయను మైదానములో దాని నిలువబెట్టించెను. అది అరువదిమూరల ఎత్తును ఆరుమూరల వెడల్పునై యుండెను.

2 రాజగు నెబుకద్నెజరు అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధి క్యము వహించినవారినందరిని సమకూర్చుటకును, రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమయొక్క ప్రతిష్ఠకు రప్పించుటకును దూతలను పంపించగా

3 ఆ యధిపతులును సేనాధిపతులును సంస్థానాధిపతులును మంత్రులును ఖజానాదారులును ధర్మశాస్త్రవిధాయకులును న్యాయాధిపతులును సంస్థానములలో ఆధిక్యము వహించినవారందరును రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమయొక్క ప్రతిష్ఠకు కూడివచ్చి, రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమయెదుట నిలుచుండిరి.

4 ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా–జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాటలాడువారలారా, మీకాజ్ఞ ఇచ్చుచున్నాను.

5 ఏమనగా, బాకా పిల్లంగ్రోవి పెద్ద వీణె సుంఫోనీయ వీణె విపంచిక సకలవిధములగు వాద్య ధ్వనులు మీకు వినబడునప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమయెదుట సాగిలపడి నమస్కరించుడి.

6 సాగిలపడి నమస్కరింపనివాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును.

7 సకల జనులకు బాకా పిల్లంగ్రోవి పెద్దవీణె వీణె సుంఫోనీయ విపంచిక సకలవిధములగు వాద్యధ్వనులు వినబడగా ఆ జనులును దేశస్థులును ఆయా భాషలు మాటలాడువారును సాగిలపడి, రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి.

8 ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైని కొండెములుచెప్పి

9 రాజగు నెబుకద్నెజరు నొద్ద ఈలాగు మనవిచేసిరి–రాజు చిరకాలము జీవించును గాక.

10 రాజా, తాము ఒక కట్టడ నియమించితిరి; ఏదనగా బాకాను పిల్లంగ్రోవిని పెద్దవీణెను వీణెను విపంచికను సుంఫోనీయను సకల విధములగు వాద్యధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను.

11 సాగిలపడి నమస్కరింపనివాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును.

12 రాజా, తాము షద్రకు, మేషాకు, అబేద్నగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాచకార్యములు విచారించుటకు నియమించితిరి; ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి.

13 అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకును మేషాకును అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుష్యులను పట్టుకొని రాజసన్నిధికి తీసికొని వచ్చిరి.

14 అంతట నెబుకద్నెజరు వారితో ఇట్లనెను – షద్రకూ, మేషాకూ, అబేద్నెగో మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదనియు నాకు వినబడినది. అది నిజమా?

15 బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణెను వీణెను సుంఫోనీయను విపంచికను సకలవిధములగు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండినయెడల సరే మీరు నమస్కరింపని యెడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు; నా చేతిలోనుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడ నున్నాడు?

16 షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి–నెబుకద్నెజరూ, యిందునుగురించి నీకు ప్రత్యుత్తర మియ్యవలెనన్న చింత మాకు లేదు.

17 మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు; మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును; ఒక వేళ ఆయన రక్షింపకపోయినను

18 రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము.

19 అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయెను గనుక గుండము ఎప్పటికన్న ఏడంతలు వేడిమిగా చేయుమని యాజ్ఞ ఇచ్చెను.

20 మరియు తన సైన్యములోనుండు బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి–షద్రకును, మేషాకును, అబేద్నెగోను బంధించి వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా

21 వారు వారి అంగీలను నిలువుటంగీలను పైవస్త్రములను తక్కిన వస్త్రములను తియ్యకయే, యున్నపాటున ముగ్గురిని వేడిమి గలిగి మండుచున్న ఆ గుండమునడుమ పడవేసిరి.

22 రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమిగలదైనందునను షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలలచేత కాల్చబడి చనిపోయిరి.

23 షద్రకు, మేషాకు, అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుష్యులు బంధింపబడినవారై వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో పడగా

24 రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవరముగ లేచి–మేము ముగ్గురు మనుష్యులను బంధించి యీ అగ్నిలో వేసితిమిగదా యని తన మంత్రుల నడిగెను. వారు–రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తర మిచ్చిరి.

25 అందుకు రాజు–నేను నలుగురు మనుష్యులు బంధకములులేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను; వారికి హాని యేమియు కలుగలేదు; నాల్గవవాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను.

26 అంతట నెబుకద్నెజరు వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి–షద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికివచ్చి నాయొద్దకు రండని పిలువగా, షద్రకు, మేషాకు, అబేద్నెగో ఆ అగ్నిలోనుండి బయటికి వచ్చిరి.

27 అధిపతులును సేనాధిపతులును సంస్థానాధిపతులును రాజుయొక్క ప్రధాన మంత్రులును కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి, వారి శరీరములకు అగ్ని యేహాని చేయకుండుటయు, వారి తలవెండ్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనయైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి.

28 నెబుకద్నెజరు–షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు; ఆయన తన దూతనంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికిగాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజుయొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి.

29 కాగా నేనొక శాసనము నియమించుచున్నాను; ఏదనగా, ఇవ్విధముగ రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలోగాని రాష్టములో గాని యేభాష మాటలాడువారిలో గాని షద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును; వాని యిల్లు ఎప్పుడును పెంటకుప్పగా ఉండుననెను.

30 అంతటనుండి రాజు షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan