Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కొలొస్సయులకు 4 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని యెరిగి, న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసులయెడల చేయుడి.

2-4 ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమునుగూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమ యము దేవుడు దయచేయవలెనని మాకొరకు ప్రార్థించుడి.

5 సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, సంఘమునకు వెలుపటి వారియెడల జ్ఞానము కలిగి నడుచు కొనుడి.

6 ప్రతిమనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్య వలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి.

7 ప్రియసహోదరుడును, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును, నా తోడి సేవకుడునైన తుకికు నన్నుగూర్చిన సంగతులన్నియు మీకు తెలియజేయును.

8-9 మీరు మా స్థితి తెలిసికొనునట్లును మీ హృదయములను అతడు ఆదరించునట్లును, అతనిని అతనితోకూడ నమ్మకమైన ప్రియసహోదరుడైన ఒనేసిమును మీయొద్దకు పంపుచున్నాను; ఇతడు మీ యొద్దనుండి వచ్చినవాడే; వీరిక్కడి సంగతులన్నియు మీకు తెలియజేతురు.

10 నాతోకూడ చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీపజ్ఞాతియైన మార్కును మీకు వందనములు చెప్పు చున్నారు; ఈ మార్కునుగూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతడు మీయొద్దకు వచ్చినయెడల ఇతని చేర్చుకొనుడి.

11 మరియు యూస్తు అను యేసు కూడ మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందినవారిలో చేరినవారు, వీరుమాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై యున్నారు, వీరివలన నాకు ఆదరణ కలిగెను.

12 మీలో ఒకడును క్రీస్తుయేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు; మీరు సంపూర్ణులును, ప్రతి విషయములో దేవుని చిత్తమునుగూర్చి సంపూర్ణాత్మ నిశ్చయతగలవారునై నిలుకడగా ఉండవలెనని యితడెల్లప్పుడును మీకొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు.

13 ఇతడు మీకొరకును, లవొదికయవారి కొరకును, హియెరా పొలివారికొరకును బహు ప్రయాసపడుచున్నాడని యితనినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను.

14 లూకా అను ప్రియుడైన వైద్యుడును, దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు.

15 లవొదికయలో ఉన్న సహోదరులకును, నుంఫాకును, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి.

16 ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవొదికయ వారి సంఘములోను చది వించుడి; లవొదికయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి.

17 మరియు–ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిగూర్చి జాగ్రత్త పడుమని అర్ఖిప్పుతో చెప్పుడి.

18 పౌలను నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయుచున్నాను; నా బంధకములను జ్ఞాపకము చేసి కొనుడి. కృప మీకు తోడై యుండును గాక.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan