కొలొస్సయులకు 2 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 మీ కొరకును, లవొదికయ వారి కొరకును, శరీర రీతిగా నా ముఖము చూడనివారందరికొరకును 2 నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొనగోరు చున్నాను. వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. 3 బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి. 4 ఎవడైనను చక్కని మాటలచేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. 5 నేను శరీరవిషయములో దూరముగా ఉన్నను ఆత్మవిషయములో మీతోకూడ ఉండి, మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిరవిశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. 6-7 కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి. 8 ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. 9 ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది; 10 మరియు ఆయనయందు మీరును సంపూర్ణులై యున్నారు; ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై యున్నాడు; 11 మీరును, క్రీస్తు సున్నతియందు, శరీరేచ్ఛలతోకూడిన స్వభావమును విసర్జించి ఆయనయందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. 12 మీరు బాప్తిస్మమందు ఆయనతోకూడ పాతిపెట్టబడినవారై ఆయనను మృతులలోనుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతోకూడ లేచితిరి. 13-15 మరియు అపరాధముల వలనను, శరీరమందు సున్నతిపొందక యుండుటవలనను, మీరు మృతులై యుండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి, ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను; ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పెట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. 16 కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి. 17 ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది 18-19 అతి వినయాసక్తుడై దేవదూతా రాధనయందు ఇచ్ఛకలిగి, తాను చూచినవాటినిగూర్చి గొప్పగా చెప్పుకొనుచు, తన శరీరసంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనియ్యకుడి; ఆ శిరస్సుమూలముగా సర్వశరీరము కీళ్లచేతను నరములచేతను పోషింపబడి అతుకబడినదై, దేవునివలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. 20-22 మీరు క్రీస్తుతోకూడ లోకముయొక్క మూలపాఠముల విషయమై మృతిపొందినవారైతే లోకములో బ్రదుకు చున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి–చేతపట్టుకొనవద్దు, రుచిచూడవద్దు, ముట్టవద్దు అను విధు లకు మీరు లోబడనేల? అవన్నియు వాడుకొనుటచేత నశించిపోవును. 23 అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవని యెంచబడుచున్నవేగాని, శరీరేచ్ఛానిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. |
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India