Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కొలొస్సయులకు 1 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 కొలొస్సయిలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు,

2 దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమనిచెప్పి వ్రాయునది. మన తండ్రియైన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక.

3-4 పరలోకమందు మీకొరకు ఉంచబడిన నిరీక్షణనుబట్టి, క్రీస్తుయేసునందు మీకు కలిగియున్న విశ్వాసమునుగూర్చియు, పరిశుద్ధులందరిమీద మీకున్న ప్రేమనుగూర్చియు, మేము విని యెల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థనచేయుచు, మన ప్రభువగు యేసు క్రీస్తుయొక్క తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.

5 మీయొద్దకు వచ్చిన సువార్త సత్యమునుగూర్చిన బోధవలన ఆ నిరీక్షణనుగూర్చి మీరు ఇంతకుముందు వింటిరి.

6 ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు, వ్యాపించు చున్నట్టుగా మీరు దేవుని కృపనుగూర్చి విని సత్యముగా గ్రహించిన నాటనుండి మీలో సయితము ఫలించుచు వ్యాపించుచున్నది.

7 ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడిదాసునివలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి.

8 అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు; అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు.

9-12 అందుచేత ఈ సంగతి వినిననాటనుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమునుగలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతోకూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగాచేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలు చున్నాము.

13 ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను.

14 ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ కలుగుచున్నది.

15 ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.

16 ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.

17 ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.

18 సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను.

19-20 ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు, ఆయన సిలువరక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను.

21 మరియు గతకాలమందు దేవునికి దూరస్థులును, మీ దుష్‌క్రియలవలన మీ మనస్సులో విరోధభావముగలవారునైయుండిన మిమ్మును కూడ

22 తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణమువలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను.

23 పునాదిమీద కట్టబడినవారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు, ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్తవలన కలుగు నిరీక్షణనుండి తొలగిపోక, విశ్వాసమందు నిలిచి యుండినయెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.

24 ఇప్పుడు మీకొరకు నేను అనుభవించుచున్నశ్రమలయందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడినపాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను.

25-26 దేవుని వాక్యమును, అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడియున్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు, మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని యేర్పాటు ప్రకారము, నేను ఆ సంఘమునకు పరిచార కుడనైతిని.

27 అన్యజనులలో ఈ మర్మముయొక్క మిహ మైశ్వర్యము ఎట్టిదో అది, అనగా మీయందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై యున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి యిప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను.

28 ప్రతిమనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతిమనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతిమనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము.

29 అందునిమిత్తము నాలో బలముగా, కార్యసిద్ధికలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan