Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

అపొస్తలుల 4 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 వారు ప్రజలతో మాటలాడుచుండగా, యాజకులును దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులును

2 వారు ప్రజ లకు బోధించుటయు, యేసునుబట్టి మృతులలోనుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారిమీదికివచ్చి

3 వారిని బలాత్కారముగా పట్టుకొని, సాయంకాలమైనందున మరునాటివరకు వారిని కావలిలో ఉంచిరి.

4 వాక్యము వినినవారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్యయించుమించు అయిదువేలు ఆయెను.

5 మరునాడు వారి అధికారులును పెద్దలును శాస్త్రులును యెరూషలేములో కూడుకొనిరి.

6 ప్రధానయాజకుడైన అన్నయు కయపయు, యోహానును అలెక్సంద్రును ప్రధానయాజకుని బంధువులందరు వారితోకూడ ఉండిరి.

7 వారు పేతురును యోహానునుమధ్యను నిలువబెట్టి– మీరు ఏ బలముచేత ఏ నామమునుబట్టి దీనిని చేసితిరని అడుగగా

8 పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై యిట్లనెను –ప్రజల అధికారులారా, పెద్దలారా,

9 ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమునుగూర్చి వాడు దేనివలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక

10 మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలిసికొనవలసినదేమనగా, మీరు సిలువవేసినట్టియు, మృతులలోనుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామ ముననే వీడు స్వస్థతపొంది మీ యెదుట నిలుచుచున్నాడు.

11 ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే; ఆ రాయి మూలకు తలరాయి ఆయెను.

12 మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.

13 వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి.

14 స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితోకూడ నిలిచియుండుట చూచి యేమియు ఎదురు చెప్పలేకపోయిరి.

15 అప్పుడు –సభ వెలుపలికి పొండని వారికాజ్ఞాపించి తమలోతాము ఆలోచనచేసి

16 –ఈ మనుష్యులను మనమేమి చేయుదము? వారిచేత ప్రసిద్ధమైన సూచకక్రియ చేయబడియున్నదని యెరూషలేములో కాపురమున్న వారికందరికి స్పష్టమే, అది జరుగలేదని చెప్పజాలము.

17 అయినను ఇది ప్రజలలో ఇంక వ్యాపింపకుండుటకై– ఇకమీదట ఈ నామమునుబట్టి యే మనుష్యులతోనైనను మాటలాడకూడదని మనము వారిని బెదరుపెట్టవలెనని చెప్పుకొనిరి.

18 అప్పుడు వారిని పిలిపించి–మీరు యేసు నామమునుబట్టి యెంతమాత్రమును మాటలాడకూడదు, బోధింపనుకూడదని వారికాజ్ఞాపించిరి.

19 అందుకు పేతురును యోహానును వారినిచూచి–దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవునిదృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి;

20 మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి;

21 ప్రజలందరు జరిగిన దానినిగూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి, వీరిని శిక్షించు విధమేమియు కనుగొన లేక వీరిని గట్టిగా బెదరించి విడుదలచేసిరి.

22 స్వస్థ పరచుట అను ఆ సూచకక్రియ యెవని విషయములో చేయబడెనో వాడు నలువది ఏండ్లకంటె ఎక్కువ వయస్సు గలవాడు.

23 వారు విడుదల నొంది తమ స్వజనులయొద్దకు వచ్చి, ప్రధానయాజకులును పెద్దలును తమతో చెప్పిన మాటల నన్నిటిని వారికి తెలిపిరి.

24 వారు విని, యేక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొఱపెట్టిరి. –నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవాడవు.

25 –అన్యజనులు ఏల అల్లరి చేసిరి?

26 ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి? ప్రభువుమీదను ఆయన క్రీస్తుమీదను భూరాజులు లేచిరి, అధికారులును ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి.

27-28 ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో, వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.

29 ప్రభువా, ఈ సమయమునందు వారి బెదరింపులు చూచి

30 రోగులను స్వస్థపరచుటకును, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములనుచేయుటకును నీ చెయ్యి చాచియుండగా, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము.

31 వారు ప్రార్థనచేయగానే వారు కూడి యున్న చోటు కంపించెను; అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి.

32 విశ్వసించినవారందరును ఏకహృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు; వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను.

33 ఇదియుగాక అపొస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమునుగూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా ఉండెను.

34 భూములైనను ఇండ్లయినను కలిగినవారందరు వాటిని అమ్మి, అమ్మిన వాటి వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టుచు వచ్చిరి.

35 వారు ప్రతివానికి వానివాని అక్కరకొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను.

36 కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒక డుండెను. ఇతనికి అపొస్తలులు, హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమిగలవాడైయుండి దానిని అమ్మి

37 దాని వెల తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan