Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 సమూయేలు 2 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 ఇది జరిగిన తరువాత–యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవాయొద్ద విచారణ చేయగా–పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. –నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా–హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను.

2 కాబట్టి యెజ్రెయేలీయురాలగు అహీనోయము, కర్మెలీయుడగు నాబాలునకు భార్యయైన అబీగయీలు అను తన యిద్దరు భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయెను.

3 మరియు దావీదు తనయొద్ద నున్నవారినందరిని వారి వారి యింటివారిని తోడుకొని వచ్చెను; వీరు హెబ్రోను గ్రామములలో కాపురముండిరి.

4 అంతట యూదావారు అక్కడికి వచ్చి యూదావారిమీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి.

5 సౌలును పాతిపెట్టినవారు యాబేష్గిలాదువారని దావీదు తెలిసికొని యాబేష్గిలాదువారియొద్దకు దూతలను పంపి–మీరు ఉపకారము చూపి మీ యేలినవాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవాచేత మీరు ఆశీర్వచనము నొందుదురు గాక.

6 యెహోవా మీకు కృపను సత్యస్వభావమును అగపరచును, నేనును మీరు చేసిన యీ క్రియనుబట్టి మీకు ప్రత్యుపకారము చేసెదను.

7 మీ యజమానుడగు సౌలు మృతినొందెనుగాని యూదావారు నాకు తమమీద రాజుగా పట్టాభిషేకము చేసియున్నారు గనుక మీరు ధైర్యము తెచ్చుకొని బలాఢ్యులై యుండుడని ఆజ్ఞనిచ్చెను.

8-10 నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలుయొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహ నయీమునకు తోడుకొనిపోయి, గిలాదువారిమీదను ఆషేరీయులమీదను యెజ్రెయేలుమీదను ఎఫ్రాయి మీయులమీదను బెన్యామీనీయులమీదను ఇశ్రాయేలు వారిమీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను. సౌలు కుమారుడగు ఇష్బోషెతు నలువదేండ్లవాడై యేలనారంభించి రెండు సంవత్సరములు పరిపాలించెను; అయితే యూదావారు దావీదు పక్షమున నుండిరి.

11 దావీదు హెబ్రోనులో యూదావారిమీద ఏలినకాల మంతయు ఏడు సంవత్సరముల ఆరు మాసములు.

12 అంతలో నేరు కుమారుడగు అబ్నేరును సౌలు కుమారుడగు ఇష్బోషెతు సేవకులును మహనయీములోనుండి బయలుదేరి గిబియోనునకు రాగా

13 సెరూయా కుమారుడగు యోవాబును దావీదు సేవకులును బయలుదేరి వారి నెదిరించుటకై గిబియోను కొలనునకు వచ్చిరి. వీరు కొలనునకు ఈతట్టునను వారు కొలనునకు ఆతట్టునను దిగి యుండగా

14 అబ్నేరు లేచి–మన యెదుట యౌవనులు మల్లచేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా యోవాబు–వారు చేయవచ్చుననెను.

15 లెక్కకు సరిగా సౌలు కుమారుడగు ఇష్బోషెతు సంబంధులైన పన్నిద్దరు మంది బెన్యామీనీయులును దావీదు సేవకులలో పన్నిద్దరు మందియును లేచి మధ్య నిలిచిరి.

16 ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకొని వాని ప్రక్కను కత్తితో పొడువగా అందరు తటాలున పడిరి. అందువలన హెల్కత్హన్సూరీమని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. అది గిబియోనునకు సమీపము.

17 తరువాత ఆ దినమున ఘోరయుద్ధము జరుగగా అబ్నేరును ఇశ్రాయేలువారును దావీదు సేవకుల యెదుట నిలువలేక పారిపోయిరి.

18 సెరూయా ముగ్గురు కుమారులగు యోవాబును అబీషైయును అశాహేలును అచ్చటనుండిరి. అశాహేలు అడవిలేడియంత తేలికగా పరుగెత్తగలవాడు గనుక

19 అతడు కుడితట్టయినను ఎడమతట్టయినను తిరుగక అబ్నేరును తరుముచుండగా

20 అబ్నేరు వెనుకకు తిరిగి–నీవు అశాహేలువా అని అతనిని అడుగగా అతడు నేను అశాహేలునే యనెను.

21 –నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి యౌవనస్థులలో ఒకని కలిసికొని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను, అశాహేలు ఈ తట్టయినను ఆ తట్టయినను తిరుగక అతని తరుమగా

22 అబ్నేరు–నన్ను తరుముట మాని తొలగిపొమ్ము, నేను నిన్ను నేలకు కొట్టి చంపినయెడల నీ సహోదరుడగు యోవాబు ముందు నేనెట్లు తలనెత్తుకొనగలననెను.

23 అతడు–నేను తొలగననగా, అబ్నేరు ఈటె మడమతో అతని కడుపులో పొడిచినందున యీటె అతని వెనుకకు వచ్చెను కనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. అశాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చినవారందరు నిలువబడిరిగాని

24 యోవాబును అబీషైయును అబ్నేరును తరుముచు గిబియోనను అరణ్యమార్గములోని గీహ యెదుటి అమ్మాయను కొండకు వచ్చిరి; అంతలో సూర్యుడు అస్త మించెను.

25 బెన్యామీనీయులు అబ్నేరుతో గుంపుగా కూడుకొని, ఒక కొండమీద నిలువగా

26 అబ్నేరు కేకవేసి –కత్తి చిరకాలము భక్షించునా? అది తుదకు ద్వేషమునకే హేతువగునని నీ వెరుగుదువుగదా; తమ సహోదరులను తరుమవద్దని నీ వెంతవరకు జనులకు ఆజ్ఞ ఇయ్యక యుందు వని యోవాబుతో అనెను.

27 అందుకు యోవాబు– దేవుని జీవముతోడు జగడమునకు నీవు వారిని పిలువక యుండినయెడల జనులందరు తమ సహోదరులను తరుమక ఉదయముననే తిరిగి పోయియుందురని చెప్పి

28 బాకా ఊదగా జనులందరు నిలిచి, ఇశ్రాయేలువారిని తరుముటయు వారితో యుద్ధము చేయుటయు మానిరి.

29 అబ్నేరును అతనివారును ఆ రాత్రి అంత మైదానము గుండ ప్రయాణము చేసి యొర్దానునది దాటి బిత్రోను మార్గమున మహనయీమునకు వచ్చిరి.

30 యోవాబు అబ్నేరును తరుముట మాని తిరిగి వచ్చి జనులను సమ కూర్చి లెక్కచూడగా దావీదు సేవకులలో అశాహేలు గాక పందొమ్మండుగురు లేకపోయిరి.

31 అయితే దావీదు సేవకులు బెన్యామీనీయులలోను అబ్నేరు జనులలోను మూడువందల అరువది మందిని హతము చేసిరి.

32 జనులు అశాహేలును ఎత్తికొనిపోయి బేత్లెహేములోనున్న అతని తండ్రి సమాధియందు పాతిపెట్టిరి. తరువాత యోవాబును అతనివారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనునకు వచ్చిరి.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan