Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 సమూయేలు 11 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతనివారిని ఇశ్రాయేలీయులనందరిని పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడివేసిరి; అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను.

2 ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంకువేళ దావీదు పడకమీదనుండి లేచి రాజనగరి మిద్దెమీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానముచేయు ఒక స్త్రీ కనబడెను.

3 ఆమె బహు సౌందర్యవతియై యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలిసికొనుటకై యొక దూతను పంపెను, అతడు వచ్చి–ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబ అని తెలియజేయగా

4 దావీదు దూతలచేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను; కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన యింటికి మరల వచ్చెను.

5 ఆ స్త్రీ గర్భవతియై –నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపగా

6 దావీదు హిత్తీయుడగు ఊరియాను నాయొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను.

7 ఊరియా దావీదు నొద్దకురాగా దావీదు యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధసమాచారమును అడిగెను.

8 తరువాత దావీదు–ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు సెలవియ్యగా, ఊరియా రాజ నగరిలోనుండి బయలువెళ్లెను.

9 అతనివెనుక రాజు ఫలాహారము అతనియొద్దకు పంపించెనుగాని ఊరియా తన యింటికి వెళ్లక తన యేలినవాని సేవకులతోకూడ రాజ నగరిద్వారమున పండుకొనెను.

10 ఊరియా తన యింటికి పోలేదను మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి–నీవు ప్రయాణముచేసి వచ్చితివి గదా; యింటికి వెళ్లకపోతివేమని యడుగగా

11 ఊరియా–మందసమును ఇశ్రాయేలు వారును యూదావారును గుడారములలో నివసించుచుండగను, నా యధిపతియగు యోవాబును నా యేలినవాడవగు నీ సేవకులును బయట దండులో నుండగను, భోజనపానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికిపోదునా? నీ తోడు నీ ప్రాణముతోడు నేనాలాగు చేయువాడను కానని దావీదుతో అనెను.

12 దావీదు–నేడును నీ విక్కడ నుండుము, రేపు నీకు సెలవిత్తునని ఊరియాతో అనగా ఊరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచెను.

13 అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను; అతడు బాగుగాతిని త్రాగిన తరువాత దావీదు అతని మత్తునిగా చేసెను; సాయంత్రమున అతడు బయలు వెళ్లి తన యింటికి పోక తన యేలినవాని సేవకులమధ్య పడకమీద పండుకొనెను.

14 ఉదయమున దావీదు – యుద్ధము మోపుగా జరుగుచున్నచోట ఊరియాను ముందుపెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్దనుండి వెళ్లి పొమ్మని

15 యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియాచేత పంపించెను.

16 యోవాబు పట్టణమును ముట్టడివేయు చుండగా, ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను.

17 ఆ పట్టణపువారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి, హిత్తీయుడగు ఊరియాయును హతమాయెను.

18 కాబట్టి యోవాబు యుద్ధ సమాచార మంతయు దావీదునొద్దకు పంపి దూతతో ఇట్లనెను

19 –యుద్ధసమాచారము నీవు రాజుతో చెప్పి చాలించిన తరువాత రాజు కోపము తెచ్చుకొని–యుద్ధము చేయునప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతిరి?

20 గోడమీదనుండి వారు అంబులు వేయుదురని మీకు తెలియక పోయెనా?

21 ఎరుబ్బెషెతు కుమారుడైన అబీమెలెకు ఏలాగు హతమాయెను? ఒక స్త్రీ తిరుగటిరాతి తునక ఎత్తి గోడమీదనుండి అతని మీద వేసినందున అతడు తేబేసుదగ్గర హతమాయెను గదా? ప్రాకారముదగ్గరకు మీరెందుకు పోతిరని నిన్నడిగినయెడల నీవు–తమరి సేవకుడగు ఊరియాయు హతమాయెనని చెప్పుమని బోధించి దూతను పంపెను.

22 దూత పోయి యోవాబు పంపిన వర్తమానమంతయు దావీదునకు తెలియజేసెను.

23 ఎట్లనగా – ఆ మనుష్యులు మమ్మును ఓడించుచు పొలములోనికి మాకెదురు రాగా మేము వారిని గుమ్మమువరకు వెంటాడి గెలిచితిమి.

24 అప్పుడు ప్రాకారముమీదనుండి విలు కాండ్రు తమ సేవకులమీద అంబులువేయగా రాజు సేవకులలో కొందరు హతమైరి, తమరి సేవకుడైన హిత్తీయుడగు ఊరియా కూడ హతమాయెను.

25 అందుకు దావీదు–నీవు యోవాబుతో ఈ మాట చెప్పుము–ఆ సంగతినిబట్టి నీవు చింతపడకుము; ఖడ్గము ఒకప్పుడు ఒకనిమీదను ఒకప్పుడు మరియొకనిమీదను పడుట కద్దు; పట్టణముమీద యుద్ధము మరి బలముగా జరిపి దానిని పడగొట్టుమని చెప్పి, నీవు యోవాబును ధైర్యపరచి చెప్పుమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపెను.

26 ఊరియా భార్య తన భర్తయగు ఊరియా హతమైన సంగతి విని తన భర్తకొరకు అంగలార్చెను.

27 అంగలార్పుకాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్యయయి అతనికొక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan