Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 తిమోతికి 5 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము.

2 అన్నదమ్ములని యౌవనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్కచెల్లెండ్రని పూర్ణపవిత్రతతో యౌవన స్త్రీలను హెచ్చరించుము.

3 నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము.

4 అయితే ఏ విధవరాలికైనను పిల్లలుగాని మనుమలుగాని యుండినయెడల, వీరు మొదట తమ యింటివారియెడల భక్తి కనుపరచుటకును, తమ తలిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను; ఇది దేవునిదృష్టికనుకూలమైయున్నది.

5 అయితే నిజముగా అనాథయైన విధవరాలు ఏకాకియైయుండి, దేవునిమీదనే తన నిరీక్షణనుంచుకొని, విజ్ఞాప నలయందును ప్రార్థనలయందును రేయింబగలు నిలుకడగా ఉండును.

6 సుఖభోగములయందు ప్రవర్తించునది బ్రదుకు చుండియు చచ్చినదైయుండును.

7 వారు నిందారహితులై యుండునట్లు ఈలాగు ఆజ్ఞాపించుము.

8 ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడైయుండును.

9 అరువది ఏండ్ల కంటె తక్కువవయస్సు లేక, ఒక్క పురుషునికే భార్యయై,

10 సత్‌క్రియలకు పేరుపొందిన విధవరాలు పిల్లలను పెంచి, పరదేశులకు అతిథ్యమిచ్చి, పరిశుద్ధుల పాదములు కడిగి, శ్రమపడువారికి సహాయముచేసి, ప్రతి సత్కార్యముచేయ బూనుకొనినదైతే ఆమెను విధవ రాండ్ర లెక్కలో చేర్చవచ్చును.

11-12 యౌవనస్థులైన విధవ రాండ్రను లెక్కలో చేర్చవద్దు; వారు క్రీస్తునకు విరో ధముగా నిరంకుశలైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదలుకొనిరను తీర్పుపొందినవారై పెండ్లాడగోరుదురు.

13 మరియు వారు ఇంటింట తిరుగులాడుచు, బద్ధకురాం డ్రగుటకు మాత్రమేగాక, ఆడరాని మాటలాడుచు, వదరు బోతులును పరులజోలికి పోవువారునగుటకును నేర్చు కొందురు.

14 కాబట్టి యౌవన స్త్రీలు వివాహము చేసికొని పిల్లలను కని గృహపరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరుచున్నాను.

15 ఇంతకుముందే కొందరు త్రోవనుండి తొలగి పోయి సాతానును వెంబడించినవారైరి.

16 విశ్వాసురాలైన యే స్త్రీ యింటనైనను విధవరాండ్రుండినయెడల, సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయము చేయుటకై దానిమీద భారములేకుండ ఆమెయే వీరికి సహాయము చేయవలెను.

17 బాగుగా పాలనచేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారిని, రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను.

18 ఇందుకు–నూర్చెడి యెద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు.

19 ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనేగాని పెద్దమీద దోషా రోపణ అంగీకరింపకుము.

20 ఇతరులు భయపడునిమిత్తము పాపము చేయువారిని అందరియెదుట గద్దింపుము.

21 విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమియుచేయక, నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని యెదుటను, క్రీస్తుయేసు ఎదుటను, ఏర్పరచబడిన దేవదూతలయెదుటను నీకు ఆనబెట్టుచున్నాను.

22 త్వరపడి యెవనిమీదనైనను హస్తనిక్షేపణము చేయకుము. పరులపాపములలో పాలివాడవై యుండకుము. నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము.

23 ఇకమీదట నీళ్లేత్రాగక నీ కడుపు జబ్బునిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము.

24 కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారివెంట వెళ్లుచున్నవి.

25 అటువలె మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan