Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 సమూయేలు 7 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 అంతట కిర్యత్యారీమువారు వచ్చి యెహోవా మందసమును తీసికొనిపోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి.

2 మందసము కిర్యత్యారీములోనుండిన కాలము ఇరువై సంవత్సరములాయెను. ఇశ్రాయేలీయులందరు యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా

3 సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను–మీ పూర్ణహృదయముతో యెహోవాయొద్దకు మీరు మళ్లుకొనినయెడల, అన్యదేవతలను అష్తారోతు దేవతలను మీ మధ్యనుండి తీసి వేసి, పట్టుదలగలిగి యెహోవాతట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలోనుండి మిమ్మును విడిపించును.

4 అంతట ఇశ్రాయేలీయులు బయలుదేవతలను అష్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి.

5 అంతట సమూయేలు – ఇశ్రాయేలీయులందరిని మిస్పాకు పిలువనంపుడి; నేను మీపక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా

6 వారు మిస్పాలో కూడుకొని నీళ్లుచేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి–యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచువచ్చెను.

7 ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడియున్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలుమీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి

8 –మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలోనుండి మనలను రక్షించునట్లుగా మాకొరకు ఆయనను ప్రార్థనచేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి

9 సమూయేలు పాలు విడువని ఒక గొఱ్ఱెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి, ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థనచేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను.

10 సమూయేలు దహనబలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయులమీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయులమీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారుచేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి.

11 ఇశ్రాయేలీయులు మిస్పాలోనుండి బయలుదేరి బేత్కారువరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి.

12 అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి–యింతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను.

13 ఈలాగున ఫిలిష్తీయులు అణపబడినవారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను.

14 మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల యొద్దనుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చెను. ఎక్రోనునుండి గాతు వరకున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలోనుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలీయులకును అమోరీయులకును సమాధానము కలిగెను.

15 సమూయేలు తాను బ్రదికిన దినములన్నియు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను.

16 ఏటేట అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలములయందు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచు వచ్చెను.

17 మరియు అతని యిల్లు రామాలోనుండినందున అచ్చటికి తిరిగివచ్చి అచ్చటకూడను న్యాయము తీర్చుచుండెను, మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan