Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 సమూయేలు 30 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 దావీదును అతని జనులును మూడవ దినమందు సిక్లగునకు వచ్చిరి; అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశముమీదను సిక్లగుమీదను పడి, కొట్టి దానిని తగులబెట్టి,

2 ఘనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరిని చెరపట్టుకొని చంపక వారిని తీసికొని వెళ్లిపోయి యుండిరి.

3 దావీదును అతని జనులును పట్టణమునకు వచ్చి అది కాల్చబడియుండుటయు, తమ భార్యలును కుమారులును కుమార్తెలును చెరలోనికి కొని పోబడి యుండుటయు చూచి

4 ఇక ఏడ్చుటకు శక్తిలేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి.

5 యెజ్రెయేలీయురాలైన అహీనోయము, కర్మెలీయుడైన నాబాలు భార్యయయిన అబీగయీలు అను దావీదు ఇద్దరు భార్యలును చెరలోనికి కొనిపోబడగా చూచి

6 దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమతమ కుమారులనుబట్టియు కుమార్తెలనుబట్టియు జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పు కొనగా దావీదు తన దేవుడైన యెహోవానుబట్టి ధైర్యము తెచ్చుకొనెను.

7 పిమ్మట దావీదు–ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసికొనివచ్చెను.

8 –నేను ఈ దండును తరిమినయెడల దాని కలిసికొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణచేయగా యెహోవా–తరుము, నిశ్చయముగా నీవు వారిని కలిసి కొని తప్పక నీవారినందరిని దక్కించుకొందువని సెలవిచ్చెను.

9 కాబట్టి దావీదు అతనియొద్దనున్న ఆరువందలమందియును బయలుదేరి బెసోరు వాగు గట్టుకు రాగా వారిలో రెండువందలమంది వెనుక దిగవిడువబడిరి.

10 దావీదును నాలుగువందలమందియును ఇంక తరుముచు పోయిరిగాని ఆ రెండువందలమంది అలసట పడి బెసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ నాలుగు వందలమంది పోవుచుండగా

11 పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదునొద్దకు వాని తోడుకొనివచ్చి, వాడు మూడు రాత్రింబగళ్లు అన్నపానము లేమియు పుచ్చు కొనలేదని తెలిసికొని, వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను రెండు ద్రాక్షగెలలను వానికిచ్చిరి.

12 వాడు భోజనముచేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా

13 దావీదు–నీవు ఏ దేశపువాడవు? ఎక్కడనుండి వచ్చితివని వాని నడిగెను. అందుకు వాడు –నేను ఐగుప్తీయుడనై పుట్టి అమాలేకీయుడైన యొకనికి దాసుడనైతిని; మూడుదినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయెను.

14 మేము దండెత్తి కెరేతీయుల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకొని సిక్లగును కాల్చివేసితిమని చెప్పెను.

15 –ఆ దండును కలిసికొనుటకై నీవు నాకు దోవచూపుదువా అని దావీదు వానినడుగగా వాడు–నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవునిబట్టి నీవు నాకు ప్రమాణము చేసినయెడల ఆ దండును కలిసి కొనుటకు నీకు దోవచూపుదుననెను.

16 తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా, ఫిలిష్తీయుల దేశములోనుండియు యూదా దేశములోనుండియు తాము దోచి తెచ్చికొనిన సొమ్ముతో తులదూగుచు, వారు ఆ ప్రదేశమంతట చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి.

17 దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రమువరకు వారిని హతము చేయుచుండగా, ఒంటెలమీద ఎక్కి పారిపోయిన నాలుగువందలమంది యౌవనులు తప్ప తప్పించుకొనినవాడు ఒకడును లేకపోయెను.

18 ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొనిపోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన యిద్దరు భార్యలను రక్షించెను.

19 కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తికొనిపోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి యేదియు తక్కువకాకుండ దావీదు సమస్తమును రక్షించెను.

20 మరియు దావీదు అమాలేకీయుల గొఱ్ఱెలన్నిటిని గొడ్లన్నిటిని పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి.

21 అలసటచేత దావీదును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర నిలిచిన ఆ రెండువందలమందియొద్దకు దావీదు పోగా వారు దావీదును అతనియొద్దనున్న జనులను ఎదుర్కొనుటకై బయలుదేరి వచ్చిరి. దావీదు ఈ జనులయొద్దకు వచ్చి వారి యోగక్షేమమడుగగా

22 దావీదుతోకూడ వెళ్లినవారిలో దుర్మార్గులును, పనికి మాలినవారునైన కొందరు–వీరు మనతోకూడ రాక నిలిచిరి గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరల వచ్చిన దోపుడు సొమ్ములో మన మేమియు వీరికియ్యము; తమ భార్య పిల్లలను వారు తీసికొని పోవచ్చుననిరి.

23 అందుకు దావీదు వారితో ఇట్లనెను–నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మనమీదికి వచ్చిన యీ దండును మనకప్పగించి మనకు దయచేసిన దాని విషయములో మీరు ఈలాగున చేయకూడదు.

24 మీరు చెప్పినది యెవరు ఒప్పుకొందురు? యుద్ధమునకు పోయినవాని భాగమెంతో సామానునొద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట; అందరు సమముగానే పాలు పంచుకొందురు గదా

25 కావున నాటనుండి నేటివరకు దావీదు ఇశ్రాయేలీయులలో అట్టి పంపకము కట్టడగాను న్యాయవిధిగాను ఏర్పరచి నియమించెను.

26 దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరచి– యెహోవా శత్రువులయొద్ద నేను దోచుకొనిన సొమ్ములో కొంత ఆశీర్వాదసూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను.

27 బేతేలులోను దక్షిణ రామోతులోను యత్తీరులోను

28 అరోయేరులోను షిప్మోతులోను ఎష్తెమోలోను

29 రాకాలులోను యెరహ్మెయేలీయుల గ్రామములలోను కేనీయుల గ్రామములలోను

30 హోర్మాలోను కోరాషానులోను అతాకులోను

31 హెబ్రోనులోను దావీదును అతని జనులును సంచరించిన స్థలములన్నిటిలోను ఉన్న పెద్దలకు దావీదు పంపించెను.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan