Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 సమూయేలు 19 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 అంతట సౌలు–మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోను తన సేవకులందరితోను చెప్పగా

2 సౌలు కుమారుడైన యోనాతాను దావీదుయందు బహు ఇష్టముగలవాడైయుండి దావీదుతో ఇట్లనెను–నా తండ్రియైన సౌలు నిన్ను చంపవలెనన్న ప్రయత్నముమీదనున్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగియుండుము.

3 నేను వచ్చి నీవు ఉన్న చేనిలో నా తండ్రియొద్ద నిలిచి నిన్నుగూర్చి అతనితో మాటలాడిన తరువాత నిన్నుగూర్చి నాకేమైన తెలిసినయెడల దానిని నీతో తెలియజెప్పుదుననెను.

4 యోనాతాను తన తండ్రియైన సౌలుతో దావీదునుగూర్చిదయగా మాటలాడి–నీ సేవకుడైన దావీదు నీ విషయములో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహు మేలుచేసెను గనుక, రాజా నీవు అతని విషయములో ఏ పాపము చేయకుందువుగాక.

5 అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులకందరికి గొప్ప రక్షణ కలుగజేసెను; అది నీవే చూచి సంతోషించితివి గదా; నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధియొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదువని మనవిచేయగా

6 సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి–యెహోవా జీవముతోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణముచేసెను.

7 అప్పుడు యోనాతాను దావీదును పిలుచుకొనిపోయి ఆ సంగతులన్నియు అతనికి తెలియజేసి దావీదును సౌలునొద్దకు తీసికొనిరాగా దావీదుమునుపటిలాగున అతని సన్నిధిని ఉండెను.

8 తరువాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధముచేసి వారిని ఓడించి వెనుకకు పారదోలి గొప్ప వధచేయగా

9 యెహోవాయొద్దనుండి దురాత్మ సౌలుమీదికి వచ్చెను. సౌలు ఈటె చేతపట్టుకొని యింట కూర్చుండి యుండెను. దావీదు సితారా వాయించుచుండగా

10 సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యముగలిగి యీటె విసి రెను. దావీదు అతని యెదుటనుండి తప్పించుకొనినందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రియందు తప్పించుకొని పారిపోయెను.

11 ఉదయమున అతని చంపవలెనని పొంచియుండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని యింటికి దూతలను పంపగా దావీదు భార్యయైన మీకాలు –ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకొంటేనేగాని రేపు నీవు చంపబడుదువని చెప్పి

12 కిటికీగుండ దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను.

13 తరువాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచము మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి

14 సౌలు దావీదును పట్టుకొనుటకై దూతలను పంపగా–అతడు రోగియై యున్నాడని చెప్పెను.

15 దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి–నేను అతని చంపునట్లుగా మంచముతో అతని తీసికొని రండని వారితో చెప్పగా

16 ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తలతట్టున మేకబొచ్చుగల యొకటి మంచము మీద కనబడెను.

17 అప్పుడు సౌలు–తప్పించుకొని పోవునట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్నీలాగున ఎందుకు మోసపుచ్చితివని మీకాలు నడుగగా మీకాలు–నే నెందుకు నిన్ను చంపవలెను? నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో అనెను.

18 ఆలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలో నున్న సమూయేలునొద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియజేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచట కాపురముండిరి.

19 దావీదు రామాదగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా

20 దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను; వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు, సమూయేలు వారిమీద నాయకుడుగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతలమీదికి వచ్చెను గనుక వారును ప్రకటింప నారంభించిరి.

21 ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపెనుగాని వారును అటువలెనే ప్రకటించుచుండిరి. సౌలు మూడవసారి దూతలను పంపెనుగాని వారును ప్రకటించుచుండిరి.

22 కడవరిసారి తానే రామాకు పోయి సేఖూ దగ్గరనున్న గొప్ప బావియొద్దకు వచ్చి–సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా ఒకడు–రామా దగ్గర నాయోతులో వారున్నారని చెప్పెను.

23 అతడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ప్రయాణము చేయుచు రామాదగ్గరనున్న నాయోతునకు వచ్చువరకు ప్రకటించుచుండెను,

24 మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆ నాటి రాత్రింబగళ్లు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు, పైబట్టలేనివాడై పడియుండెను. అందువలన సౌలును ప్రవక్తలలోనున్నాడా అను సామెత పుట్టెను.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan