Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 కొరింథీ 10 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 సహోదరులారా, యీ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టములేదు. అదేదనగా, మన పితరులందరు మేఘముక్రింద నుండిరి. వారందరును సముద్రములో నడచిపోయిరి;

2 అందరును మోషేనుబట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి;

3 అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి;

4 అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే.

5 అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి.

6 వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి.

7 –జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి.

8 మరియు వారివలె మనము వ్యభిచరింపక యుందము; వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి.

9 మనము ప్రభువును శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పములవలన నశించిరి.

10 మీరు సణుగ కుడి; వారిలో కొందరు సణిగి సంహారకునిచేత నశించిరి.

11 ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయ బడెను.

12 తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.

13 సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడ నియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును.

14 కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపొండి.

15 బుద్ధిమంతులతో మాటలాడినట్లు మీతో మాటలాడుచున్నాను; నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి

16 మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర లోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొను టయేగదా? –మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకొనుటయేగదా?

17 మన మందరము ఆ యొకటే రొట్టెలో పాలుపుచ్చుకొనుచున్నాము; రొట్టెయొక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై యున్నాము.

18 శరీరప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించినవాటిని తినువారు బలిపీఠముతో పాలివారుకారా?

19 ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పి తములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా?

20 లేదు గాని, అన్యజను లర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలి వారవుట నాకిష్టము లేదు.

21 మీరు ప్రభువు పాత్ర లోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్లమీద ఉన్నదానిలోను దయ్యముల బల్లమీద ఉన్న దానిలోను కూడ పాలుపొందనేరరు.

22 ప్రభువునకు రోషము పుట్టించెదమా? ఆయన కంటె మనము బలవంతులమా?

23 అన్ని విషయములయందు నాకు స్వాతంత్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్యము కలదు గాని అన్నియు క్షేమాభి వృద్ధి కలుగజేయవు.

24 ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.

25 మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును.

26 –భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై యున్నవి.

27 అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచి నపుడు వెళ్లుటకు మీకు మనస్సుండినయెడల మీకు వడ్డించినది ఏదో దానినిగూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి.

28 అయితే ఎవడైనను మీతో– ఇది బలి అర్పింపబడినదని చెప్పినయెడల అట్లు తెలిపిన వాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి.

29 మనస్సాక్షి నిమిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే యీలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్య విషయములో తీర్పు తీర్చబడనేల?

30 నేను కృతజ్ఞతతో పుచ్చుకొనినయెడల నేను దేనినిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దానినిమిత్తము నేను దూషింప బడనేల?

31 కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి.

32 యూదులకైనను, గ్రీసుదేశస్థుల కైనను, దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగ జేయకుడి.

33 ఈలాగు నేను కూడ స్వప్రయోజనమును కోరక, అనేకులు రక్షింప బడవలెనని వారి ప్రయోజనమునుకోరుచు, అన్ని విషయములలో అందరిని సంతోష పెట్టుచున్నాను.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan