రోమా పత్రిక 4 - తెలుగు సమకాలీన అనువాదముఅబ్రాహాము విశ్వాసం ద్వారా నీతిమంతునిగా తీర్చబడ్డాడు 1 అయితే శరీరరీతిగా మన పూర్వికుడైన అబ్రాహాము ఈ విషయంలో ఏమి తెలుసుకున్నాడు అని మనం అనవచ్చు? 2 ఒకవేళ, నిజంగానే, అబ్రాహాము క్రియలమూలంగా నీతిమంతునిగా ఎంచబడి ఉంటే అతడు అతిశయించడానికి కారణం ఉండేది; కాని దేవుని యెదుట కాదు. 3 లేఖనాలు ఏమి చెప్తున్నాయి? “అబ్రాహాము దేవుని నమ్మాడు కనుక అది అతనికి నీతిగా యెంచబడింది” అనే కదా! 4 పని చేసే వారికి ఇచ్చే జీతం ఒక బాధ్యతే కాని ఉచితంగా ఇచ్చే బహుమానం కాదు. 5 అయితే, ఒకరు పనిచేయకుండా, భక్తిహీనున్ని కూడా నీతిమంతునిగా తీర్చగల దేవునిపై నమ్మకముంచితే వారి విశ్వాసం నీతిగా ఎంచబడుతుంది. 6 క్రియలు లేకుండానే ఎవరిని దేవుడు నీతిమంతులుగా తీర్చుతున్నాడో వారు దీవించబడినవారని దావీదు కూడా చెప్తున్నాడు. 7 “ఆశీర్వదించబడినవారు ఎవరనగా తమ తప్పులకు క్షమాపణ పొందినవారు, తమ పాపాలకు పరిహారాన్ని పొందినవారు. 8 ఎవరి పాపాలనైతే ప్రభువు ఎన్నడూ వారికి విరుద్ధంగా లెక్కించడో వారు ఆశీర్వదించబడినవారు.” 9 ఈ ఆశీర్వాదం కేవలం సున్నతి పొందినవారికి మాత్రమేనా లేక సున్నతి పొందని వారికి కూడా వర్తిస్తుందా? అబ్రాహాము యొక్క విశ్వాసం అతనికి నీతిగా యెంచబడిందని మనం చెప్తున్నాం గదా. 10 ఏ పరిస్థితులలో అది అతనికి నీతిగా యెంచబడింది? అతడు సున్నతి పొందిన తరువాత లేక సున్నతి పొందక ముందా? సున్నతి పొందిన తరువాత కాదు, పొందక ముందే! 11 అప్పటికి అతడు ఇంకా సున్నతి చేయబడనివాడై ఉన్నప్పటికీ, అతడు కలిగివున్న విశ్వాసం ద్వారా నీతి ముద్రగా సున్నతి అనే గుర్తును అతడు పొందాడు. కనుక సున్నతి పొందకపోయిన విశ్వసించిన వారందరికి అది నీతిగా ఎంచబడేలా, అబ్రాహాము వారందరికి తండ్రి అయ్యాడు. 12 అంతేకాక సున్నతి పొందినవారిలో ఎవరైతే మన తండ్రియైన అబ్రాహాము సున్నతి పొందక ముందు నడిచిన విశ్వాసపు అడుగుజాడలను అనుసరించి జీవిస్తున్నారో వారికి కూడా అబ్రాహాము తండ్రి అయ్యాడు. 13 అబ్రాహాము ఈ లోకానికి వారసుడు అవుతాడు అనే వాగ్దానాన్ని అతడు అతని సంతానం ధర్మశాస్త్రాన్ని బట్టి పొందుకోలేదు కాని, తాను కలిగివున్న విశ్వాసమూలంగా వచ్చిన నీతి ద్వారా మాత్రమే పొందుకున్నారు. 14 ఒకవేళ ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు వారసులైతే, విశ్వాసానికి అర్థం ఉండదు, వాగ్దానానికి ఎటువంటి విలువ ఉండదు, 15 ఎందుకంటే ధర్మశాస్త్రం ఉగ్రతను తెస్తుంది. ఎక్కడైతే ధర్మశాస్త్రం ఉండదో అక్కడ దానిని అతిక్రమించడం కూడా ఉండదు. 16 కాబట్టి, వాగ్దానం విశ్వాసమూలంగానే వస్తుంది, అప్పుడది అబ్రాహాము సంతానానికి అన్నప్పుడు కేవలం ధర్మశాస్త్రాన్ని కలిగివున్నవారికి మాత్రమే కాకుండా అబ్రాహాము ఏ విశ్వాసానైతే కలిగివున్నాడో అదే విశ్వాసాన్ని కలిగివున్న అతని సంతానమంతటికి కృప ద్వారా వర్తిస్తుంది. అతడు మనందరికి తండ్రి. 17 “నిన్ను అనేక జనములకు తండ్రిగా చేశాను” అని వ్రాయబడిన ఉన్నది. అబ్రాహాము విశ్వాసముంచిన దేవుడు చనిపోయిన వారికి జీవాన్ని ఇచ్చేవాడు, లేనివాటిని ఉన్నవాటిగా పిలిచేవాడు. అలాంటి దేవుని దృష్టిలో అతడు మనకు తండ్రి. 18 “నీ సంతానం ఇలా ఉంటుంది” అని అతనితో చెప్పబడింది కనుక ఎలాంటి నిరీక్షణ లేని సమయంలో కూడా అబ్రాహాము నిరీక్షణ కలిగి నమ్మాడు, కనుక అనేక జనములకు అతడు తండ్రి అయ్యాడు. 19 తనకు వంద సంవత్సరాల వయస్సు గనుక తన శరీరం మృతతుల్యంగా ఉందని శారా గర్భం కూడా మృతతుల్యంగా ఉందనే వాస్తవం తెలిసినప్పటికి అతడు తన విశ్వాసంలో బలహీనపడనే లేదు. 20 అతడు దేవుడు చేసిన వాగ్దానంపట్ల అపనమ్మకంతో ఎన్నడు సందేహించలేదు గాని, అతడు తన విశ్వాసంలో బలపడి దేవునికి మహిమను చెల్లించాడు. 21 దేవుడు తాను వాగ్దానం చేసిన దానిని నెరవేర్చగల శక్తిగలవాడని అతడు దృఢంగా నమ్మాడు. 22 అందుకే “అది అతనికి నీతిగా యెంచబడింది.” 23 “అది అతనికి నీతిగా యెంచబడింది” అని వ్రాయబడింది కేవలం అతని ఒక్కడి కొరకు మాత్రమే కాదు, 24 మరణం నుండి సజీవంగా తిరిగి లేచిన మన ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వాసముంచి దేవునిచే నీతిమంతులుగా తీర్చబడిన మనకొరకు కూడా ఆ వాక్యం వ్రాయబడింది 25 యేసు క్రీస్తు మన పాపాల కొరకు మరణానికి అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడడానికి మరణం నుండి సజీవంగా తిరిగి లేచారు. |
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.