Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

రోమా పత్రిక 3 - తెలుగు సమకాలీన అనువాదము


దేవుని విశ్వసనీయత

1 అయితే, యూదునిగా ఉండడం వలన ప్రయోజనమేమిటి, లేదా సున్నతిలో ఉన్న విలువేమిటి?

2 ప్రతీ విషయంలోనూ అధికమే! మొదటిగా, దేవుని మాటలు యూదులకు అప్పగించబడ్డాయి.

3 వారిలో కొందరు అవిశ్వాసంగా ఉంటే ఏంటి? వారి అవిశ్వాసం దేవుని విశ్వసనీయతను నిరర్థకం చేస్తుందా?

4 ఎన్నటికి కాదు; ప్రతి ఒక్క మనిషి అబద్ధికుడు కావచ్చు గాని దేవుడు సత్యవంతుడు. దేవుని గురించి లేఖనంలో ఈ విధంగా వ్రాయబడివున్నది, “మాట్లాడినప్పుడు నీవు నీతిమంతుడవని నిరూపించబడతావు తీర్పు తీర్చునప్పుడు నీవు జయిస్తావు.”

5 అయితే మన దుర్మార్గాన్ని బట్టి దేవుడు నీతిమంతుడని మరింత స్పష్టమవుతుంటే, మనమేమి చెప్పగలం? దేవుడు తన ఉగ్రతను మన మీద చూపితే ఆయన అన్యాయస్థుడు అవుతాడా? నేను మానవుల వాదన చెప్తున్నాను.

6 ఖచ్చితంగా కాదు! ఒకవేళ అలా అయితే, దేవుడు లోకానికి ఎలా తీర్పు తీర్చగలడు?

7 అయితే కొందరు, “ఒకవేళ నా అబద్ధం దేవుని యదార్థతను అధికం చేసినప్పుడు, ఆయన మహిమను పెంచినప్పుడు, నేను పాపిగా ఎందుకు తీర్పు తీర్చబడాలి?” అని వాదిస్తారు.

8 “మంచి జరుగునట్లు చెడు చేద్దాం” అని కొందరు అపవాదుగా అన్నట్లుగా ఎందుకు అనకూడదు? అలాంటి వారికి తీర్చబడిన తీర్పు న్యాయమైనదే!


ఎవరూ నీతిమంతులు కారు

9 అప్పుడు మనం ఏమని నిర్ధారించాలి? మనకు ఏమైనా ప్రయోజనం ఉందా? ఎంత మాత్రం లేదు! యూదులు, యూదేతరులు అందరు ఒకేలా పాప బంధకాలలో ఉన్నారని మేము ముందుగానే చెప్పాము.

10 లేఖనాల్లో ఈ విధంగా వ్రాయబడివున్నది, “నీతిమంతులు ఎవరూ లేరు, ఒక్కరు కూడా లేరు;

11 గ్రహించగలినవారు ఒక్కరు కూడా లేరు; దేవుని వెదకేవారు ఒక్కరు కూడా లేరు.

12 అందరు దారి తప్పిపోయారు, వారందరు కలిసి అప్రయోజకులయ్యారు; మంచిని చేసేవారు ఎవరూ లేరు, ఒక్కరు కూడా లేరు.”

13 “వారి గొంతుకలు తెరచిన సమాధుల్లా ఉన్నాయి; వారి నాలుకలు మోసాన్ని అభ్యాసం చేస్తాయి.” “సర్పాల విషం వారి పెదవుల క్రింద ఉంది.”

14 “వారి నోటి నిండా శపించడం విరోధం ఉన్నాయి.”

15 “వారి పాదాలు రక్తాన్ని చిందించడానికి త్వరపడుతున్నాయి;

16 నాశనం, దుఃఖం వారు వెళ్ళే మార్గాలకు గుర్తుగా ఉన్నాయి,

17 శాంతి మార్గం వారికి తెలియదు.”

18 “వారి కన్నులకు దేవుని భయం లేదు.”

19 ప్రతి నోరు మౌనంగా ఉండునట్లు లోకమంతా దేవునికి లెక్కప్పగించునట్లు ధర్మశాస్త్రం ఏం చెప్పినా, ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారికి చెప్తుందని మనం తెలుసుకుంటాము.

20 కనుక ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లుగా చేయడం ద్వారా ఎవరూ దేవుని దృష్టిలో నీతిమంతునిగా తీర్పు తీర్చబడరు, కాని ధర్మశాస్త్రం ద్వారా మన పాపాల గురించి మనం తెలుసుకోగలుగుతాం.


విశ్వాసం ద్వారా నీతి

21 అయితే ఇప్పుడు ధర్మశాస్త్రం లేకుండానే దేవుని నీతి తెలియపరచబడుతుంది, దానిని గురించి ధర్మశాస్త్రం ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారు.

22 యేసుక్రీస్తులో ఉన్న విశ్వాసం ద్వారా విశ్వసించిన వారందరికి ఈ నీతి ఇవ్వబడుతుంది. యూదులకు యూదేతరులకు భేదం లేదు,

23 అందరు పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకొన్నారు,

24 కనుక విశ్వసించిన వారందరు ఆయన కృప చేత యేసు క్రీస్తు నుండి వచ్చిన విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు.

25 దేవుడు క్రీస్తును, ఆయన యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా ప్రాయశ్చిత్త బలిగా సమర్పించాడు; విశ్వాసం ద్వారా దానిని పొందుకోవాలి. ఆయన తన నీతిని చూపించడానికి ఇలా చేశారు, ఎందుకంటే ఆయన తన సహనాన్ని బట్టి పూర్వం చేయబడిన పాపాలను శిక్ష విధించకుండా వదిలేసారు.

26 ఆయన ఈ ప్రస్తుత కాలంలో తన నీతిని కనుపరచడానికి, ఆయన నీతిమంతుడై ఉండి యేసులో విశ్వాసముంచిన వారిని నీతిమంతులుగా తీర్చేవానిగా ఉండడానికి ఇలా చేశారు.

27 అయితే అతిశయించడానికి కారణం ఎక్కడ? అది రద్దు చేయబడింది. ఏ ధర్మశాస్త్రాన్ని బట్టి? క్రియలు అవసరమైన ధర్మశాస్త్రమా? కాదు, విశ్వాసం అవసరమైన ధర్మశాస్త్రాన్ని బట్టి.

28 కనుక ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన కాకుండా విశ్వాసం ద్వారానే ఒకరు నీతిమంతునిగా తీర్చబడతారని మనం భావిస్తున్నాము.

29 దేవుడు కేవలం యూదులకు మాత్రమే దేవుడా? యూదేతరులకు ఆయన దేవుడు కాడా? అవును, ఆయన యూదేతరులకు కూడా దేవుడే.

30 దేవుడు ఒక్కడే కనుక సున్నతి పొందినవారిని విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చుతాడు, సున్నతి లేనివారిని కూడా అదే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చుతాడు.

31 అయితే ఈ విశ్వాసం బట్టి మనం ధర్మశాస్త్రాన్ని నిరర్ధకం చేస్తున్నామా? ఎన్నటికి కాదు! మనం ధర్మశాస్త్రాన్ని నిలబెడుతున్నాము.

తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version™, New Testament

Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan