ప్రకటన 9 - తెలుగు సమకాలీన అనువాదము1 ఐదవ దూత తన బూరను ఊదినప్పుడు ఆకాశం నుండి రాలి భూమి మీద పడిన ఒక నక్షత్రాన్ని నేను చూసాను. అగాధానికి వెళ్ళే గొయ్యి తాళపు చెవులు ఆ నక్షత్రానికి ఇవ్వబడ్డాయి. 2 అతడు ఆ అగాధాన్ని తెరిచినప్పుడు, చాలా పెద్ద కొలిమిలో నుండి పొగ వచ్చినట్లు ఆ అగాధం నుండి దట్టమైన పొగ మీదికి లేచింది. అగాధం నుండి వచ్చిన ఆ పొగకు సూర్యునికి ఆకాశంలో చీకటి కమ్మింది. 3 ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చాయి. వాటికి భూమిలోని తేళ్ళకు ఉన్న శక్తి ఇవ్వబడింది. 4 భూమి మీద మొలిచే గడ్డికి కాని, పచ్చని మొక్కలకు కాని, చెట్లకు కాని హాని చేయకూడదు కాని ఏ మనిషి నుదుటి మీద దేవుని ముద్ర లేదో వానికే హాని చేయాలని వాటికి ఆజ్ఞ ఇవ్వబడింది. 5 ఆ మిడతలకు ఐదు నెలల పాటు మనుష్యులను వేధించడానికే కాని వారిని చంపడానికి అనుమతి ఇవ్వబడలేదు. అవి కుట్టినప్పుడు వారికి తేలు కుట్టినంతగా బాధ ఉంటుంది. 6 ఆ రోజులలో మనుష్యులు మరణాన్ని వెదకుతారు కాని అది వారికి దొరకదు; వారు చావాలని కోరుకుంటారు కాని మరణం వారి నుండి పారిపోతుంది. 7 ఆ మిడతలు చూడడానికి యుద్ధానికి సిద్ధంగా ఉన్న గుర్రాల్లా ఉన్నాయి. వాటి తలల మీద బంగారు కిరీటంలాంటివి ఉన్నాయి; వాటి ముఖాలు మనుష్యుల ముఖాల్లా ఉన్నాయి. 8 వాటి తల వెంట్రుకలు స్త్రీల తలవెంట్రుకల్లా ఉన్నాయి. వాటి పళ్ళు సింహపు కోరల్లా ఉన్నాయి. 9 వాటి ఛాతి ఇనుప కవచంలా ఉంది. వాటి రెక్కల చప్పుడు యుద్ధానికి పరుగెత్తే అనేక గుర్రముల రథముల చప్పుడులా ఉంది. 10 వాటికి తేళ్ళ తోకల వంటి తోకలు ఉన్నాయి. అవి ఐదు నెలల వరకు తమ తోకలతో మనుష్యులను కుట్టి పీడించే శక్తిని కలిగి ఉన్నాయి. 11 అగాధాన్ని పాలించే దూత వాటికి రాజుగా ఉన్నాడు. వాడి పేరు హెబ్రీ భాషలో అబద్దోను. గ్రీకు భాషలో అపొల్యోను అనగా నాశనం చేసేవాడు అని అర్థం. 12 మొదటి విపత్తు గతించిపోయింది. ఇదిగో, ఇంకా రెండు విపత్తులు రానున్నాయి. 13 ఆరో దూత బూర ఊదినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్న బంగారు బలిపీఠపు నాలుగు కొమ్ముల నుండి ఒక స్వరం నాకు వినిపించింది. 14 ఆ స్వరం బూర ఊదిన ఆ ఆరో దేవదూతతో, “యూఫ్రటీసు అనే మహానది దగ్గర బంధించబడి ఉన్న నలుగురు దూతలను విడిపించు” అని చెప్పాడు. 15 అయితే ఆ సంవత్సరం, ఆ నెల, ఆ రోజు, ఆ గంట కొరకు సిద్ధం చేయబడిన ఆ నలుగురు దూతలు మనుష్యులలో మూడవ భాగాన్ని చంపడానికి విడుదల చేయబడ్డారు. 16 ఆ సవారీ చేసేవారి సైన్యం లెక్క ఇరవై కోట్లు కంటే రెండు రెట్లు ఎక్కువ ఉన్నాయి అని వారి సంఖ్యను గురించి నేను విన్నాను. 17 నా దర్శనంలో ఆ గుర్రాలు, వాటిపై సవారీ చేసేవారు ఇలా ఉన్నారు; నిప్పులాంటి ఎరుపు రంగు, ముదురు నీలం రంగు, గంధకం లాంటి పసుపురంగు గల కవచాలు ఛాతి మీద వారు ధరించి ఉండడం నేను చూసాను. ఆ గుర్రాల తలలు సింహపు తలల్లా కనిపించాయి. వాటి నోటి నుండి అగ్ని, పొగ, గంధకం బయలుదేరాయి. 18 వాటి నోళ్ల నుండి వచ్చిన అగ్ని, పొగ, గంధకాల వలన మూడు తెగుళ్ళు మూడవ భాగపు మనుష్యులను చంపేశాయి. 19 ఆ గుర్రాల శక్తి వాటి నోటిలో వాటి తోకలలో ఉంది. వాటి తోకలు పాముల తలలు కలిగి మనుష్యులను గాయపర్చేవిగా ఉన్నాయి. 20 ఈ తెగుళ్ళ చేత బాధించబడి చావకుండా మిగిలిన ప్రజలు బంగారు, వెండి, కంచు, రాయి, కొయ్యలతో తయారుచేసుకొన్న విగ్రహాలను, దయ్యాలను పూజచేయడం మానలేదు. ఆ విగ్రహాలు చూడలేవు, వినలేవు, నడవలేవు. అయినా అవి కేవలం తమ చేతి పని అని వారు గ్రహించలేదు వాటిని దేవునిగా పూజించడం తప్పు అని పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరుగలేదు. 21 వారు చేసే హత్యలు, మంత్రపు ప్రయోగాలు, లైంగిక దుర్నీతి లేక దొంగతనం అనేవి తప్పు అని గ్రహించి పశ్చాత్తాపపడి వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగలేదు. |
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.