Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ప్రకటన 20 - తెలుగు సమకాలీన అనువాదము


వెయ్యి సంవత్సరాలు

1 ఆ తరువాత ఒక దేవదూత తన చేతిలో అగాధపు తాళపు చెవిని ఒక పెద్ద గొలుసును పట్టుకుని పరలోకం నుండి క్రిందికి దిగి రావడం నేను చూసాను.

2 ఆ దేవదూత ఆదిసర్పం అనే ఘటసర్పాన్ని అనగా అపవాది అనే సాతానుని పట్టుకుని వెయ్యి సంవత్సరాల వరకు బంధించాడు.

3 ఆ దూత అతన్ని పాతాళంలో పడవేసి, అతడు వెయ్యి సంవత్సరాలు పూర్తయ్యే వరకు దేశాలను ఎంత మాత్రం మోసం చేయకుండా ఉండడానికి దానికి తాళం వేసి ముద్ర వేసాడు. ఆ తరువాత అతడు కొంతకాలం వరకు వదిలిపెట్టబడతాడు.

4 అప్పడు తీర్పు తీర్చడానికి అధికారం ఇవ్వబడినవారు కూర్చునివున్న సింహాసనాలను నేను చూసాను. యేసును గురించి సాక్ష్యాన్ని బట్టి దేవుని వాక్యాన్ని బట్టి తలలు నరికివేయబడి హతులైన వారి ఆత్మలను నేను చూసాను. వారు ఆ మృగాన్ని కాని వాని విగ్రహాన్ని కాని పూజించలేదు, వారు దాని ముద్రను తమ నుదుటి మీద కాని చేతి మీద కాని వేయించుకోలేదు. వారు బ్రతికివచ్చి క్రీస్తుతో పాటు వెయ్యి సంవత్సరాలు పరిపాలించారు.

5 చనిపోయినవారిలో మిగిలినవారు ఈ వెయ్యి సంవత్సరాలు గడిచేవరకు మళ్లీ బ్రతుకలేదు. ఇదే మొదటి పునరుత్థానం.

6 మొదటి పునరుత్థానంలో పాలుపొందినవారు ధన్యులు పరిశుద్ధులు. రెండవ మరణానికి వారి మీద అధికారం లేదు, అయితే వారు దేవునికి క్రీస్తుకు యాజకులుగా ఉంటూ ఆయనతోపాటు వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తారు.


సాతానుకు తీర్పు

7 వెయ్యి సంవత్సరాలు గడిచిన తరువాత సాతాను ఖైదీ నుండి విడుదల చేయబడతాడు.

8 ఆ సాతాను వాని ప్రజలను గోగు, మాగోగులో భూమి నలుదిక్కుల ఉన్న దేశాలను గోగు మాగోగు అనే వారిని మోసపుచ్చి యుధ్ధానికి సమకూర్చడానికి బయలుదేరి వెళ్తాడు. వారి సంఖ్య సముద్రపు ఇసుకరేణువుల్లా లెక్కకు మించి ఉంది.

9 వారు భూమి అంతటా ప్రయాణించి దేవుని ప్రజలు ఉన్నచోటును, ఆయన ప్రేమించిన పట్టణాన్ని ముట్టడిస్తారు. కానీ పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేస్తుంది.

10 అప్పుడు వారిని మోసగించిన సాతాను ఇంతకు ముందు ఆ మృగం, అబద్ధ ప్రవక్త పడవేయబడిన అగ్నిగంధకాల సరస్సులో పడవేయబడతాడు. అక్కడ వారు నిరంతరం రాత్రింబగళ్లు వేధించబడతారు.


మృతులకు తీర్పు

11 అప్పుడు నేను ఒక తెల్లని సింహాసనాన్ని దాని మీద కూర్చున్న ఒకరిని చూసాను. భూమి ఆకాశాలు ఆయన సన్నిధి నుండి పారిపోయాయి వాటికి ఎక్కడ స్థలం లేదు.

12 ఆ తరువాత దేవుని సింహాసనం ముందు ఘనులైనా అల్పులైనా చనిపోయిన వారందరూ నిలబడి ఉండడం నేను చూసాను. గ్రంథాలు తెరవబడ్డాయి. వాటిలో జీవగ్రంథం అనబడే మరొక గ్రంథం తెరవబడింది. ఆ గ్రంథంలలో వ్రాయబడిన ప్రకారం చనిపోయినవారు తాము చేసిన పనులను బట్టి తీర్పు తీర్చబడ్డారు.

13 సముద్రం దానిలో చనిపోయినవారిని అప్పగించింది. అలాగే మృత్యువు మరియు పాతాళం తమలో ఉన్న చనిపోయినవారిని అప్పగించాయి. అప్పుడు ప్రతి ఒక్కరు తాము చేసిన పనుల ప్రకారం తీర్పు తీర్చబడ్డారు.

14 అప్పుడు మృత్యువు మరియు పాతాళం అగ్నిసరస్సులో పడవేయబడ్డాయి. ఈ అగ్నిసరస్సే రెండవ మరణం.

15 జీవగ్రంథంలో పేరు వ్రాయబడనివారిని ఈ అగ్నిసరస్సులో పడవేసారు.

తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version™, New Testament

Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan