Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ప్రకటన 19 - తెలుగు సమకాలీన అనువాదము


బబులోను పతనాన్ని బట్టి మూడింతల హల్లెలూయా

1 ఈ సంగతుల తరువాత పరలోకంలో ఒక గొప్ప జనసమూహం అరుస్తున్న శబ్దం వంటి శబ్దాన్ని నేను విన్నాను: “హల్లెలూయా! రక్షణ, మహిమ, బలం మన దేవునివే!

2 ఎందుకంటే ఆయన తీర్పులు సత్యమైనవి న్యాయమైనవి. భూమిని తన వ్యభిచారంతో చెడగొట్టిన, ఆ మహావేశ్యకు ఆయన శిక్ష విధించాడు. తన సేవకుల రక్తాన్ని కార్చిన ఆమెపై ఆయన పగ తీర్చుకొన్నాడు.”

3 మరొకసారి వారు బిగ్గరగా, “హల్లెలూయా! ఆమె నుండి వస్తున్న పొగ ఎల్లకాలం పైకి లేస్తూనే ఉంటుంది!” అని కేకలు వేసారు.

4 అప్పుడు ఆ ఇరవైనలుగురు పెద్దలు ఆ నాలుగు ప్రాణులు సింహాసనంపై కూర్చున్న దేవుని ముందు సాగిలపడి ఆరాధించారు. వారు బిగ్గరగా, “ఆమేన్! హల్లెలూయా!” అని అరిచారు.

5 అప్పుడు సింహాసనం నుండి వచ్చిన ఒక స్వరం ఇలా పలికింది, “దేవుని భయపడేవారలారా, ఓ దేవుని సేవకులరా! చిన్నవారైన పెద్దవారైన అందరూ మన దేవుని స్తుతించండి.”

6 అప్పుడు మహా గొప్ప జనసమూహం వంటి శబ్దాన్ని, పారే జలాల గర్జనను ఉరుముల ధ్వనిని పోలిన స్వరం ఇలా అన్నది, “హల్లెలూయా! సర్వశక్తిగల మన ప్రభువైన దేవుడు పరిపాలిస్తున్నాడు.

7 కనుక మనం ఆనందించి ఉత్సాహ ధ్వనులతో ఆయనను కీర్తించుదాం! ఎందుకంటే ఇదిగో గొర్రెపిల్ల వివాహా దినం వచ్చేసింది ఆయన వధువు తనను తాను సిద్ధపరచుకొంది

8 ఆమె ధరించడానికి, ప్రకాశమైన శుద్ధమైన సున్నితమైన నార వస్త్రాలు ఆమెకు ఇవ్వబడ్డాయి.” సున్నితమైన నార వస్త్రాలు అనగా దేవుని పరిశుద్ధ ప్రజలు చేసిన నీతి క్రియలు అని అర్థం.

9 ఆ తరువాత దేవదూత నాతో, “ఇది వ్రాయి: గొర్రెపిల్ల వివాహ విందుకు ఆహ్వానం పొందినవారు ధన్యులు!” అతడు ఇంకా, “ఇవి దేవుని సత్య వాక్కులు” అని చెప్పాడు.

10 అప్పుడు అతన్ని ఆరాధించడానికి నేను ఆ దేవదూత పాదాల ముందు సాగిలపడ్డాను. కాని అతడు నాతో, “వద్దు! ఇలా చేయకు! నేను ఇతర విశ్వాసుల వలె యేసు కొరకు సాక్ష్యమిచ్చే నీలాంటి సేవకుడనే. దేవునినే పూజించు! ఎందుకంటే యేసును గురించిన సాక్ష్యం కలిగివుండడమే ప్రవచించే ఆత్మ” అని నాతో చెప్పాడు.


పరలోక వీరుడు మృగాన్ని ఓడించుట

11 అప్పడు పరలోకం తెరవబడి, నా ముందు ఒక తెల్లని గుర్రం కనిపించింది. దాని మీద సవారీ చేసే వ్యక్తి నమ్మకమైన సత్యవంతుడు అని పిలువబడతాడు. ఆయన న్యాయమైన తీర్పును ఇస్తూ యుద్ధం చేస్తాడు.

12 ఆయన కళ్ళు అగ్ని జ్వాలల్లా ఉంటాయి. ఆయన తల మీద అనేక కిరీటాలు ఉన్నాయి. ఆయన మీద ఒక పేరు వ్రాయబడి ఉంది, అది ఆయనకు తప్ప మరి ఎవరికి తెలియదు.

13 రక్తంలో ముంచబడిన వస్త్రాలను ఆయన ధరించి ఉన్నాడు. ఆయనకు దేవుని వాక్యమని పేరు.

14 తెల్లని, పవిత్రమైన సున్నిత నార వస్త్రాలను ధరించి తెల్లని గుర్రాల మీద సవారీ చేస్తున్న పరలోక సైన్యాలు ఆయనను వెంబడిస్తున్నాయి.

15 దేశాలను నరకడానికి ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గం బయటకు వస్తుంది. “ఆయన ఒక ఇనుప దండంతో వారిని పరిపాలిస్తాడు.” ఆయన సర్వశక్తిగల దేవుని తీవ్రమైన ఉగ్రత అనే మద్యపు తొట్టిని త్రొక్కుతాడు.

16 ఆయన ధరించిన వస్త్రాల మీద ఆయన తొడ మీద, రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అనే పేరు వ్రాసి ఉంది.

17 అప్పుడు సూర్యుని మీద నిలబడిన ఒక దూతను నేను చూసాను, అతడు బిగ్గరగా మధ్య ఆకాశంలో ఎగిరే పక్షులన్నిటినీ పిలుస్తూ వాటితో, “రండి! దేవుని గొప్ప విందుకు కలిసి రండి!

18 రాజుల మాంసాన్ని, సైన్యాధికారుల మాంసాన్ని, బలవంతుల మాంసాన్ని, గుర్రాల, వాటి మీద సవారీ చేసేవారి మాంసాన్ని, స్వతంత్రులు కాని బానిసలు కాని ఘనులు కాని అల్పులు కాని ప్రజలందరి మాంసాన్ని తినడానికి రండి!” అని బిగ్గరగా అరిచి చెప్పాడు.

19 అప్పుడు నేను ఆ గుర్రం మీద సవారీ చేసే వానితో, ఆయన సైన్యంతో యుద్ధం చేయడానికి ఆ మృగం భూ రాజులు, వారి సైన్యాలతో కలిసి రావడం నేను చూసాను.

20 అయితే ఆ మృగం పట్టుబడింది, దాంతో పాటు దాని పక్షాన సూచక క్రియలు చేసిన అబద్ధ ప్రవక్త కూడా పట్టుబడ్డాడు. అతడు ఈ సూచక క్రియలతో మృగం యొక్క ముద్ర వేయబడి దాని విగ్రహాన్ని పూజించిన వారిని మోసగించాడు. వీరిద్దరు ప్రాణాలతో మండుతున్న అగ్నిగంధకాల సరస్సులో పడవేయబడ్డారు.

21 మిగిలిన వారు ఆ గుర్రం మీద కూర్చుని సవారీ చేస్తూ వస్తున్న వాని నోటి నుండి బయటకు వస్తున్న ఖడ్గంతో చంపబడ్డారు. అప్పుడు పక్షులన్ని వారి మాంసాన్ని కడుపారా భక్షించాయి.

తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version™, New Testament

Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan