Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

మార్కు 8 - తెలుగు సమకాలీన అనువాదము


నాలుగు వేలమందికి ఆహారం పెట్టిన యేసు

1 ఆ రోజులలో మరొక పెద్ద గుంపు గుమికూడింది. అయితే వారు ఏమి తినలేదు, కనుక యేసు తన శిష్యులను దగ్గరకు పిలిచి,

2 “ఈ ప్రజలు మూడు రోజులుగా ఏమి తినకుండా నా దగ్గరే ఉండిపోయారు; వారి మీద నాకు జాలి కలుగుతుంది.

3 నేను వీరిని ఆకలితో ఇండ్లకు పంపితే, వారు దారిలో సొమ్మసిల్లిపోతారు ఎందుకంటే కొందరు దూరం నుండి వచ్చారు” అని చెప్పారు.

4 అందుకు ఆయన శిష్యులు, “కాని ఇంత మందికి భోజనం పెట్టి తృప్తిపరచడానికి కావలసినంత ఆహారం ఈ మారుమూల ప్రాంతంలో మనకు ఎక్కడ దొరుకుతుంది?” అన్నారు.

5 యేసు, “మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?” అని వారిని అడిగారు. వారు, “ఏడు” అని జవాబిచ్చారు.

6 యేసు ఆ జనసమూహాన్ని నేల మీద కూర్చోమని ఆదేశించారు. ఆ ఏడు రొట్టెలను పట్టుకొని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, వాటిని విరిచి జనసమూహానికి పంచిపెట్టుమని తన శిష్యులకు ఇచ్చారు, వారు పంచిపెట్టారు.

7 వారి దగ్గర కొన్ని చిన్న చేపలు కూడ ఉన్నాయి; ఆయన వాటిని కూడ ఆశీర్వదించి, పంచిపెట్టుమని తన శిష్యులకు చెప్పారు.

8 ప్రజలు తిని తృప్తి పొందారు. తర్వాత శిష్యులు మిగిలిన ముక్కలను ఏడు గంపల నిండా నింపారు.

9 తిన్న వారందరు ఇంచుమించు నాలుగు వేలమంది. యేసు వారిని పంపించిన వెంటనే,

10 ఆయన తన శిష్యులతో కలిసి పడవ ఎక్కి దల్మనూతా అనే ప్రాంతానికి వెళ్లారు.

11 పరిసయ్యులు వచ్చి యేసును ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆయనను పరీక్షించడానికి, ఆకాశం నుండి ఒక సూచన చూపించుమని వారు ఆయనను అడిగారు.

12 అందుకు ఆయన ఆత్మలో దీర్ఘ నిట్టూర్పు విడిచి, “ఈ తరం వారు నన్ను ఎందుకు సూచన అడుగుతున్నారు? వారికి ఏ సూచన ఇవ్వబడదని నేను మీతో ఖచ్చితంగా చెప్పుతున్నాను” అని వారితో అన్నారు.

13 తర్వాత ఆయన వారిని విడిచిపెట్టి మళ్ళీ పడవ ఎక్కి అవతలి ఒడ్డున చేరుకొన్నారు.


పరిసయ్యులు మరియు హేరోదు యొక్క పులిసిన పిండి

14 శిష్యులు తమతో రొట్టెలను తెచ్చుకోడం మరచిపోయారు, పడవలో వారి దగ్గర ఒక్క రొట్టె తప్ప ఏమి లేదు.

15 యేసు వారితో, “పరిసయ్యుల హేరోదు వెంబడించేవారి పులిసిన పిండి మీలో ఉండకుండా చూసుకోండి” అని వారిని హెచ్చరించారు.

16 వారు, “మన దగ్గర రొట్టెలు లేవని ఇలా అన్నారని” ఒకరితో ఒకరు చర్చించుకున్నారు.

17 వారు ఏమి చర్చించుకుంటున్నారో తెలిసినవాడై యేసు, “రొట్టెలు లేవని మీరు ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఇప్పటికీ మీరు చూడలేకపోతున్నారా లేదా గ్రహించలేక పోతున్నారా? మీ హృదయాలు కఠినమైపోయాయా?

18 మీరు కళ్ళు ఉండి చూడలేకపోతున్నారా? చెవులు ఉండి వినలేకపోతున్నారా? మీకు జ్ఞాపకం లేదా?

19 నేను ఐదు రొట్టెలను విరిచి ఐదు వేలమందికి పంచినప్పుడు, మీరు ఎన్ని గంపలు ఎత్తారు?” అని వారిని అడిగాడు, అందుకు వారు, “పన్నెండు” అని చెప్పారు.

20 “నేను ఏడు రొట్టెలను విరిచి నాలుగు వేలమందికి పంచినప్పుడు, ఎన్ని గంపల నిండా ముక్కలను ఎత్తారు?” అని ఆయన వారిని అడిగారు, అందుకు వారు, “ఏడు” అని జవాబిచ్చారు.

21 అప్పుడు ఆయన వారితో, “మీకు ఇంకా అర్థం కాలేదా?” అన్నారు.


బేత్సయిదా వద్ద గ్రుడ్డివానికి చూపునిచ్చిన యేసు

22 వారు బేత్సయిదాకు వచ్చినప్పుడు, కొందరు ఒక గ్రుడ్డివానిని తీసుకొనివచ్చి వానిని ముట్టుమని ఆయనను బ్రతిమిలాడారు.

23 ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యి పట్టుకుని ఊరి బయటకు తీసుకువెళ్లి, వాని కళ్ళ మీద ఉమ్మివేసి, వాని మీద చేతులుంచి, “నీకు ఏమైనా కనబడుతుందా?” అని అడిగారు.

24 అందుకు వాడు తల పైకెత్తి చూస్తూ, “మనుష్యులు కనపడుతున్నారు, వాళ్లు చెట్లలాగా నడుస్తున్నారు” అని చెప్పాడు.

25 యేసు మళ్ళీ తన చేతులు వాని కళ్ళ మీద ఉంచారు. అప్పుడు వాని కళ్ళు తెరువబడ్డాయి, వాడు చూపు పొందుకొని, అన్నిటినీ స్పష్టంగా చూడగలిగాడు.

26 యేసు వానితో, “నీవు ఊరిలోనికి వెళ్లకుండా ఇంటికి వెళ్లు” అని చెప్పి వానిని పంపివేసారు.


యేసే క్రీస్తు అని చెప్పిన పేతురు

27 యేసు, ఆయన శిష్యులు కైసరయ ఫిలిప్పు చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్లారు. మార్గం మధ్యలో ఆయన వారిని “నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు?” అని అడిగారు.

28 అందుకు వారు, “కొందరు బాప్తిస్మమిచ్చే యోహాను అంటున్నారు; ఇతరులు ఏలీయా అంటున్నారు; మరికొందరు ప్రవక్తలలో ఒకడు అని చెప్పుకొంటున్నారు” అన్నారు.

29 ఆయన వారిని, “అయితే నేనెవరినని మీరనుకొంటున్నారు?” అని అడిగారు. పేతురు, “నీవు క్రీస్తువు” అని చెప్పాడు.

30 అప్పుడు యేసు తన గురించి ఎవరితో చెప్పవద్దని వారిని హెచ్చరించారు.


తన మరణాన్ని గురించి ముందే చెప్తున్న యేసు

31 ఆ తర్వాత యేసు, మనుష్యకుమారుడు యూదా నాయకులచే, ముఖ్య యాజకులచే, ధర్మశాస్త్ర ఉపదేశకులచే తిరస్కరించబడి, అనేక హింసలు పొంది, చంపబడి, మూడు రోజుల తర్వాత తిరిగి లేస్తాడు అని తన శిష్యులకు బోధించడం మొదలుపెట్టారు.

32 ఆయన ఈ మాటను స్పష్టంగా చెప్పారు, గనుక పేతురు ఆయనను ప్రక్కకు తీసుకువెళ్లి గద్దింపసాగాడు.

33 కాని యేసు తన శిష్యులవైపు తిరిగి వారిని చూసి, పేతురును, “సాతానా, నా వెనుకకు పో! నీ మనస్సులో దేవుని విషయాలు లేవు, కేవలం మనుష్యుల విషయాలు వున్నాయి” అని గద్దించారు.


సిలువ మార్గము

34 ఆ తర్వాత యేసు జనసమూహంతో పాటు తన శిష్యులను తన దగ్గరకు పిలిచి వారితో ఈ విధంగా చెప్పారు: “ఎవరైనా నా శిష్యునిగా ఉండాలనుకుంటే, తనను తాను తిరస్కరించుకుని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి.

35 ఎందుకంటే తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకొనేవారు దానిని పోగొట్టుకొంటారు, కానీ నా కొరకు, సువార్త కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకొనేవారు దానిని కాపాడుకొంటారు.

36 ఎవరైనా లోకమంతా సంపాదించుకొని, తమ ప్రాణాన్ని పోగొట్టుకొంటే వారికి ఏమి ఉపయోగం?

37 ఎవరైనా తమ ప్రాణానికి బదులుగా ఏమి ఇవ్వగలరు?

38 ఈ వ్యభిచార, పాపపు తరం మధ్యలో నా గురించి గాని, నా మాటల గురించి గాని ఎవరైనా సిగ్గుపడితే, మనుష్యకుమారుడు తన తండ్రి మహిమతో పరిశుద్ధ దూతలతో పాటు వచ్చినప్పుడు ఆయన వారి గురించి సిగ్గుపడతాడు.”

తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version™, New Testament

Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan