Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

మార్కు 6 - తెలుగు సమకాలీన అనువాదము


ఘనత పొందని ప్రవక్త

1 యేసు తన శిష్యులతో కలిసి, అక్కడి నుండి తన స్వగ్రామానికి వెళ్లారు.

2 సబ్బాతు దినాన, సమాజమందిరంలో ఆయన బోధించడం మొదలుపెట్టారు. ఆయన బోధ విని అనేకమంది ఆశ్చర్యపడ్డారు. “ఎక్కడ నుండి ఇతనికి ఇవి వచ్చాయి? ఈయనకు ఇవ్వబడిన ఈ జ్ఞానం ఏంటి? ఈయన చేస్తున్న ఈ అద్బుతాలు ఏంటి?

3 ఇతడు ఒక వడ్రంగివాడు కాడా? ఇతడు మరియ కుమారుడు కాడా? యాకోబు, యోసే, యూదా, సీమోను ఇతని సహోదరులు కారా? ఇతని సహోదరీలు ఇక్కడ మనతో లేరా?” అని చెప్పుకొంటూ ఆయన విషయంలో అభ్యంతరపడ్డారు.

4 అందుకు యేసు వారితో, “ఒక ప్రవక్త తన స్వగ్రామంలో, తన సొంత బంధువుల మధ్యలో మరియు తన సొంత ఇంట్లో తప్ప అంతటా గౌరవం పొందుతాడు” అని అన్నారు.

5 కొద్దిమంది రోగుల మీద మాత్రమే యేసు చేతులుంచి వారిని బాగుచేశారు తప్ప మరి ఏ అద్బుతాలు అక్కడ చేయలేదు.

6 ఆయన వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు. తర్వాత యేసు బోధిస్తూ చుట్టూ ఉన్న గ్రామ గ్రామానికి వెళ్లారు.


పన్నెండు మంది శిష్యులను సేవకు పంపిన యేసు

7 ఆయన పన్నెండు మందిని తన దగ్గరకు పిలుచుకొని, వారికి అపవిత్రాత్మల మీద అధికారం ఇచ్చి వారిని ఇద్దరిద్దరిగా పంపించడం మొదలుపెట్టారు.

8-9 ఆయన వారికిచ్చిన సూచనలు ఇవే: “ప్రయాణానికి చేతి కర్ర తప్ప వేరే ఏది తీసుకువెళ్ళకూడదు. ఆహారం గాని, చేతిలో సంచి గానీ, నడికట్టులో డబ్బు గాని తీసుకొని వెళ్లకూడదు. చెప్పులు వేసుకోండి కాని ఒక అంగీ ఎక్కువ తీసుకువెళ్లకూడదు.

10 మీరు ఒక ఇంట్లో ప్రవేశిస్తే, ఆ స్థలం వదిలి వెళ్లే వరకు ఆ ఇంట్లోనే బసచేయండి.

11 ఏ స్థలంలోనైనా ప్రజలు మిమ్మల్ని చేర్చుకోకపోతే లేక మీ మాటలు వినకపోతే, మీరు అక్కడి నుండి బయలుదేరే ముందు వారికి సాక్ష్యంగా ఉండడానికి మీ కాళ్ళ దుమ్మును అక్కడ దులిపి వేయండి.”

12 శిష్యులు వెళ్లి, ప్రజలు పశ్చాత్తాపపడాలని ప్రకటించారు.

13 వారు అనేక దయ్యాలను వెళ్లగొట్టారు మరియు అనేక రోగులను నూనెతో ముట్టి వారిని బాగుచేశారు.


బాప్తిస్మమిచ్చు యోహాను శిరచ్ఛేదనం

14 యేసు పేరు ప్రసిద్ధిచెందడం గురించి రాజైన హేరోదుకు తెలిసింది. కొందరు, “బాప్తిస్మమిచ్చు యోహాను చనిపోయినవారిలో నుండి సజీవంగా లేచాడు, అందుకే ఇతనిలో అద్బుతాలు చేసే శక్తి పని చేస్తుంది” అని చెప్తున్నారు.

15 మరికొందరు, “ఈయన ఏలీయా” అని, ఇంకా కొందరు, “ఈయన పూర్వకాల ప్రవక్తలలో ఒక ప్రవక్తలాంటివాడు” అని చెప్పుకొన్నారు.

16 అయితే హేరోదు ఇదంతా విని, “నేను తల నరికించిన యోహాను ఇతడేనా, ఇతడు చావు నుండి లేచాడా!” అనుకున్నాడు.

17 ఎందుకంటే, హేరోదు తన సోదరుడైన ఫిలిప్పు భార్య హేరోదియను పెళ్ళి చేసుకున్నప్పుడు, “నీ సహోదరుని భార్యను నీవు ఉంచుకోడం న్యాయం కాదు” అని యోహాను హేరోదుతో అంటూ ఉండేవాడు.

18 హేరోదు ఆమె కొరకు యోహానును బంధించి చెరసాలలో వేయమని ఆదేశాన్ని జారీ చేశాడు.

19 హేరోదియ యోహాను మీద పగ పెంచుకొని అతన్ని చంపాలని చూసింది. కాని అలా చెయ్యలేకపోయింది.

20 ఎందుకనగా యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడు అని హేరోదు తెలుసుకొని అతనికి భయపడి అతని కాపాడుతూ వచ్చాడు. హేరోదు యోహాను మాటలను విన్నప్పుడు ఎంతో కలవరపడే వాడు; అయినా అతని మాటలను వినడానికి ఇష్టపడేవాడు.

21 చివరికి సరియైన సమయం రానే వచ్చింది. హేరోదు తన జన్మదినం సందర్భంగా తన ప్రధానులకు, సైన్యాధిపతులకు, గలిలయ ప్రాంత ప్రముఖులకు విందు ఇచ్చాడు.

22 అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యంచేసి హేరోదును అతని అతిథులను సంతోషపరిచింది. అందుకు రాజు ఆమెతో, “నీకు ఏమి కావాలో అడుగు, నేను ఇస్తాను” అని అన్నాడు.

23 మరియు అతడు “నీవు ఏది అడిగినా నేను ఇస్తాను, నా రాజ్యంలో సగం అడిగినా ఇచ్చేస్తాను!” అని ఆమెతో ఒట్టుపెట్టుకొని ప్రమాణం చేశాడు.

24 కనుక ఆమె బయటకు వెళ్లి తన తల్లిని, “నేనేమి అడగాలి?” అని అడిగింది. అందుకు ఆమె తల్లి, “బాప్తిస్మమిచ్చు యోహాను తలను అడుగు” అని చెప్పింది.

25 వెంటనే ఆమె రాజు దగ్గరకు త్వరగా వెళ్లి, “బాప్తిస్మమిచ్చు యోహాను తలను పళ్లెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించాలని కోరుకొంటున్నాను” అని చెప్పింది.

26 రాజు ఎంతో దుఃఖించాడు, కాని తనతో కూడ భోజనానికి కూర్చున్న అతిథులు మరియు తాను చేసిన ప్రమాణం కొరకు ఆమె అడిగిన దానిని కాదనలేకపోయాడు.

27 అందువల్ల రాజు వెంటనే ఒక సైనికుడిని పిలిచి, యోహాను తలను తెమ్మని ఆదేశించి పంపించాడు. వాడు వెళ్లి, చెరసాలలో యోహాను తలను నరికి,

28 ఆ తలను పళ్లెంలో పెట్టి తీసుకువచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాడు, ఆమె దానిని తన తల్లికి ఇచ్చింది.

29 ఈ సంగతి విన్న యోహాను శిష్యులు వచ్చి, అతని శవాన్ని తీసుకువెళ్లి సమాధి చేశారు.


ఐదు వేలమందికి ఆహారం పెట్టిన యేసు

30 అపొస్తలులు యేసు చుట్టూ గుమికూడి తాము బోధించినవి, తాము చేసినవి ఆయనకు తెలియజేసారు.

31 అనేకమంది వస్తూ పోతూ ఉండడంతో వారికి భోజనం చేయడానికి కూడా అవకాశం దొరకలేదు. కనుక ఆయన, “మీరు నాతో కూడా ఏకాంత స్థలానికి వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకొండి” అని చెప్పారు.

32 కనుక వారు పడవ ఎక్కి ఏకాంత స్థలానికి వెళ్లారు.

33 అయితే వారు వెళ్తున్నారని చూసిన అనేకమంది వారిని గుర్తుపట్టి, అన్ని పట్టణాల నుండి పరుగెత్తుకుంటూ వెళ్లి వారి కంటే ముందే ఆ స్థలానికి చేరుకొన్నారు.

34 యేసు పడవ దిగి, గొప్ప జనసమూహాన్ని చూసినప్పుడు, వారు కాపరిలేని గొర్రెలవలె ఉన్నారని వారి మీద కనికరపడ్డారు. వారికి అనేక సంగతులను బోధించడం మొదలుపెట్టారు.

35 అప్పటికి ప్రొద్దుపోయే సమయం అయ్యింది, కనుక శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “ఇది మారుమూల ప్రాంతం, పైగా ఆలస్యం కూడా అవుతుంది.

36 కనుక జనాన్ని పంపివేయండి, వారే చుట్టు ప్రక్కన ఉన్న గ్రామాలకు వెళ్లి భోజనాన్ని కొనుక్కుంటారు” అన్నారు.

37 అందుకు యేసు, “మీరే వారికి భోజనం పెట్టండి” అన్నారు. అందుకు వారు, “రెండువందల దేనారాల కంటే ఎక్కువవుతుంది. మేము వెళ్లి, అంత డబ్బు ఖర్చుపెట్టి రొట్టెలను కొని, వారికి పెట్టాలా?” అని ఆయనను అడిగారు.

38 అందుకు ఆయన, “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? వెళ్లి చూడండి” అని అడిగారు. వారు వెళ్లి చూసి, “ఐదు రొట్టెలు, రెండు చేపలు ఉన్నాయి” అన్నారు.

39 అప్పుడు ఆయన వారందరిని పచ్చగడ్డి మీద గుంపులుగా కూర్చోపెట్టమని శిష్యులతో చెప్పారు.

40 వారు వంద యాభైల చొప్పున గుంపులుగా కూర్చున్నారు.

41 అప్పుడు ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను చేతిలో పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి, కృతజ్ఞత చెల్లించి ఆ రొట్టెలను విరిచారు. తర్వాత ప్రజలకు పంచిపెట్టడానికి తన శిష్యులకు ఇచ్చారు. ఆయన ఆ రెండు చేపలను కూడా వారందరికి విభజించారు.

42 వారందరు తిని తృప్తి పొందారు.

43 తర్వాత శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను చేప ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు.

44 తిన్న వారి సంఖ్య ఐదు వేలమంది పురుషులు.


నీటి మీద నడిచిన యేసు

45 వెంటనే యేసు జనసమూహాన్ని పంపివేస్తూ తన శిష్యులు తనకన్న ముందుగా బేత్సయిదా గ్రామానికి వెళ్లేలా వారిని పడవ ఎక్కించారు.

46 వారిని పంపివేసిన తర్వాత, ఆయన ప్రార్థన చేసుకోవడానికి కొండపైకి వెళ్లారు.

47 ఆ రాత్రి సమయాన, ఆ పడవ సరస్సు మధ్యలో ఉంది, ఆయన ఒంటరిగా నేలపైన ఉన్నారు.

48 ఎదురుగాలి వీస్తుండడంతో, శిష్యులు పడవను చాలా కష్టపడుతూ నడపడం యేసు చూసారు. సూర్యోదయానికి కొంచెం ముందు ఆయన సరస్సు మీద నడుస్తూ, వారి దగ్గరకు వెళ్లారు.

49 కాని ఆయన నీళ్ళ మీద నడవటం వారు చూసినప్పుడు, భూతం అనుకుని వారు కేకలు వేశారు,

50 ఎందుకంటే వారందరు ఆయనను చూసి భయపడ్డారు. వెంటనే ఆయన వారితో, “ధైర్యం తెచ్చుకోండి! నేనే, భయపడకండి!” అన్నారు.

51 అప్పుడు ఆయన వారితో పడవలోనికి ఎక్కారు, అప్పుడు గాలి అణిగిపోయింది. వారు ఎంతో ఆశ్చర్యపడ్డారు.

52 రొట్టెల అద్బుతం యొక్క ప్రాముఖ్యతను వారు ఇంకా అర్థం చేసుకోలేదు; వారి హృదయాలు కఠినమయ్యాయి.

53 వారు అవతలకు వెళ్లి, గెన్నేసరెతు అనే ప్రాంతంలో దిగారు, అక్కడ లంగరు వేశారు.

54 వారు పడవ దిగగానే, ప్రజలు యేసును గుర్తుపట్టారు.

55 వారు ఆ ప్రాంతమంతా పరుగెత్తుకొనిపోయి, ఆయన ఎక్కడ ఉన్నాడని విన్నారో అక్కడికి రోగులను పరుపుల మీద మోసుకొచ్చారు.

56 యేసు గ్రామాలకు, పట్టణాలకు, పల్లెటూళ్ళకు, ఎక్కడికి వెళ్లినా వారు రోగులను తెచ్చి సంత వీధుల్లో ఉంచారు. ఆయన వస్త్రపు అంచునైనా ముట్టనివ్వండని వారు ఆయనను బ్రతిమాలుకొన్నారు. ఆయనను ముట్టిన వారందరు స్వస్థత పొందారు.

తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version™, New Testament

Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan