Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

మార్కు 15 - తెలుగు సమకాలీన అనువాదము


పిలాతు ముందు యేసు

1 తెల్లవారుజామున ముఖ్య యాజకులు, నాయకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు మరియు న్యాయసభ సభ్యులు అందరు కలిసి ఆలోచన చేశారు. కనుక వారు యేసును బంధించి, తీసుకువెళ్లి అధిపతియైన పిలాతు చేతికి అప్పగించారు.

2 పిలాతు యేసును, “నీవు యూదుల రాజువా?” అని అడిగాడు. అందుకు యేసు, “అని నీవే అన్నావు” అని జవాబిచ్చారు.

3 ముఖ్య యాజకులు యేసు మీద అనేక నేరాలు మోపారు.

4 అందుకు పిలాతు మళ్ళీ యేసుతో, “నీవు వారికి జవాబు చెప్పవా? వారు నీకు వ్యతిరేకంగా ఎన్ని నేరాలు మోపుతున్నారో చూడు!” అన్నాడు.

5 కాని యేసు జవాబివ్వలేదు, కనుక పిలాతు ఆశ్చర్యపోయాడు.

6 పండుగ రోజు ప్రజల కోరిక ప్రకారం ఒక నేరస్థుని విడుదల చేయడం ఆనవాయితి.

7 తిరుగుబాటు చేసి, మనుష్యులను చంపినందుకు బంధింపబడిన వారిలో బరబ్బా అనేవాడు ఉన్నాడు.

8 ప్రజలు గుంపుగా వచ్చి, అతడు ఎప్పుడూ చేసినట్లే చేయమని పిలాతును కోరారు.

9-10 ముఖ్య యాజకులు కేవలం అసూయతోనే యేసును అప్పగించారని పిలాతుకు తెలుసు, కనుక “యూదుల రాజును విడుదల చేయమంటారా?” అని అడిగాడు.

11 కాని ముఖ్య యాజకులు, యేసుకు బదులుగా బరబ్బాను విడుదల చేసేలా పిలాతును కోరమని గుంపును రెచ్చగొట్టారు.

12 అందుకు పిలాతు, “మరి, మీరు యూదుల రాజు అని పిలిచే ఇతన్ని ఏమి చేయమంటారు?” అని వారిని అడిగాడు.

13 అందుకు వారు, “సిలువ వేయండి!” అని అరిచారు.

14 “ఎందుకు? ఇతడు చేసిన నేరమేంటి?” అని పిలాతు అడిగాడు. అయితే వారు ఇంకా గట్టిగా, “అతన్ని సిలువ వేయండి!” అని కేకలు వేశారు.

15 పిలాతు ఆ ప్రజలను సంతోషపెట్టడానికి, బరబ్బను వారికి విడుదల చేశాడు. యేసును కొరడాలతో కొట్టించి, సిలువ వేయడానికి అప్పగించాడు.


యేసును హేళన చేసిన సైనికులు

16 సైనికులు యేసును ప్రేతోర్యము అని పిలువబడే అధిపతి భవనంలోనికి తీసుకువెళ్లి అక్కడ మిగిలిన సైనికులందరిని సమకూర్చారు.

17 వారు ఆయనకు ఊదారంగు అంగీని వేసి, ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తల మీద పెట్టారు.

18 ఆ తర్వాత, “జయం, యూదుల రాజా!” అని ఆయనను పిలవడం మొదలుపెట్టారు.

19 ఆయన తలపై కొమ్మతో మళ్ళీ మళ్ళీ కొడుతూ, ఆయన మీద ఉమ్మి వేశారు. వారు ఆయన ముందు మోకరించి, ఆయనను అవమానిస్తూ నమస్కరించారు.

20 ఈ విధంగా ఆయనను ఎగతాళి చేసిన తర్వాత, ఆయన మీదనున్న ఊదారంగు వస్త్రాన్ని తీసివేసి, ఆయన వస్త్రాలను ఆయనకే తొడిగించారు. తర్వాత ఆయనను సిలువ వేయడానికి తీసుకువెళ్లారు.


సిలువ వేయబడిన యేసు

21 కురేనీ ప్రాంతానికి చెందిన, అలెగ్జాండరు మరియు రూఫసు అనే వారి తండ్రియైన సీమోను ఆ మార్గాన వెళ్తున్నాడు. సైనికులు అతన్ని పట్టుకొని సిలువ మోయమని బలవంతం చేశారు.

22 వారు యేసును గొల్గొతా అనే స్థలానికి తీసుకొని వచ్చారు. గొల్గొతా అంటే “కపాల స్థలం” అని అర్థం.

23 అప్పుడు వారు ద్రాక్షారసంలో బోళం అనే చేదును కలిపి ఆయనకు ఇచ్చారు, కాని ఆయన దానిని తీసుకోలేదు.

24 ఆ తర్వాత వారు ఆయనను సిలువ వేశారు. ఆయన బట్టలను పంచుకోడానికి, వారు చీట్లు వేసి ఎవరికి వచ్చింది వారు తీసుకొన్నారు.

25 ఆయనను సిలువ వేసినప్పుడు సమయం ఉదయం తొమ్మిది గంటలు అయ్యింది.

26 ఆయనపై ఉన్న నేరం యొక్క వ్రాతపూర్వక ఉత్తర్వు ఇలా ఉంది: యూదుల రాజు.

27 తిరుగుబాటు చేసిన ఇద్దరు బందిపోటు దొంగలను, ఆయనకు కుడి వైపున ఒకడిని, ఎడమ వైపున మరొకడిని సిలువ వేశారు. [

28 ఆయన అపరాధులలో ఒకనిగా ఎంచబడెను అని వ్రాయబడినది.]

29 ఆ దారిలో వెళ్తున్నవారు తలలు ఊపుతూ, “దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాలలో తిరిగి కడతానన్నావు నీవే కదా!

30 సిలువ మీద నుండి దిగిరా, నిన్ను నీవే రక్షించుకో!” అంటూ ఆయనను దూషించారు.

31 అలాగే ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయనను ఎగతాళి చేశారు, “వీడు ఇతరులను రక్షించాడు, కాని తనను తాను రక్షించుకోలేడు.

32 ఈ క్రీస్తు, ఇశ్రాయేలీయుల రాజు, మేము చూసి నమ్మేలా ఇప్పుడు సిలువ నుండి దిగిరావాలి” అని ఆయనను హేళన చేశారు. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు కూడా ఆయనపై అవమానాలు గుప్పించారు.


యేసు మరణము

33 మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది.

34 మూడు గంటలకు యేసు, “ఎలోయి, ఎలోయి, లామా సబక్తానీ” అని బిగ్గరగా కేక వేశారు. ఆ మాటలకు “నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు?” అని అర్థం.

35 దగ్గర నిలబడిన వారిలో కొందరు ఆ మాటలను విని, “వినండి, ఇతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు.

36 ఒకడు పరుగెత్తుకొని వెళ్లి, ఒక స్పంజీని పుల్లని ద్రాక్షరసంలో ముంచి ఒక కర్రకు తగిలించి, యేసుకు త్రాగడానికి అందించాడు. “ఇప్పుడు వీన్ని ఒంటరిగా వదలి వేద్దాం. ఏలీయా వచ్చి వీన్ని కిందికి దించుతాడేమో చూద్దాం” అన్నాడు.

37 గొప్ప కేక వేసి, యేసు ప్రాణం విడిచారు.

38 అప్పుడు దేవాలయంలో తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగిపోయింది.

39 యేసుకు ఎదురుగా నిలబడివున్న శతాధిపతి, ఆయన ప్రాణం విడవడం చూసి, “నిజంగా ఈయన దేవుని కుమారుడే!” అన్నాడు.

40 కొందరు స్త్రీలు దూరం నుండి చూస్తున్నారు. వారిలో మగ్దలేనే మరియ, చిన్నవాడైన యాకోబు మరియు యోసేపుల తల్లియైన మరియ ఇంకా సలోమి ఉన్నారు.

41 ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి, ఆయనకు సేవ చేశారు, వీరే కాక ఆయన వెంట యెరూషలేముకు వచ్చిన అనేకమంది స్త్రీలు కూడ అక్కడ ఉన్నారు.


యేసు సమాధి

42 అది సిద్ధపాటు రోజు అనగా సబ్బాతు దినానికి ముందు రోజు. కనుక సాయంకాలమైనప్పుడు,

43 అరిమతయికు చెందిన యోసేపు న్యాయసభలో ప్రాముఖ్యమైన సభ్యుడు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నవాడు, అతడు ధైర్యంగా పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు.

44 ఆయన అప్పటికే చనిపోయాడని విన్న పిలాతు ఆశ్చర్యపడ్డాడు. శతాధిపతిని తన దగ్గరకు పిలిచి, యేసు అప్పుడే చనిపోయాడా అని అడిగాడు.

45 శతాధిపతి నుండి ఆ సంగతిని తెలుసుకున్నాక, యోసేపుకు యేసు శరీరాన్ని అప్పగించాడు.

46 కనుక యోసేపు సన్నని నారబట్ట కొని తెచ్చి, యేసు శరీరాన్ని కిందికి దింపి, దానిని సన్నపు నారబట్టతో చుట్టి, రాతితో చెక్కబడిన సమాధిలో పెట్టాడు. తర్వాత ఆ సమాధి ద్వారం ముందు ఒక పెద్ద రాయి దొర్లించి దానిని మూసి వేసాడు.

47 మగ్దలేనే మరియ, యోసేపు తల్లియైన మరియ ఆయనను పెట్టిన చోటును చూసారు.

తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version™, New Testament

Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan