మత్తయి 17 - తెలుగు సమకాలీన అనువాదముయేసు రూపాంతరం చెందుట 1 ఆరు రోజుల తర్వాత యేసు పేతురు, యాకోబు, అతని సహోదరుడైన యోహానును వెంట తీసుకొని ఒంటరిగా ఒక ఎత్తైన కొండ మీదికి వెళ్లారు. 2 అక్కడ ఆయన వారి ముందు రూపాంతరం పొందారు. అప్పుడు ఆయన ముఖం సూర్యునిలా ప్రకాశించింది, ఆయన వస్త్రాలు వెలుగువలె తెల్లగా మారాయి. 3 అప్పుడు మోషే, ఏలీయా యేసుతో మాట్లాడుతూ, వారికి కనబడ్డారు. 4 అప్పుడు పేతురు యేసుతో, “ప్రభువా, మనం ఇక్కడే ఉండడం మంచిది. నీకు ఇష్టమైతే, మూడు గుడారాలను వేద్దాం, నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలీయాకు ఒకటి” అని చెప్పాడు. 5 అతడు ఇంకా మాట్లాడుతున్నప్పుడు, కాంతివంతమైన ఒక మేఘం వారిని కమ్ముకొని ఆ మేఘంలో నుండి ఒక స్వరం వారితో, “ఇదిగో ఈయన నేను ప్రేమించే నా ప్రియ కుమారుడు, ఈయనలో నేను ఆనందిస్తున్నాను, కనుక ఈయన మాటలను వినండి!” అని చెప్పడం వినిపించింది. 6 శిష్యులు ఆ మాటలు విని, భయంతో నేల మీద బోర్లపడిపోయారు. 7 కానీ యేసు వారి దగ్గరకు వచ్చి వారిని ముట్టి “లేవండి, భయపడకండి” అని చెప్పారు. 8 వారు లేచి కళ్ళు తెరిచి చూసినప్పుడు, అక్కడ వారికి యేసు తప్ప మరి ఎవరు కనిపించలేదు. 9 వారు కొండ దిగి వస్తునప్పుడు, “మనుష్యకుమారుడు చనిపోయి తిరిగి లేచేవరకు మీరు చూసినవాటిని ఎవరితో చెప్పవద్దు” అని యేసు శిష్యులను ఖచ్చితంగా ఆదేశించారు. 10 అప్పుడు శిష్యులు “ఏలీయా ముందుగా రావాలని ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎందుకు చెప్తున్నారు?” అని ఆయనను అడిగారు. 11 అందుకు యేసు, “వాస్తవానికి, ఏలీయా వచ్చి అంతా చక్కపెడతాడన్న మాట నిజమే. 12 ఏలీయా ముందే వచ్చాడు కాని ఎవరు అతన్ని గుర్తించలేదు, వారు తమకు ఇష్టం వచ్చినట్టుగా అతనికి చేశారు. మనుష్యకుమారుడు కూడ అలాగే వారి చేత హింసను పొందబోతున్నాడని మీతో చెప్తున్నాను” అన్నారు. 13 యేసు తమతో చెప్తున్నది బాప్తిస్మమిచ్చు యోహానును గురించి అని శిష్యులు అర్థం చేసుకున్నారు. యేసు దయ్యము పట్టిన కుమారుని స్వస్థపరచుట 14 వారు జనసమూహాన్ని సమీపించినప్పుడు ఒకడు యేసు దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరించి, 15 “ప్రభువా, నా కుమారుని కరుణించు. వాడు మూర్ఛ రోగంతో చాలా బాధపడుతున్నాడు. పదే పదే నిప్పులో, నీళ్లలో పడిపోతున్నాడు. 16 నేను వీన్ని నీ శిష్యుల దగ్గరకు తీసికొని వచ్చాను కానీ వారు వీన్ని బాగు చేయలేకపోయారు” అని చెప్పాడు. 17 అందుకు యేసు, “విశ్వాసంలేని మూర్ఖతరమా, నేను మీతో ఎంతకాలం ఉంటాను? ఎంతకాలం మీ అవిశ్వాసాన్ని సహించగలను? ఆ పిల్లవాన్ని నా దగ్గరకు తీసుకొనిరండి” అన్నారు. 18 అప్పుడు యేసు ఆ దయ్యాన్ని గద్దించారు, అది వానిని వదలిపోయింది. ఆ సమయం నుండి వాడు బాగైపోయాడు. 19 ఆ తర్వాత శిష్యులు యేసు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి, “మేము ఎందుకు దానిని వెళ్లగొట్టలేకపోయాం” అని అడిగారు. 20 అందుకు యేసు, “మీ అల్పవిశ్వాసమే దానికి కారణం. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను చూసి, ‘ఇక్కడి నుండి అక్కడికి వెళ్లు’ అంటే అది పోతుంది. ఎందుకంటే మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. [ 21 ఇలాంటివి కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే బయటకు వెళ్లిపోతాయి” అని వారికి చెప్పారు.] యేసు రెండవ సారి తన మరణాన్ని గురించి ప్రవచించుట 22 వారు గలిలయ ప్రాంతంలో ఉన్నప్పుడు యేసు తన శిష్యులతో, “మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగించబడతాడు. 23 అప్పుడు వారు ఆయనను చంపుతారు కానీ ఆయన మూడవ రోజున సజీవంగా తిరిగి లేచును” అని శిష్యులతో చెప్పినప్పుడు వారు ఎంతో దుఃఖించారు. యేసు దేవాలయంలో పన్ను చెల్లించుట 24 తర్వాత యేసు తన శిష్యులతో కపెర్నహూము పట్టణానికి చేరినప్పుడు, అర షెకెలు మందిర పన్ను వసూలు చేసేవారు పేతురు దగ్గరకు వచ్చి, “మీ బోధకుడు మందిర పన్ను చెల్లించడా?” అని అడిగారు. 25 అందుకు పేతురు, “చెల్లిస్తాడు” అని జవాబిచ్చాడు. పేతురు ఇంట్లోకి వచ్చినప్పుడు యేసు ముందుగా మాట్లాడుతూ, అతన్ని, “సీమోనూ, నీవేమి అనుకుంటున్నావు? ఈ భూ రాజులు మందిర పన్ను ఎవరి దగ్గర వసూలు చేయాలి? సొంత కుమారుల దగ్గరా లేక బయటి వారి దగ్గరా?” అని అడిగారు. 26 అందుకు పేతురు, “బయటి వారి దగ్గరే” అని చెప్పాడు. అందుకు యేసు, “అలాగైతే కుమారులు పన్నుకట్టే అవసరం లేదు. 27 కాని మనం వారికి అభ్యంతరంగా ఉండకూడదు, కనుక నీవు సముద్రానికి వెళ్లి నీ గాలం వేయి. నీవు పట్టిన మొదటి చేపను తీసుకో, దాని నోటిని తెరిస్తే దానిలో నీకు ఒక షెకెలు నాణెము దొరుకుతుంది. అది తీసుకొని నా కొరకు నీ కొరకు మందిర పన్ను చెల్లించు” అని చెప్పారు. |
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.