Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

లూకా సువార్త 6 - తెలుగు సమకాలీన అనువాదము


యేసు సబ్బాతు దినానికి ప్రభువు

1 ఒక సబ్బాతు దినాన యేసు పంటచేనుల గుండా వెళ్తున్నప్పుడు, ఆయన శిష్యులు కొన్ని కంకులు తెంపుకొని, తమ చేతుల్లో వాటిని నలిపి తినడం మొదలుపెట్టారు.

2 అది చూసిన పరిసయ్యులు కొందరు, “మీరెందుకు సబ్బాతు దినాన చేయకూడని పని చేస్తున్నారు?” అని వారిని అడిగారు.

3 యేసు వారితో, “దావీదుకు మరియు అతనితో ఉన్నవారికి ఆకలి వేసినప్పుడు అతడు ఏమి చేశాడో మీరు చదవలేదా?

4 అతడు దేవుని ఆలయంలో ప్రవేశించి, యాజకులు తప్ప మరెవరు తినకూడని ప్రతిష్ఠిత రొట్టెను తీసుకొని, తాను తిని తనతో ఉన్నవారికి ఇచ్చాడు” అని జవాబిచ్చారు.

5 ఆ తర్వాత యేసు వారితో, “మనుష్యకుమారుడు సబ్బాతు దినానికి ప్రభువు” అని చెప్పారు.

6 మరొక సబ్బాతు దినాన ఆయన సమాజమందిరానికి వెళ్లి బోధిస్తుండగా, అక్కడ కుడి చేతికి పక్షవాతం గలవాడు ఒకడున్నాడు.

7 యేసు మీద నేరం మోపడానికి కారణం వెదుకుతున్న పరిసయ్యులు మరియు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయన సబ్బాతు దినాన వానిని స్వస్థపరుస్తారేమో అని కనిపెట్టుకొని ఉన్నారు.

8 అయితే యేసు వారి ఆలోచనలను తెలిసినవాడై చేతికి పక్షవాతం గలవానితో, “లేచి అందరి ముందు నిలబడు” అన్నారు. అందుకతడు లేచి నిలబడ్డాడు.

9 అప్పుడు యేసు, “నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, సబ్బాతు దినాన ఏది న్యాయం: మంచి చేయడమా లేదా చెడు చేయడమా, ప్రాణం రక్షించడమా లేదా ప్రాణం తీయడమా?” అని వారిని అడిగారు.

10 ఆయన చుట్టూ ఉన్న వారిని చూసి, చేతికి పక్షవాతం గలవానితో, “నీ చెయ్యి చాపు” అన్నారు. వాడు అలాగే చేశాడు, వాని చెయ్యి పూర్తిగా బాగయింది.

11 అయితే పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు మండిపడి యేసును ఏమి చేయాలా అని ఒకరితో ఒకరు చర్చించుకోవడం మొదలుపెట్టారు.


పన్నెండు మంది అపొస్తలులు

12 ఆ రోజుల్లో ఒక రోజు యేసు ప్రార్థించడానికి కొండకు వెళ్లి, రాత్రంతా దేవుని ప్రార్థిస్తూ గడిపారు.

13 ఉదయమైనప్పుడు, ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఎన్నుకొని, వారిని అపొస్తలులుగా నియమించారు. అపొస్తలులు అనగా “పిలువబడిన వారు” అని అర్థం.

14 వారు ఎవరనగా, ఆయన పేతురు అని పేరుపెట్టిన సీమోను, అతని సహోదరుడు అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి,

15 మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, అత్యాసక్తి కలవాడని పిలువబడే సీమోను,

16 యాకోబు కుమారుడైన యూదా, మరియు ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.


దీవెనలు మరియు శ్రమలు

17 ఆయన కొండ దిగి వారితో పాటు మైదానంలో నిలబడ్డారు. అక్కడ ఆయన శిష్యుల యొక్క పెద్ద సమూహం ఉంది మరియు యూదయ అంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు, సీదోను చుట్టూవున్న తీర ప్రాంతం నుండి వచ్చిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

18 వారు ఆయన చెప్పే బోధను వినడానికి మరియు తమ వ్యాధుల నుండి స్వస్థత పొందడానికి వచ్చారు. అపవిత్రాత్మలు పీడిస్తున్న వారు కూడా బాగుపడ్డారు,

19 ప్రజలందరూ ఆయనను ముట్టుకోవాలని ప్రయత్నించారు ఎందుకంటే, ఆయనలో నుండి ప్రభావం బయలుదేరి వారందరిని స్వస్థపరుస్తున్నది.

20 తన శిష్యులవైపు చూస్తూ, ఆయన అన్నారు: “దీనులైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీదే.

21 ఇప్పుడు ఆకలిగొనిన మీరు ధన్యులు, మీరు తృప్తిపొందుతారు. ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు.

22 మనుష్యకుమారుని నిమిత్తం ప్రజలు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, మిమ్మల్ని అవమానించి, మీరు చెడ్డవారని మీ పేరును తృణీకరించినప్పుడు మీరు ధన్యులు.

23 “ఆ రోజు మీరు సంతోషించి గంతులు వేయండి, ఎందుకంటే పరలోకంలో మీ బహుమానం గొప్పది. ఎందుకంటే వారి పితరులు కూడా ప్రవక్తలను ఇలాగే హింసించారు.

24 “కాని ధనవంతులారా మీకు శ్రమ, మీ ఆదరణను మీరు ఇప్పటికే పొందుకున్నారు.

25 ఇప్పుడు కడుపు నింపుకొన్న వారలారా మీకు శ్రమ, మీరు ఆకలిగొంటారు. ఇప్పుడు నవ్వుతున్న వారలారా మీకు శ్రమ, మీరు దుఃఖించి రోదిస్తారు.

26 మనుష్యులందరు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ, వారి పూర్వీకులు అబద్ధ ప్రవక్తలకు అలాగే చేశారు.


శత్రువులను ప్రేమించుట

27 “అయితే వింటున్న మీతో నేను చెప్పేది ఏంటంటే: మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి,

28 మిమ్మల్ని శపించే వారిని దీవించండి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థించండి.

29 ఒకడు నిన్ను ఒక చెంప మీద కొడితే, వానికి నీ మరో చెంపను కూడ చూపించు. ఒకవేళ ఒకడు నీ పైవస్త్రాన్ని తీసుకుంటే, వానికి నీ అంగీని ఇవ్వకుండా వెనుకకు తీసుకోవద్దు.

30 నిన్ను అడిగే ప్రతివానికి ఇవ్వు, మరియు ఒకవేళ ఎవరైన నీకు చెందిన దానిని తీసుకుంటే, దాన్ని మళ్ళీ అడగవద్దు.

31 ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు కోరుతున్నారో మీరు వారికి అలాగే చేయండి.

32 “ఒకవేళ మిమ్మల్ని ప్రేమించేవారినే మీరు ప్రేమిస్తే, మీకు కలిగే గొప్పేమిటి? పాపులు కూడా తమను ప్రేమించేవారినే ప్రేమిస్తారు.

33 మరియు ఒకవేళ మీరు మీకు మేలు చేసే వారికే మేలు చేస్తే, మీకేమి లాభం? పాపులు కూడ అలాగే చేస్తారు.

34 మీకు తిరిగి ఇవ్వగలిగిన వారికే మీరు ఇస్తే మీకేమి లాభం? మీరు కూడా తాము ఇచ్చింది తమకు పూర్తిగా తిరిగి వస్తుందని పాపులకే ఇస్తారు.

35 మీరైతే మీ శత్రువులను ప్రేమించండి, వారికి మేలు చేయండి, తిరిగి ఏమి ఆశించకుండా అప్పు ఇవ్వండి. అప్పుడు మీ ప్రతిఫలం గొప్పగా ఉంటుంది, మీరు సర్వోన్నతుని పిల్లలుగా ఉంటారు, ఎందుకంటే ఆయన కృతజ్ఞతలేని వారికి మరియు దుష్టులకు దయ చూపించేవాడు.

36 మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు, మీరు కూడ కనికరం గలవారై ఉండండి.


ఇతరులకు తీర్పు తీర్చుట

37 “తీర్పు తీర్చకండి, మీకు తీర్పు తీర్చబడదు. ఖండించకండి, మీరు ఖండించబడరు. క్షమించండి, మీరు క్షమించబడతారు.

38 ఇవ్వండి, మీకు ఇవ్వబడుతుంది. అణిచి, కుదిపి, పొర్లిపారునట్లు నిండు కొలత మీ ఒడిలో పోయబడుతుంది. ఎందుకంటే, మీరు ఏ కొలతతో కొలుస్తారో, మీకు అదే కొలత కొలవబడుతుంది.”

39 యేసు వారికి ఈ ఉపమానాన్ని కూడా చెప్పారు, “గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపించగలడా? వారిద్దరు గుంటలో పడరా?

40 ఒక శిష్యుడు బోధకుని కంటే ఉన్నతుడు కాడు, అయితే పూర్తిగా శిక్షణ పొందుకొన్నవాడు తన బోధకునిలా అవుతాడు.

41 “నీ కంటిలో ఉన్న దూలాన్ని పట్టించుకోకుండా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును ఎందుకు చూస్తావు?

42 నీ కంటిలో ఉన్న దూలాన్ని చూసుకోవడం విఫలం అయిన నీవు నీ సహోదరునితో, ‘సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీయనివ్వు’ అని నీవెలా అనగలవు? ఓ వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేయు, అప్పుడు నీ సహోదరుని కంటిలోని నలుసును తీసివేయడానికి నీకు స్పష్టంగా కనిపిస్తుంది.


ఒక చెట్టు మరియు దాని ఫలము

43 “ఏ మంచిచెట్టు చెడ్డపండ్లు కాయదు, ఏ చెడ్డచెట్టు మంచిపండ్లు కాయదు.

44 ప్రతి చెట్టు దాని ఫలాన్నిబట్టి గుర్తించబడుతుంది. ప్రజలు ముండ్ల పొదలలో అంజూరపు పండ్లను, లేక గచ్చ పొదలలో ద్రాక్షపండ్లను కోయరు.

45 మంచివారు తమ హృదయంలో నిండివున్న మంచి నుండి మంచివాటినే బయటికి తెస్తారు, అలాగే చెడ్డవారు తమ హృదయంలో నిండివున్న చెడు నుండి చెడ్డవాటినే బయటికి తెస్తారు. ఎందుకంటే, హృదయం దేనితో నిండివుందో దానినే నోరు మాట్లాడుతుంది.


బుద్ధిగల మరియు బుద్ధిలేని నిర్మాణకులు

46 “నేను చెప్పే మాట ప్రకారం చేయకుండా ఎందుకు నన్ను ‘ప్రభువా, ప్రభువా’ అని పిలుస్తున్నారు?

47 నా దగ్గరకు వచ్చి నా మాటలు విని వాటి ప్రకారం చేసే ప్రతి ఒక్కరు ఎలాంటివారో నేను మీకు చూపిస్తా.

48 వారు లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసి, ఇల్లు కడుతున్న వ్యక్తిలా ఉంటారు. వరద వచ్చినప్పుడు, ప్రవాహం వేగంగా ఆ ఇంటిని కొట్టింది కాని దాన్ని కదల్చలేకపోయింది, ఎందుకంటే అది మంచిగా కట్టబడింది.

49 కానీ నా మాటలు విని వాటి ప్రకారం చేయనివారు పునాది వేయకుండా నేల మీద ఇల్లు కట్టిన వాని లాంటివారు. వరద ప్రవాహం వేగంగా ఆ ఇంటిని కొట్టగానే, అది కూలి పూర్తిగా ధ్వంసం అయ్యింది.”

తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version™, New Testament

Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan