లూకా సువార్త 3 - తెలుగు సమకాలీన అనువాదముమార్గాన్ని సిద్ధపరచే బాప్తిస్మమిచ్చు యోహాను 1 తిబెరి కైసరు ఏలుచున్న పదిహేనవ సంవత్సరంలో, యూదయ ప్రాంతానికి అధిపతిగా పొంతి పిలాతు, గలిలయ ప్రాంతానికి చతుర్థాధిపతిగా హేరోదు, ఇతూరియా మరియు త్రకోనీతి అనే ప్రాంతాలకు చతుర్థాధిపతిగా అతని తమ్ముడైన ఫిలిప్పు మరియు అబిలేనె ప్రాంతానికి చతుర్థాధిపతిగా లుసానీయ ఉన్నారు. 2 అన్నా కయపాల ప్రధాన యాజకత్వం కొనసాగుతున్న సమయంలో, అరణ్యంలో నివసిస్తున్న జెకర్యా కుమారుడైన యోహాను దగ్గరకు దేవుని వాక్కు వచ్చింది. 3 అతడు పాపక్షమాపణ కొరకై పశ్చాత్తాపపడి బాప్తిస్మం పొందుకోండని ప్రకటిస్తూ, యూదయలోని యోర్దాను నదీ తీరప్రాంతమంతా వెళ్లాడు. 4-6 ప్రవక్తయైన యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉన్నట్లుగా: “ ‘ప్రభువు కొరకు మార్గాన్ని సిద్ధపరచండి, ఆయన కొరకు త్రోవలను సరిచేయండి. ప్రతి లోయ పూడ్చబడుతుంది, ప్రతి పర్వతం, కొండ పల్లంగా చేయబడుతుంది. వంకర త్రోవలు తిన్ననివవుతాయి, గరుకు మార్గాలు నునుపు అవుతాయి. అందరు దేవుని రక్షణను చూస్తారు,’ అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్తున్న ఒకరి స్వరం.” 7 తనచే బాప్తిస్మం పొందడానికి వస్తున్న జనసమూహంతో యోహాను, “సర్పసంతానమా! రానున్న ఉగ్రత నుండి తప్పించుకోడానికి మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు? 8 పశ్చాత్తాపానికి తగిన ఫలాలను ఫలించండి. ‘అబ్రాహాము మాకు తండ్రిగా ఉన్నాడు’ అని మీలో మీరు అనుకోవడం మొదలుపెట్టవద్దు. ఎందుకంటే దేవుడు ఈ రాళ్ళ నుండి కూడా అబ్రాహాముకు సంతానం కలుగచేయగలడు అని మీతో చెప్తున్నాను. 9 ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరు దగ్గర ఉంది, మంచి పండ్లను ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది.” 10 అందుకు జనసమూహం, “అయితే మేము ఏమి చేయాలి?” అని అడిగారు. 11 అందుకు యోహాను, “రెండు చొక్కాలు ఉన్న వాడు ఏమిలేని వానికి ఇవ్వాలి, ఆహారం గలవాడు కూడా అలాగే చేయాలి” అన్నాడు. 12 పన్ను వసూలు చేసేవారు కూడ బాప్తిస్మం పొందడానికి వచ్చారు. వారు, “బోధకుడా, మేము ఏమి చేయాలి?” అని అడిగారు. 13 అందుకు అతడు వారితో, “మీకు నిర్ణయించబడిన పన్ను కంటే ఎక్కువ తీసుకోవద్దు” అని చెప్పాడు. 14 తర్వాత కొందరు సైనికులు వచ్చి, “మేము ఏమి చేయాలి?” అని అడిగారు. అందుకతడు, “ఎవరి దగ్గరి నుండి అక్రమంగా డబ్బు తీసుకోవద్దు మరియు అన్యాయంగా ఎవరి మీదా నేరం మోపవద్దు, మీ జీతంతో తృప్తిగా ఉండండి” అని వారితో చెప్పాడు. 15 ప్రజలు క్రీస్తు వస్తాడని ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు గనుక యోహానే క్రీస్తు అయివుంటాడా అని వారందరు తమ హృదయాల్లో అనుకుంటూ ఉన్నారు. 16 అప్పుడు యోహాను వారందరితో అన్నాడు, “నేను నీటితో మీకు బాప్తిస్మమిస్తున్నాను. కాని నాకన్నా శక్తిమంతుడు ఒకడు వస్తాడు, ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా నేను యోగ్యున్ని కాదు. ఆయన మీకు పరిశుద్ధాత్మతో, అగ్నితో బాప్తిస్మం ఇస్తారు. 17 గోధుమల నుండి పొట్టును వేరు చేయడానికి తన చేతిలో చేటతో ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన గోధుమలను తన ధాన్యపు కొట్టులో పోసి, తన నూర్చెడి కల్లమును శుభ్రం చేసి, పొట్టును ఆరని అగ్నిలో కాల్చివేస్తారు.” 18 అతడు ఇంకా అనేకమైన ఇతర మాటలతో వారిని హెచ్చరిస్తూ వారికి సువార్త ప్రకటించాడు. 19 అయితే చతుర్ధాధిపతియైన హేరోదు, తన సోదరుని భార్యయైన హేరోదియను పెళ్ళి చేసుకున్నందుకు, మరియు అతడు చేసిన ఇతర దుష్ట క్రియలను గురించి యోహాను అతన్ని గద్దించాడు కనుక, 20 హేరోదు యోహానును చెరసాలలో వేయించి, తాను చేసిన తప్పులన్నింటికి తోడు దీన్ని కూడా చేర్చుకున్నాడు. యేసు బాప్తిస్మం మరియు ఆయన వంశావళి 21 ప్రజలందరు బాప్తిస్మం పొందుతున్నప్పుడు, యేసు కూడా బాప్తిస్మం పొందుకొన్నారు. ఆయన ప్రార్థిస్తుండగా, ఆకాశం తెరువబడింది, 22 పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదకు దిగివచ్చాడు. పరలోకం నుండి ఒక స్వరం: “నీవు నా కుమారుడవు, నేను ప్రేమించేవాడవు; నీయందు నేను ఎంతో ఆనందిస్తున్నాను” అని చెప్పడం వినబడింది. 23 ఆ తర్వాత యేసు పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన ఇంచుమించు ముప్పై యేండ్ల వయస్సు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని, అనుకున్నారు, యోసేపు హేలీ కుమారుడు, 24 హేలీ మత్తతు కుమారుడు, మత్తతు లేవి కుమారుడు, లేవి మెల్కి కుమారుడు, మెల్కి యన్న కుమారుడు, యన్న యోసేపు కుమారుడు, 25 యోసేపు మత్తతీయ కుమారుడు, మత్తతీయ ఆమోసు కుమారుడు, ఆమోసు నహూము కుమారుడు, నహూము ఎస్లి కుమారుడు, ఎస్లి నగ్గయి కుమారుడు, 26 నగ్గయి మయతు కుమారుడు, మయతు మత్తతీయ కుమారుడు, మత్తతీయ సిమియ కుమారుడు, సిమియ యోశేఖు కుమారుడు, యోశేఖు యోదా కుమారుడు, 27 యోదా యోహన్న కుమారుడు, యోహన్న రేసా కుమారుడు, రేసా జెరుబ్బాబెలు కుమారుడు, జెరుబ్బాబెలు షయల్తీయేలు కుమారుడు, షయల్తీయేలు నేరి కుమారుడు, 28 నేరి మెల్కి కుమారుడు, మెల్కీ అద్ది కుమారుడు, అద్ది కోసాం కుమారుడు, కోసాము ఎల్మాదాం కుమారుడు, ఎల్మాదాం ఏరు కుమారుడు, 29 ఏరు యెహోషువ కుమారుడు, యెహోషువ ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు యోరీము కుమారుడు, యోరీము మత్తతు కుమారుడు, మత్తతు లేవి కుమారుడు, 30 లేవి షిమ్యోను కుమారుడు, షిమ్యోను యూదా కుమారుడు, యూదా యోసేపు కుమారుడు. యోసేపు యోనాము కుమారుడు, యోనాము ఎల్యాకీము కుమారుడు, 31 ఎల్యాకీము మెలెయ కుమారుడు, మెలెయ మెన్నా కుమారుడు, మెన్నా మత్తతా కుమారుడు, మత్తతా నాతాను కుమారుడు, నాతాను దావీదు కుమారుడు, 32 దావీదు యెష్షయి కుమారుడు, యెష్షయి ఓబేదు కుమారుడు, ఓబేదు బోయజు కుమారుడు, బోయజు శల్మాను కుమారుడు, శల్మాను నయస్సోను కుమారుడు, 33 నయస్సోను అమ్మీనాదాబు కుమారుడు, అమ్మీనాదాబు అరాము కుమారుడు, అరాము ఎస్రోము కుమారుడు, ఎస్రోము పెరెసు కుమారుడు, పెరెసు యూదా కుమారుడు, 34 యూదా యాకోబు కుమారుడు, యాకోబు ఇస్సాకు కుమారుడు, ఇస్సాకు అబ్రాహాము కుమారుడు, అబ్రాహాము తెరహు కుమారుడు, తెరహు నాహోరు కుమారుడు, 35 నాహోరు సెరూగు కుమారుడు, సెరూగు రయూ కుమారుడు, రయూ పెలెగు కుమారుడు, పెలెగు హెబెరు కుమారుడు, హెబెరు షేలహు కుమారుడు, 36 షేలహు కేయినాను కుమారుడు, కేయినాను అర్పక్షదు కుమారుడు, అర్పక్షదు షేము కుమారుడు, షేము నోవహు కుమారుడు, నోవహు లెమెకు కుమారుడు, 37 లెమెకు మెతూషెల కుమారుడు, మెతూషెల హనోకు కుమారుడు, హనోకు యెరెదు కుమారుడు, యెరెదు మహలలేలు కుమారుడు, మహలలేలు కేయినాను కుమారుడు, 38 కేయినాను ఎనోషు కుమారుడు, ఎనోషు షేతు, షేతు ఆదాము కుమారుడు, ఆదాము దేవుని కుమారుడు. |
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.