లూకా సువార్త 12 - తెలుగు సమకాలీన అనువాదముహెచ్చరికలు మరియు ప్రోత్సాహాలు 1 అంతలో, వేలాదిమంది ప్రజలు ఒకరినొకరు త్రొక్కిసలాడుకొనేంతగా గుమికూడారు. అప్పుడు యేసు మొదట తన శిష్యులతో మాట్లాడడం ప్రారంభించారు: “వేషధారణ అనే పరిసయ్యుల పులిసిన పిండి మీలో ఉండకుండా జాగ్రత్తగా చూసుకోండి. 2 దాచిపెట్టబడినదేది బయటపడక ఉండదు, మరుగున ఉంచినదేది తెలియకుండా ఉండదు. 3 మీరు చీకట్లో మాట్లాడినవి పగటివేళలో వినబడతాయి. మీరు లోపలి గదుల్లో చెవిలో చెప్పిన మాటలు పైకప్పుల నుండి ప్రకటించబడతాయి. 4 “నా స్నేహితులారా, నేను మీతో చెప్పేదేమంటే, మీ శరీరాన్ని చంపి, ఆ తర్వాత ఏమి చేయలేని వారికి భయపడకండి. 5 మీరు ఎవరికి భయపడాలో నేను చెప్తాను: మీ దేహం చంపబడిన తర్వాత, మిమ్మల్ని నరకంలో పడద్రోసే శక్తిగల వానికి భయపడండి. అవును, ఆయనకే భయపడండి. 6 ఐదు పిచ్చుకలు రెండు కాసులకే అమ్మబడడం లేదా? అయినా వాటిలో ఒక దానిని కూడా దేవుడు మరచిపోరు. 7 నిజానికి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి. మీరు అనేక పిచ్చుకల కంటే విలువైనవారు; కనుక భయపడకండి. 8 “ఎవరు ఇతరుల ముందు బహిరంగంగా నన్ను ఒప్పుకుంటారో, మనుష్యకుమారుడు కూడా దేవదూతల ముందు వారిని ఒప్పుకుంటారు. 9 కాని ఇతరుల ముందు ఎవరు నన్ను నిరాకరిస్తారో దేవదూతల ముందు వారు నిరాకరించబడతారు. 10 మనుష్యకుమారునికి విరోధంగా మాట్లాడే వారికైనా క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడేవారెవ్వరు క్షమించబడరు. 11 “మిమ్మల్ని సమాజమందిరాలు, పరిపాలకులు మరియు అధికారుల ముందుకు ఈడ్చుకొని వెళ్లినప్పుడు, మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో అని ఏమి చెప్పాలో అని మీరు చింతపడవద్దు. 12 ఎందుకంటే మీరు ఏమి చెప్పాలో ఆ సమయంలోనే పరిశుద్ధాత్మ మీకు బోధిస్తాడు.” బుద్ధిలేని ఒక ధనవంతుని గురించిన ఉపమానం 13 ఆ జనసమూహంలో నుండి ఒకడు ఆయనతో, “బోధకుడా, వారసునిగా నేను పొందాల్సిన ఆస్తి భాగాన్ని పంచమని నా సహోదరునితో చెప్పండి” అన్నాడు. 14 అందుకు యేసు, “అయ్యా, నన్ను మీకు న్యాయాధిపతిగా గానీ మధ్యవర్తిగా గానీ నన్నెవరు నియమించారు?” అని జవాబిచ్చారు. 15 ఆ తర్వాత ఆయన వారితో, “మెలకువగా ఉండండి! మీరు అన్ని రకాల అత్యాశలకు విరుద్ధంగా ఉండేలా జాగ్రత్తపడండి; జీవితం అంటే సమృద్ధిగా ఆస్తులు కలిగి ఉండడం కాదు” అని చెప్పారు. 16 ఇంకా ఆయన వారికి ఈ ఉపమానం చెప్పారు: “ఒక ధనవంతుని పొలం సమృద్ధిగా పంట పండింది. 17 అప్పుడు అతడు తనలో తాను అనుకున్నాడు, ‘నేను ఏమి చేయాలి? ఈ పంటంతటిని నిల్వ చేసుకోవడానికి నాకు స్ధలం చాలదు.’ 18 “అప్పుడతడు, ‘నేను ఇలా చేస్తాను. ఇప్పుడున్న కొట్లను పడగొట్టి, పెద్ద కొట్లను కట్టించి వాటిలో నా ధాన్యాన్ని నిల్వచేసుకొంటాను. 19 నాతో నేను ఇలా అనుకుంటాను, “అనేక సంవత్సరాలకు సరిపడినంత విస్తారమైన ధాన్యం నీ కొరకు సమకూర్చి ఉంచాను. జీవితాన్ని తేలికగా తీసుకో; తిను, త్రాగు, సంతోషంగా ఉండు” ’ అని అనుకున్నాడు. 20 “కాని దేవుడు అతనితో, ‘ఓయీ బుద్ధిహీనుడా! ఈ రాత్రే నీ ప్రాణం తీయబడుతుంది. అప్పుడు నీ కొరకు నీవు సిద్ధపరచుకొన్నది ఎవరిదవుతుంది?’ 21 “దేవునిలో ధనవంతుడు కాకుండా తమ కొరకు సమకూర్చుకొనేవారి స్థితి ఇలా ఉంటుంది” అని చెప్పారు. చింతించవద్దు 22 తర్వాత యేసు తన శిష్యులతో, “కాబట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే, మీరు ఏమి తినాలి ఏమి త్రాగాలి అని, మీ ప్రాణం గురించి గాని, లేక ఏమి ధరించాలి అని మీ దేహాన్ని గురించి గాని చింతించకండి. 23 ఎందుకంటే ఆహారం కంటే ప్రాణం, బట్టల కంటే దేహం గొప్పవి. 24 కాకులను చూడండి: అవి విత్తవు కోయవు, వాటికి నిల్వచేసుకోడానికి గది కాని కొట్లు కాని లేవు; అయినా దేవుడు వాటిని పోషిస్తున్నారు. పక్షుల కన్నా మీరు ఇంకా ఎంతో విలువైన వారు. 25 మీలో ఎవరైనా చింతిస్తూ మీ ఆయుష్షును ఒక గంట పొడిగించుకోగలరా? 26 మీరు ఇంత చిన్నదాన్ని చేయలేనప్పుడు, మిగతా వాటిని గురించి ఎందుకు చింతిస్తారు? 27 “అడవి పువ్వులు ఎలా ఎదుగుతున్నాయో చూడండి. అవి కష్టపడవు నేయవు. అయినను గొప్ప వైభవం కలిగివున్న సొలొమోను కూడా ఈ పూలలో ఒక దానిలా అలంకరించబడలేదని నేను మీతో చెప్తున్నాను. 28 అల్పవిశ్వాసులారా, ఈ రోజు ఉండి, రేపు అగ్నిలో పడవేయబడే, పొలంలోని గడ్డినే దేవుడు అంతగా అలంకరించినప్పుడు, ఆయన మిమ్మల్ని ఇంకెంత ఎక్కువగా అలంకరిస్తారు! 29 ఏమి తింటారో ఏమి త్రాగుతారో అనేవాటిపై మీ హృదయాన్ని నిలపకండి; దాని గురించి చింతించకండి. 30 ఎందుకంటే దేవుని ఎరుగని లోకం అలాంటి వాటి వెంటపడుతుంది కాని, అవన్నీ మీకు అవసరమని మీ తండ్రికి తెలుసు. 31 కనుక ఆయన రాజ్యాన్ని వెదకండి, అప్పుడు ఇవి కూడా మీకు ఇవ్వబడతాయి. 32 “చిన్న మందా, భయపడవద్దు, ఎందుకంటే మీ పరలోకపు తండ్రి తన రాజ్యాన్ని మీకు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. 33 మీ ఆస్తులను అమ్మి బీదలకు ఇవ్వండి. మీ కొరకు పాతగిల్లని డబ్బు సంచులను ఏర్పరచుకోండి, పరలోకంలో ధనం ఎప్పటికీ తరిగిపోదు, అక్కడ ఏ దొంగ సమీపించలేడు, ఏ చిమ్మెట కొట్టివేయలేదు. 34 ఎందుకంటే ఎక్కడ మీ ధనం ఉంటుందో, అక్కడే మీ హృదయం ఉంటుంది. మెలకువ 35 “సేవ కొరకు మీ నడుము కట్టుకోండి, మీ దీపాలను వెలుగుతూ ఉండనివ్వండి, 36 తమ యజమాని పెండ్లి విందునుండి ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఎదురుచూస్తూ, అతడు వచ్చి తలుపు తట్టినప్పుడు వెంటనే తలుపు తీయడానికి మెలకువతో సిద్ధంగా ఉన్న సేవకుల్లా ఉండండి. 37 యజమాని వచ్చినప్పుడు ఏ సేవకులు మెలకువగా ఉండడం చూస్తాడో ఆ సేవకులకు మేలు. నేను చెప్పేది నిజం, సేవ చేయడానికి అతడు తన నడుము కట్టుకొని, ఆ సేవకులను భోజనానికి కూర్చోబెట్టి, అతడు అక్కడే వేచి ఉంటాడు. 38 తమ యజమాని మధ్యరాత్రి వచ్చినా లేక తెల్లవారుజామున వచ్చినా, సిద్ధపడి కనిపించడం ఆ సేవకులకు మేలు. 39 అయితే ఈ విషయం అర్థం చేసుకోండి: దొంగ ఏ సమయంలో వస్తాడో ఒకవేళ ఇంటి యజమానికి తెలిస్తే, అతడు తన ఇంటికి కన్నం వేయకుండా జాగ్రత్తపడతాడు. 40 అలాగే మనుష్యకుమారుడు మీరు ఎదురు చూడని సమయంలో వస్తారు కనుక మీరు సిద్ధపడి ఉండండి” అని చెప్పారు. 41 అప్పుడు పేతురు, “ప్రభువా, ఈ ఉపమానం మాకేనా లేక అందరికి చెప్తున్నావా?” అని అడిగాడు. 42 అందుకు ప్రభువు, “యజమాని తన ఇంటి సేవకులకు సమయానికి వారి భోజన వేతనం ఇచ్చే బాధ్యతను అప్పగించడానికి, నమ్మకమైన, జ్ఞానం కలిగిన నిర్వాహకుడు ఎవడు? 43 యజమాని తిరిగి వచ్చినప్పుడు అలా చేస్తూ కనిపించడం ఆ సేవకునికి మేలు. 44 ఆ యజమాని తన యావదాస్తి మీద అతన్ని అధికారిగా ఉంచుతాడని నేను మీతో నిశ్చయంగా చెప్తున్నాను. 45 కాని ఒకవేళ ఆ సేవకుడు, ‘నా యజమాని తిరిగి రావడం ఆలస్యం చేస్తున్నాడని’ తన మనస్సులో అనుకుని, తన తోటి సేవకులను, పురుషులు స్త్రీలను కూడా కొట్టడం మొదలుపెట్టి, తింటూ త్రాగుతూ మత్తులో ఉండి! 46 అతడు ఊహించని రోజున అనుకొనని సమయంలో యజమాని వస్తాడు, అతడు వాన్ని ముక్కలుగా నరికి అవిశ్వాసులతో అతనికి చోటు ఇస్తాడు. 47 “ఏ సేవకుడైతే తన యజమానుని చిత్తాన్ని ఎరిగి కూడా దాని ప్రకారం సిద్ధపడి తన యజమాని కోరుకున్నట్లుగా చేయడో వాడు అనేక దెబ్బలు తింటాడు. 48 అయితే తెలియక శిక్షకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే పడతాయి. ఎవనికి ఎక్కువగా ఇవ్వబడిందో వాని నుండి ఎక్కువ తీసుకోబడుతుంది; ఎవనికి ఎక్కువ అప్పగించబడిందో, వాని నుండి ఎక్కువ అడుగబడుతుంది.” సమాధానం కాదు విభజన 49 నేను భూమి మీద అగ్ని వేయడానికే వచ్చాను, ఇప్పటికే అది రగులుకొని మండుతూ ఉండాలని ఎంతో కోరుతున్నాను. 50 అయితే నేను ఒక బాప్తిస్మం పొందాల్సి ఉంది, అది నెరవేరే వరకు ఎంత నిర్బంధంలో ఉన్నానో! 51 నేను భూమి మీదికి సమాధానం తేవడానికి వచ్చానని మీరు అనుకుంటున్నారా? కాదు, కాని విడగొట్టడానికి తేవడానికి. 52 ఇప్పటి నుండి ఐదుగురు ఉన్న ఒక కుటుంబంలో ఒకరికి ఒకరు వ్యతిరేకంగా విభజింపబడతారు, ఇద్దరికి వ్యతిరేకంగా ముగ్గురు, ముగ్గురికి వ్యతిరేకంగా ఇద్దరు. 53 ఎలాగంటే, కుమారునికి వ్యతిరేకంగా తండ్రి తండ్రికి వ్యతిరేకంగా కుమారుడు, కుమార్తెకు వ్యతిరేకంగా తల్లి తల్లికి వ్యతిరేకంగా కుమార్తె, కోడలికి వ్యతిరేకంగా అత్త అత్తకు వ్యతిరేకంగా కోడలు విడిపోతారు. కాలాలను అనువదించడం 54 ఆయన జనసమూహంతో ఇలా అన్నారు: “పడమర వైపు నుండి మబ్బులు రావడం చూసినప్పుడు మీరు వెంటనే, ‘వాన కురవబోతుంది’ అని అంటారు, అలాగే వాన కురుస్తుంది. 55 అలాగే దక్షిణపు గాలి వీచినప్పుడు, ‘వేడిగా ఉండబోతుంది’ అని అంటారు, అది అలాగే ఉంటుంది. 56 వేషధారులారా! భూమి, ఆకాశం యొక్క వాతావరణ సంకేతాలను ఎలా అర్థం చేసుకోవాలో మీకు తెలుసు. అలాంటప్పుడు ప్రస్తుత కాలాలను ఎలా అర్థం చేసుకోవాలో మీకు తెలియకపోవడమేంటి? 57 “ఏది సరియైనదో మీ అంతట మీరే ఎందుకు నిర్ణయించుకోలేరు? 58 నీవు నీ విరోధితో న్యాయాధిపతి దగ్గరకు వెళ్తున్నప్పుడు, దారిలో ఉన్నప్పుడే వానితో సమాధానపడే ప్రయత్నం చెయ్యి, లేకపోతే నీ విరోధి నిన్ను న్యాయాధిపతి దగ్గరకు ఈడ్చుకెళ్లవచ్చు, న్యాయాధిపతి నిన్ను అధికారికి అప్పగించవచ్చు, అధికారి నిన్ను చెరసాలలో వేయవచ్చు. 59 నేను చెప్తున్నా, నీవు చివరి పైసా చెల్లించే వరకు బయట పడలేవు.” |
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.