యాకోబు 2 - తెలుగు సమకాలీన అనువాదముపక్షపాతానికి వ్యతిరేకంగా హెచ్చరిక 1 నా సహోదరీ సహోదరులారా, పక్షపాతం కలిగిన మీ పనులతో మహిమ గల మన ప్రభువైన యేసుక్రీస్తులో మీరు నిజంగా విశ్వాసం కలిగివున్నారా? 2 బంగారు ఉంగరాలు, విలువైన బట్టలు వేసుకొన్న ధనవంతుడు, అలాగే మురికిబట్టలు వేసుకున్న పేదవాడు మీ సంఘానికి వచ్చారు. 3 విలువైన బట్టలు వేసుకొన్న ధనవంతుడిని ప్రత్యేకంగా గమనించి “దయచేసి ఇక్కడ కూర్చోండి” అని చెప్పి, పేదవానితో “అక్కడ నిలబడు” లేదా “నా కాళ్ల దగ్గర కూర్చో” అని చెబితే, 4 మీరు మీ మధ్యలోనే భేదం చూపిస్తూ దుర్మార్గపు ఆలోచనలతో విమర్శించినవారు అవుతారు కదా? 5 నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వినండి. దేవుడు తనను ప్రేమించినవారికి వాగ్దానం చేసిన ప్రకారం విశ్వాసంలో ధనవంతులుగా ఉండడానికి, తన రాజ్యానికి వారసులుగా ఉండడానికి ఈ లోకంలో పేదవారిని దేవుడు ఎంచుకోలేదా? 6 అయితే మీరు పేదవారిని అవమానించారు. మీకు అన్యాయం చేసింది ధనవంతులు కారా? మిమ్మల్ని న్యాయస్థానానికి లాగింది వాళ్లు కాదా? 7 మిమ్మల్ని పిలిచిన దేవుని ఘనమైన నామాన్ని దూషించింది వాళ్ళు కాదా? 8 “నిన్ను ప్రేమించుకున్నట్టే, నీ పొరుగువాని కూడా ప్రేమించు” అని లేఖనాల్లో వ్రాసి ఉన్న దైవ రాజాజ్ఞ పాటిస్తే, మీ ప్రవర్తన సరిగా ఉన్నట్టే. 9 అయితే మీరు పక్షపాతం చూపిస్తే, మీరు పాపం చేసి, ఆజ్ఞాతిక్రమం వల్ల ధర్మశాస్త్రం బట్టి అపరాధులు అవుతారు. 10 ఎవరైనా ధర్మశాస్త్రంలోని అన్ని ఆజ్ఞలను పాటించి ఒకే ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినప్పటికి అన్ని ఆజ్ఞలకు వారు బాధ్యతవహించాల్సి ఉంటుంది. 11 “వ్యభిచారం చేయకూడదు,” అని చెప్పిన దేవుడు, “మీరు నరహత్య చేయకూడదు” అని కూడా చెప్పాడు. నీవు వ్యభిచారం చేయకపోయినా హత్య చేస్తే, దేవుని ధర్మశాస్త్రాన్ని మీరినట్టే. 12 కాబట్టి మీరు స్వాతంత్ర్యాన్ని ఇచ్చే ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు పొందబోయే వానిలా మాట్లాడాలి ప్రవర్తించాలి. 13 ఎందుకంటే దయచూపించనివారి పట్ల దయచూపించకుండా తీర్పు తీర్చబడుతుంది; దయ తీర్పుపై జయం పొందుతుంది. విశ్వాసము, క్రియలు 14 నా సహోదరీ సహోదరులారా, క్రియలు లేకుండా మాకు విశ్వాసం ఉంది అని మీరు చెప్పడం వలన మేలు ఏమిటి? ఆ విశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుందా? 15-16 ఎవరైనా ఒక సహోదరుడు గాని సహోదరి గాని బట్టలు లేకుండా నగ్నంగా వుండి, తినడానికి తిండిలేకుండా వున్నప్పుడు మీలో ఒకరు వారితో “సమాధానంతో వెళ్లి వెచ్చదనం పొంది, తృప్తిగా తిను” అని చెప్పి వారి శరీర అవసరాలను వారికి అందించకపోతే దానిలో మేలు ఏమిటి? 17 కాబట్టి క్రియలు లేకపోతే ఆ విశ్వాసం దానికదే మరణిస్తుంది. 18 అయితే ఎవరైనా “నీకు విశ్వాసం వుంది, నాకు క్రియలు వున్నాయి.” క్రియలు లేకుండా మీ విశ్వాసాన్ని నాకు చూపించు, నా క్రియల ద్వారా నా విశ్వాసాన్ని నీకు చూపిస్తా అని చెప్పవచ్చును. 19 దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్నావు అది మంచిదే. దయ్యాలు కూడా నమ్మి వణుకుతాయి. 20 వివేకంలేనివాడా, క్రియలు లేని విశ్వాసం ఫలించదని నీకు రుజువులు కావాలా? 21 మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠంపై అర్పించినప్పుడు తాను చేసిన దాన్ని బట్టి నీతిమంతుడని చెప్పబడలేదా? 22 అతని క్రియలు అతని విశ్వాసం కలిసి పని చేస్తున్నాయి అతడు చేసిన దానిని బట్టి అతని విశ్వాసం సంపూర్ణం అయ్యింది. 23 నెరవేరబడిన లేఖనాలు ఏమి చెప్తున్నాయంటే, “అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడింది.” మరియు అబ్రాహాము దేవుని స్నేహితుడు అని పిలువబడ్డాడు. 24 ఒక వ్యక్తి కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే కాకుండా అతని క్రియలు బట్టి నీతిమంతునిగా చెప్పబడును. 25 అలాగే వేశ్య అయిన రాహాబు దూతలను ఆదరించి, వేరొక మార్గం గుండా వారిని పంపించివేసినప్పుడు తాను చేసిన క్రియల బట్టి ఆమె నీతిమంతురాలిగా చెప్పబడలేదా? 26 ప్రాణం లేనప్పుడు శరీరం మరణించినట్లు క్రియలు లేనప్పుడు విశ్వాసం కూడా మరణిస్తుంది. |
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.