Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యాకోబు 1 - తెలుగు సమకాలీన అనువాదము

1 దేవునికి ప్రభువైన యేసుక్రీస్తుకు సేవకుడనైన, యాకోబు, వివిధ దేశాలకు చెదిరిపోయిన పన్నెండు గోత్రాల వారికి వ్రాయునది: మీకు శుభాలు.


శ్రమలు, శోధనలు

2 నా సహోదరీ సహోదరులారా, మీ విశ్వాసానికి ఎదురయ్యే పరీక్షలవల్ల ఓర్పు వస్తుందని మీకు తెలుసు కనుక,

3 మీకు ఎప్పుడైనా ఎలాంటి శోధనలు ఎదురైనా వాటిని బట్టి సంతోషించండి.

4 మీరు పరిపక్వం చెంది సంపూర్ణులుగా అవడానికి, ఏ విషయంలో కూడా మీకు కొరత లేకుండా ఉండడానికి పట్టుదలను తన పనిని పూర్తి చేయనివ్వండి.

5 మీలో ఎవరికైనా జ్ఞానం కొరతగా ఉంటే దేవుణ్ణి అడగండి అప్పుడు అది మీకు ఇవ్వబడుతుంది. ఆయన తప్పులను ఎంచకుండా అందరికీ ఉదారంగా ఇస్తారు.

6 మీరు అడిగినప్పుడు సందేహించకుండా విశ్వాసంతో అడగండి ఎందుకంటే, సందేహించేవారు గాలిచేత విసరబడి కొట్టివేయబడే సముద్రపు అలల్లాంటివారు;

7 కనుక వారు ప్రభువు నుండి తమకు ఏమైనా దొరుకుతుందని ఆశించకూడదు.

8 అలాంటివారు రెండు రకాల మనస్సులను కలిగివుంటారు, తాము చేసే వాటన్నిటిలో అస్థిరంగా ఉంటారు.

9 దీనులైన విశ్వాసులు తాము పైకెత్తబడుతున్న విధానాన్ని బట్టి అతిశయించాలి,

10 అయితే ధనవంతులైనవారు తమ దీనస్థితిని బట్టి అతిశయించాలి, ఎందుకంటే గడ్డిలోని ఒక పువ్వులా ధనవంతులు కనుమరుగవుతారు.

11 కాల్చివేసే వేడిమితో సూర్యుడు ఉదయించినప్పుడు గడ్డి వాడిపోతుంది; దాని పువ్వు రాలిపోతుంది, దాని అందం నశించిపోతుంది; ధనవంతుల పట్ల కూడా అలాగే జరుగుతుంది; తమ తీరికలేని జీవితం మధ్యలో వారు వాడిపోతారు.

12 శోధన సహించినవారు ధన్యులు. పరీక్షలో నిలబడినవారు ప్రభువు తాను ప్రేమించినవారికి ఇస్తానని వాగ్దానం చేసిన జీవకిరీటాన్ని పొందుతారు.

13 దేవుడు కీడు చేత శోధించబడడు; ఆయన ఎవరిని శోధించడు కాబట్టి ఎవరికైనా శోధన ఎదురైతే “నేను దేవుని చేత శోధించబడుతున్నాను” అని అనకూడదు.

14 ఒకరు తమ సొంత కోరికతోనే ఆకర్షించబడి వాటి ద్వారా ప్రలోభాలకు గురికావడం వల్ల శోధించబడతారు;

15 కోరిక గర్భాన్ని ధరించి పాపానికి జన్మనిస్తుంది, ఆ పాపం పూర్తిగా పెరిగినప్పుడు అది మరణానికి జన్మనిస్తుంది.

16 నా ప్రియ సహోదరీ సహోదరులారా, మోసపోకండి.

17 పరలోకం నుండి ఇవ్వబడిన ప్రతీ మంచిదైన సంపూర్ణమైన బహుమానం వెలుగుకు తండ్రియైనవాని దగ్గర నుండి క్రిందకు వస్తున్నాయి, ఒకచోట నిలబడని నీడల్లా ఆయన ఎన్నడు మారడు.

18 ఆయన సృష్టంతటిలో మనం మొదటి ఫలాలుగా ఉండాలని, సత్యవాక్యం చేత మనకు జన్మనివ్వడానికి ఎంచుకున్నారు.


వినుట మరియు ఆచరించుట

19 నా ప్రియ సహోదరీ సహోదరులారా, మీరు దీనిని గ్రహించాలి: ప్రతి ఒక్కరు వినడానికి చురుకుగా ఉండాలి, మాట్లాడడానికి నిదానంగా ఉండాలి, కోపగించుకోవడానికి నిదానంగా ఉండాలి;

20 ఎందుకంటే మీ కోపం దేవుని నీతిని జరిగించదు.

21 కనుక మీలో వున్న సమస్త నీచత్వాన్ని, అధికంగా పెరుగుతున్న దుష్టత్వాన్ని విడిచి మిమ్మల్ని రక్షించగల, శక్తి కలిగిన మీలో నాటబడిన వాక్యాన్ని దీనత్వంతో అంగీకరించండి.

22 మీరు వాక్యాన్ని వినేవారిగా మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. వాక్యం చెప్పేది చేయండి.

23 ఎవరైతే వాక్యాన్ని విని అది చెప్పిన ప్రకారం చేయరో, వారు తమ ముఖాన్ని అద్దంలో చూసుకొనే వారిలా ఉంటారు;

24 వారు తమను చూసుకొని ప్రక్కకు వెళ్లిన వెంటనే తాము ఎలా ఉన్నారో మరిచిపోతారు.

25 అయితే స్వాతంత్ర్యాన్ని ఇచ్చే సంపూర్ణమైన ధర్మశాస్త్రంలోనికి ఏకాగ్రతతో చూసి దానిలో కొనసాగేవారు, విని మర్చిపోయేవారిగా ఉండకుండా అది చెప్పిన ప్రకారం చేస్తారు; వారు తాము చేసిన దానిలో దీవించబడతారు.

26 తమ నాలుకను అదుపుచేసుకోకుండా తమ హృదయాలను మోసం చేసుకుంటూ ఎవరైనా తాము భక్తిపరులమని భావిస్తే వారి భక్తి విలువలేనిది అవుతుంది.

27 దేవుడైన తండ్రి యెదుట స్వచ్ఛంగా నిష్కళంకంగా ఉండే ధర్మం ఏంటంటే: అనాధలను, ఇబ్బందులలో ఉన్న విధవరాళ్ళను సంరక్షించడం, లోకంచేత మలినం కాకుండా తనను కాపాడుకోవడం.

తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version™, New Testament

Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan