Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

హెబ్రీయులకు 9 - తెలుగు సమకాలీన అనువాదము


భూసంబంధమైన ప్రత్యక్షగుడారంలో ఆరాధన

1 మొదటి నిబంధనలో దేవుని ఆరాధించడానికి కొన్ని నియమాలు, భూసంబంధమైన ప్రత్యక్ష గుడారం ఉన్నాయి.

2 ఆ గుడారం ఇలా ఏర్పరచబడింది. దానిలోని మొదటి గదిలో ఒక దీప దీపస్తంభం, ఒక బల్ల దానిపై అర్పించబడిన రొట్టెలు ఉన్నాయి, ఆ గదికి పరిశుద్ధ స్థలమని పేరు.

3 రెండవ తెర వెనుక అతి పరిశుద్ధ స్థలం అని పిలువబడే గది ఉంది,

4 దానిలో ధూపం వేయడానికి బంగారు బలిపీఠం, బంగారంతో కప్పబడిన నిబంధన పెట్టె ఉన్నాయి. ఆ పెట్టెలో మన్నా ఉంచబడిన బంగారు పాత్ర, చిగురించిన అహరోను కర్ర, వ్రాయబడిన నిబంధన రాతి పలకలు ఉన్నాయి.

5 ఈ పెట్టె పైన మహిమ గల కెరూబులు తమ రెక్కలతో ప్రాయశ్చిత్త పీఠంను కాపాడుతూ ఉన్నాయి. అయితే ఈ సంగతుల గురించి వివరంగా ఇప్పుడు మనం చర్చించలేము.

6 ఇలా అన్ని ఏర్పాటు చేయబడిన తరువాత, ప్రతి రోజు యాజకులు తమ పరిచర్యను చేయడానికి మొదటి గదిలోకి వెళ్తారు.

7 అయితే కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే లోపలి గదిలోకి ప్రవేశించాడు, అది కూడా సంవత్సరానికి ఒక్కసారే. తెలియక చేసిన పాపాల కొరకు తన కొరకు, ప్రజల కొరకు అతడు అర్పించి ఆ రక్తాన్ని తీసుకొనివెళ్ళాలి, రక్తం లేకుండా వెళ్ళడానికి లేదు.

8 అంటే మొదటి గుడారం నిలిచి ఉన్నంత కాలం అతి పరిశుద్ధ స్థలం లోనికి వెళ్ళే మార్గం ఇంకా తెరవబడలేదని పరిశుద్ధాత్మ దీని ద్వారా చూపిస్తున్నాడు.

9 ఇది ప్రస్తుత కాలాన్ని సూచించే ఒక ఉపమానం, దేవునికి అర్పించబడే కానుకలు, బలులు ఆరాధించేవారి మనస్సాక్షిని శుధ్ధిచేయలేవని తెలియజేస్తుంది.

10 అవి కేవలం తినడం త్రాగడం, వివిధ శుద్ధీకరణ ఆచారాలకు సంబంధించిన బాహ్య నియమాలు క్రొత్త క్రమం వచ్చేవరకు వర్తిస్తాయి.


క్రీస్తు రక్తం

11 అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న మంచి విషయాల యొక్క ప్రధాన యాజకునిగా క్రీస్తు వచ్చినప్పుడు, మానవుల చేతితో చేయబడని గొప్పదైన పరిపూర్ణమైన గుడారం గుండా ఆయన వెళ్ళాడు, అంటే అది ఈ సృష్టిలో ఒక భాగం కాదు.

12 ఆయన మేకల దూడల రక్తాన్ని తీసుకుని ప్రవేశించలేదు; కాని శాశ్వత విమోచన సంపాదించడానికి స్వరక్తంతో అతి పరిశుద్ధ స్థలంలోకి ఆయన ఒక్కసారే ప్రవేశించాడు.

13 ఆచారపరంగా అపవిత్రులైనవారు బాహ్యంగా పవిత్రులయ్యేలా మేకల ఎద్దుల రక్తంను దహించబడిన దూడ బూడిదను వారిపై చల్లి వారిని పవిత్రులుగా చేస్తాడు.

14 నిత్యమైన ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొన్న క్రీస్తు రక్తం, మనం జీవంగల దేవుని సేవించేలా, మరణానికి నడిపించే వ్యర్థమైన క్రియల నుండి మన మనస్సాక్షిని ఇంకెంత ఎక్కువగా పవిత్రపరుస్తుంది!

15 ఈ కారణంవల్లనే, పిలువబడిన వారు వాగ్దానం చేయబడిన శాశ్వత వారసత్వాన్ని పొందడానికి క్రొత్త నిబంధనకు క్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. మొదటి నిబంధన ప్రకారం చేసిన పాపాల నుండి వారిని విడిపించడానికి ఆయన మరణించి క్రయధనం చెల్లించాడు.

16 వీలునామా విషయంలో, దాన్ని తయారు చేసిన వాడు చనిపోయాడని నిరూపించడం అవసరం,

17 ఎందుకంటే, వీలునామా వ్రాసినవారు బ్రతికి ఉన్నంత వరకు ఆ వీలునామాకు బలం ఉండదు; వారు మరణించిన తరువాత మాత్రమే అది అమల్లోకి వస్తుంది.

18 అందుకే, మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా అమలు పరచబడలేదు.

19 ధర్మశాస్త్రంలోని ప్రతి ఆజ్ఞను మోషే ప్రజలందరికి వినిపించాక, అతడు నీరు, ఎర్రని ఉన్ని, హిస్సోపు కొమ్మలతో దూడల మేకల రక్తాన్ని తీసుకొని, గ్రంథంపైన ప్రజలందరిపైన చల్లాడు.

20 అతడు, “పాటించుమని మీకు దేవుడు ఆజ్ఞాపించిన, నిబంధన రక్తం ఇదే” అన్నాడు.

21 అదే విధంగా, అతడు గుడారంపై దాని ఆచారాల్లో ఉపయోగించే అన్ని వస్తువుల పైన రక్తాన్ని చల్లాడు.

22 నిజానికి, ధర్మశాస్త్రాన్ని అనుసరించి దాదాపు అన్ని వస్తువులును రక్తంతో శుద్ధి చేయాలి, రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలుగదు.

23 కాబట్టి, ఈ బలులతో పరలోకపు వాటిని పోలివున్న ఈ వస్తువులు శుద్ధి చేయబడటం అవసరం, కానీ పరలోకానికి సంబంధించినవి వీటికన్నా మెరుగైన బలులతో చేయబడాలి.

24 ఎందుకంటే నిజమైన దాని పోలికలో మానవ హస్తాలతో చేయబడిన పరిశుద్ధ స్థలంలోకి క్రీస్తు ప్రవేశించలేదు; కాని ఇప్పుడు మనకొరకు దేవుని సన్నిధిలో కనబడటానికి ఆయన పరలోకంలోనికే ప్రవేశించాడు.

25 యూదుల ప్రధాన యాజకుడు, ప్రతి సంవత్సరం అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించినట్టుగా క్రీస్తు మళ్ళీ మళ్ళీ తనది కాని రక్తాన్ని అర్పించడానికి పరలోకంలోకి ప్రవేశించలేదు.

26 లేకపోతే ప్రపంచం సృష్టింపబడినప్పటి నుండి అనేకసార్లు క్రీస్తు శ్రమపడాల్సి ఉండేది. అయితే తనను తాను బలిగా అర్పించుకోవడం ద్వారా ప్రజల అపరాధాలను పూర్తిగా కొట్టివేయాలని అన్ని యుగాల కొరకు ఒక్కసారే ఆయన ప్రత్యక్షమయ్యాడు.

27 మనుష్యులు ఒక్కసారే చనిపోవాలని, ఆ తరువాత తీర్పును పొందాలని నియమించబడిన ప్రకారం,

28 అనేకుల పాపాలను తొలగించడానికి క్రీస్తు కూడా ఒక్కసారే బలిగా అర్పించబడ్డాడు; పాపాన్ని భరించడానికి కాకుండా, తన కొరకై వేచివున్న వారిని రక్షించడానికి ఆయన రెండవ సారి వస్తారు.

తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version™, New Testament

Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan