Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

హెబ్రీయులకు 8 - తెలుగు సమకాలీన అనువాదము


యేసు మన ప్రధాన యాజకుడు

1 మనం చెప్తున్న దానిలోని ముఖ్య సారాంశమిది: పరలోకంలో సర్వోన్నతుని సింహాసనం యొక్క కుడి వైపున కూర్చుని ఉన్న వానిని మనం ప్రధాన యాజకునిగా కలిగియున్నాం,

2 ఆయన మానవుని చేత కాక దేవుని చేత తయారుచేయబడిన నిజమైన ప్రత్యక్షగుడారంలో అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రధాన యాజకునిగా పరిచర్య చేస్తున్నాడు.

3 ప్రతి ప్రధాన యాజకుడు దేవునికి కానుకలను బలులను అర్పించడానికి నియమించబడి ఉన్నాడు కనుక ఈయన కూడ దేవునికి ఏదైనా సమర్పించాల్సిన అవసరం ఉండింది.

4 ఆయన భూమి మీద ఉండివుంటే, ఒక యాజకుడై ఉండేవాడు కాడు, ధర్మశాస్త్రంలో వ్రాసివున్న ప్రకారం అర్పణలు అర్పించే యాజకులు ఇప్పటికే ఉన్నారు.

5 పరలోకంలో ఉన్న దానికి కేవలం నమూనాగా ఛాయాచిత్రంగా ఉన్న పరిశుద్ధ స్థలంలో యాజకులుగా వారు పరిచారం చేస్తారు. ఇందుకే మోషే గుడారాన్ని నిర్మిస్తున్నప్పుడు దాన్ని గురించి ఇలా హెచ్చరించబడ్డాడు: “పర్వతం మీద నేను నీకు చూపించిన నమూనా ప్రకారమే ప్రతిదీ చేసేలా చూడాలి.”

6 అయితే నిజానికి నూతన నిబంధన మరింత గొప్ప వాగ్దానాలపై స్థాపించబడింది కనుక, యేసు మధ్యవర్తిగా ఉన్న ఈ నిబంధన గత నిబంధన కన్న శ్రేష్ఠమైనదైనట్లే ఆయనకు అప్పగించబడిన పరిచర్య కూడా శ్రేష్ఠమైనదే.

7 అయితే మొదటి నిబంధన లోపం లేనిదైతే, రెండవ దాని కొరకు వెదకాల్సిన అవసరమే లేదు.

8 అయితే దేవుడు ప్రజల్లో దోషాన్ని కనుగొని ఇలా చెప్పాడు: “ప్రభువు ఇలా ప్రకటిస్తున్నాడు, అప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలతో మరియు యూదా ప్రజలతో ఒక క్రొత్త నిబంధన చేయడానికి రోజులు సమీపించాయి.

9 ఆ నిబంధన, ఐగుప్తు నుండి నేను వారి పితరుల చెయ్యి పట్టుకొని బయటకు నడిపించినపుడు నేను వారితో చేసిన నిబంధన వంటిది కాదు, ఎందుకంటే వారు నా నిబంధనకు నమ్మకంగా నిలబడలేదు, అందుకే నేను వారి నుండి దూరమయ్యాను, అని ప్రభువు చెప్తున్నాడు.

10 ఆ సమయం తరువాత, ఇశ్రాయేలు ప్రజలతో నేను స్థాపించే నిబంధన ఇదే అని ప్రభువు ప్రకటిస్తున్నారు. వారి మనస్సులో నా న్యాయవిధులను ఉంచుతాను వారి హృదయాల మీద వాటిని వ్రాస్తాను. నేను వారి దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు.

11 ఇకపై వారిలో ఎవ్వరూ తమ పొరుగు వారికి బోధించరు, లేదా ‘ప్రభువును తెలుసుకోండి’ అని సహోదరులు ఒకరితో ఒకరు చెప్పరు, ఎందుకంటే వారిలో అల్పులు మొదలుకొని గొప్పవారి వరకు వారందరు నన్ను తెలుసుకొంటారు.

12 నేను వారి దుర్మార్గాలను క్షమిస్తాను వారి పాపాలను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను.”

13 ఆయన ఈ నిబంధనను “క్రొత్త నిబంధన” అని పిలవడం చేత మొదటి దాన్ని వాడుకలో లేకుండ చేశారు; వాడుకలో లేనివి పాతవి త్వరలో అదృశ్యమవుతాయి.

తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version™, New Testament

Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan