హెబ్రీయులకు 5 - తెలుగు సమకాలీన అనువాదము1 ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకోబడి, దేవునికి సంబంధించిన విషయాల్లో ప్రజల ప్రతినిధిగా పాప పరిహార బలులను కానుకలను అర్పించడానికి నియమించబడ్డాడు. 2 తాను కూడా బలహీనతలకు గురైనవానిగా ఉన్నా, అవివేకులైన వారిని దారి తప్పిపోతున్న వారిని దయతో నడిపించగల సమర్ధుడు. 3 ఈ కారణంగా, అతడు తన పాపాల కొరకు అలాగే ప్రజల పాపాల కొరకు బలి అర్పించాల్సివుంది. 4 ఈ గౌరవాన్ని ఎవరు తమంతట తాము పొందలేరు, కాని అహరోను ఎలా పిలువబడ్డాడో అలాగే దేవుని చేత పిలువబడినప్పుడు వారు దానిని పొందుకుంటారు. 5 అదేరీతిగా, క్రీస్తు కూడా ప్రధాన యాజకునిగా అవ్వడానికి తనంతట తానే మహిమను తీసుకోలేదు. అయితే దేవుడే ఆయనతో ఇలా అన్నారు, “నీవు నా కుమారుడవు; ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను.” 6 మరొక చోట ఆయన ఇలా అన్నారు, “మెల్కీసెదెకు క్రమంలో, నీవు నిరంతరం యాజకునిగా ఉన్నావు.” 7 యేసు భూమి మీద జీవించిన రోజులలో, మరణం నుండి తనను రక్షించడానికి శక్తి కలిగిన దేవునికి తీవ్రమైన రోదనతో, కన్నీళ్లతో ప్రార్థనలు విన్నపాలు అర్పించారు, ఆయనకున్న భక్తి విధేయతల కారణంగా దేవుడు ఆయన ప్రార్థనలు ఆలకించారు. 8 ఆయన కుమారుడై ఉండి కూడా, తాను అనుభవించిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకొన్నారు, 9 ఆయన పరిపూర్ణుడవ్వగానే తనకు లోబడే వారందరికి శాశ్వతమైన రక్షణకు మూలాధారం అయ్యారు. 10 మెల్కీసెదెకు క్రమంలో ప్రధాన యాజకునిగా దేవుని చేత నియమింపబడ్డారు. పడిపోకుండా ఉండాలని హెచ్చరిక 11 దీనిని గురించి మేము చెప్పాల్సింది చాలా ఉంది కాని, గ్రహించడానికి మీరు ఏ మాత్రం ప్రయత్నించడం లేదు కనుక మీకు వివరించడం కష్టం. 12 నిజానికి, ఈ సమయానికి మీరు బోధకులై ఉండాల్సింది, కాని ఇప్పటికి మీకు మరొకరు దేవుని వాక్యంలోని ప్రాథమిక సత్యాలను బోధించాల్సిన అవసరం ఉంది. బలమైన ఆహారం కాదు, మీకు పాలు అవసరం. 13 పాలు త్రాగుతూ జీవించేవారు ఇంకా శిశువుగానే ఉన్నారు, కనుక నీతిని గురించిన బోధతో పరిచయం లేదు. 14 అయితే బలమైన ఆహారం పరిణతి చెందినవారికి, అంటే ఎవరైతే నిరంతరం ఉపయోగించడం ద్వారా తమకు తాముగా మంచి చెడులను వేరు చేసే తర్ఫీదు పొందుకున్నవారికి. |
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.