Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

గలతీయులకు 2 - తెలుగు సమకాలీన అనువాదము


అపొస్తలులు పౌలును అంగీకరించారు

1 పధ్నాలుగు సంవత్సరాల తరువాత, ఈ సారి బర్నబాతో కలిసి మళ్ళీ యెరూషలేముకు వెళ్ళాను, తీతును నాతో కూడా తీసుకుని వెళ్ళాను.

2 దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి నేను అక్కడ నాయకులుగా పేరొందిన వారితో ఏకాంతంగా సమావేశమై, నేను యూదేతరుల మధ్య ప్రకటిస్తున్న సువార్త గురించి వారికి తెలియజేసాను. నా పందెంలో నేను వ్యర్థంగా పరుగెత్తలేదని మరియు పరుగెత్తకూడదని ఖచ్చితంగా కోరుతున్నాను.

3 నాతో యెరూషలేముకు వచ్చిన తీతు గ్రీసు దేశస్థుడైనప్పటికి, సున్నతి పొందాలని అతన్ని బలవంత పెట్టలేదు.

4 క్రీస్తుయేసులో మనకున్న స్వేచ్ఛపై నిఘా పెట్టడానికి మరియు మమ్మల్ని బానిసలుగా చేయడానికి కొంతమంది అబద్ధపు విశ్వాసులు మన శ్రేణుల్లోకి చొరబడినందున ఈ విషయం తలెత్తింది.

5 అయితే మీ కొరకు ఈ సువార్త సత్యం భద్రపరచబడాలని, ఒక్క క్షణం కూడా మేము వారికి లోబరచుకోలేదు.

6 కొంతమంది గొప్ప పేరుగాంచిన వారు ఉన్నప్పటికి, వారెవరైనా సరే నేను లెక్క చేయను, ఎందుకంటే దేవుడు పక్షపాతం చూపేవాడు కాదు, అయినా వారు నా సందేశానికి ఏమి చేర్చలేదు.

7 దానికి బదులు, సున్నతి పొందిన వారి కొరకు పేతురు నియమింపబడినట్లే, సున్నతి లేని వారికి సువార్త ప్రకటించే బాధ్యత నాకు అప్పగించబడిందని వారు గుర్తించారు.

8 ఎందుకంటే, సున్నతి పొందే యూదుల కొరకు అపొస్తలునిగా ఉండడానికి పేతురులో పని చేసిన దేవుడే, సున్నతి లేని యూదేతరుల కొరకు అపొస్తలునిగా ఉండడానికి నాలో కూడా పని చేశారు.

9 సంఘానికి మూలస్తంభాలుగా పేరు పొందిన యాకోబు, కేఫా, యోహాను అనేవారు దేవుడు నాకిచ్చిన కృపను గుర్తించినపుడు, మమ్మల్ని స్వీకరించి మాతో సహవాస సూచనగా నాకు బర్నబాకు తమ కుడి చేతిని అందించారు. మేము యూదేతరుల దగ్గరకు, వారు యూదుల దగ్గరకు వెళ్ళాలని అంగీకరించారు.

10 అయితే వారు అడిగింది ఏంటంటే, మేము పేదవారిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, ఎప్పుడు నేను చేయాలని కోరుకునేది కూడా అదే.


కేఫాను వ్యతిరేకించిన పౌలు

11 కేఫా అనే పేతురు అంతియొకయకు వచ్చినపుడు, అతడు తప్పు చేశాడు కనుక నేను అతన్ని ముఖాముఖిగా ఎదిరించాను.

12 ఎలాగంటే, యాకోబు దగ్గరి నుండి కొందరు మనుష్యులు రాకమునుపు, అతడు యూదేతరులతో కలిసి భోజనం చేస్తున్నాడు. కాని వారు వచ్చినప్పుడు, అతడు వెనక్కి తగ్గి యూదేతరుల నుండి ప్రక్కకు వెళ్లాడు ఎందుకంటే అతడు సున్నతి చేయబడిన వారికి భయపడ్డాడు.

13 ఇతర యూదులు కూడా అతని వేషధారణలో జత కలిసారు, దాని ఫలితంగా బర్నబా కూడా వారి వేషధారణను బట్టి దారితప్పాడు.

14 వారు సువార్త యొక్క సత్యం ప్రకారం ప్రవర్తించక పోవడాన్ని నేను చూసినప్పుడు, వారందరి ముందు కేఫా అనే పేతురుతో, “నీవు యూదుడవు, అయినా నీవు యూదుల్లా కాక యూదేతరుల్లా జీవిస్తున్నావు. అలాంటప్పుడు యూదుల ఆచారాలను అనుసరించమని యూదేతరులను ఎందుకు బలవంతం చేస్తున్నావు?

15 “మనం పుట్టుకతోనే యూదులం, యూదేతరుల్లా పాపులం కాము.

16 ఒక వ్యక్తి ధర్మశాస్త్రాన్ని ఆచరించడం వల్ల నీతిమంతునిగా తీర్చబడడు, కాని యేసుక్రీస్తులో విశ్వాసముంచడం వల్లనే అని మనకు తెలుసు. అందుకే, మేము కూడా ధర్మశాస్త్ర క్రియలను బట్టి కాక, క్రీస్తులో విశ్వాసముంచడం ద్వారా నీతిమంతులంగా తీర్చబడ్డాం, ఎందుకంటే ధర్మశాస్త్ర క్రియలను బట్టి ఎవ్వరూ నీతిమంతులుగా తీర్చబడలేరు.

17 “కాని ఒకవేళ, క్రీస్తులో నీతిమంతులు కావాలని కోరుకుంటూ, యూదులమైన మనం కూడా పాపులమని తీర్చబడితే, క్రీస్తు పాపాన్ని ప్రోత్సహిస్తున్నారని అర్థం కాదా? కానే కాదు!

18 ఒకవేళ నేను కూల్చివేసిన దానిని మరల కడితే, అప్పుడు నేను నిజంగానే అపరాధిని అవుతాను.

19 “నేను దేవుని కొరకు జీవించటానికి ధర్మశాస్త్ర విషయంలో ధర్మశాస్త్రం ద్వారా చనిపోయాను.

20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇప్పుడు జీవిస్తుంది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నారు. ఇప్పుడు నేను శరీరంలో జీవిస్తున్న జీవితం, నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అర్పించుకొన్న దేవుని కుమారుని యందు విశ్వాసముంచడం వల్ల జీవిస్తున్నాను.

21 దేవుని కృపను నేను తిరస్కరించను, ఒకవేళ, ధర్మశాస్త్రం ద్వారా నీతి పొందుకోగలిగితే, క్రీస్తు కారణం లేకుండ చనిపోయారని అర్థం!”

తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version™, New Testament

Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan