Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

అపొస్తలుల 9 - తెలుగు సమకాలీన అనువాదము


సౌలులో మార్పు

1 మరోవైపు, సౌలు, ప్రభువు శిష్యులను చంపుతానని బెదిరిస్తూనే ఉన్నాడు. అతడు ప్రధాన యాజకుని దగ్గరకు వెళ్లి,

2 ఆ మార్గాన్ని అనుసరిస్తూ ఎవరైనా తనకు కనబడితే, పురుషులనైనా స్త్రీలనైనా బంధీలుగా యెరూషలేముకు తీసుకొనిరావడానికి, దమస్కులోని సమాజమందిరాల వారికి ఉత్తరాలు రాసి ఇవ్వుమని అడిగాడు.

3 వాటిని తీసుకొని అతడు ప్రయాణిస్తూ, దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా పరలోకం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది.

4 అతడు నేల మీద పడిపోయి, ఒక స్వరం “సౌలా, సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు?” అని అనడం విన్నాడు.

5 అందుకు సౌలు, “ప్రభువా, నీవు ఎవరు?” అని అడిగాడు. అప్పుడు ఆ స్వరం అతనితో, “నేను, నీవు హింసిస్తున్న యేసును

6 నీవు లేచి పట్టణంలోనికి వెళ్లు, నీవు అక్కడ ఏమి చేయాలో నీకు తెలుస్తుంది” అన్నది.

7 సౌలుతో పాటు ప్రయాణం చేస్తున్నవారు ఆ శబ్దాన్ని విన్నారు కాని మౌనంగా నిలబడిపోయారు, వారికి స్వరం వినబడింది కాని ఎవ్వరూ కనబడలేదు.

8 సౌలు నేల నుండి లేచి, కళ్లు తెరిచినప్పుడు ఏమి చూడలేకపోయాడు. కనుక వారు అతని చేయి పట్టుకొని దమస్కు పట్టణంలోనికి నడిపించారు.

9 మూడు రోజులు చూపులేకుండా ఉన్నాడు, ఏమి తినలేదు త్రాగలేదు.

10 దమస్కు పట్టణంలో అననీయ అనే ఒక శిష్యుడు ఉన్నాడు. దర్శనంలో ప్రభువు అతన్ని “అననీయా!” అని పిలిచారు. అప్పుడు అతడు, “ప్రభువా” నేనే అని సమాధానం చెప్పాడు.

11 ప్రభువు అతనితో, “తిన్నని వీధిలో యూదా అనే వాని ఇంటికి వెళ్లి తార్సు నుండి వచ్చిన సౌలును గురించి అడుగు, ఎందుకంటే అతడు ప్రార్థన చేస్తున్నాడు.

12 అననీయ అనే వ్యక్తి వచ్చి, తాను చూపు పొందుకోవడానికి తనపై చేతులు ఉంచుతాడని ఒక దర్శనంలో అతడు చూసాడు” అన్నారు.

13 అందుకు అననీయ, “ప్రభువా, అతని గురించి, అతడు యెరూషలేములో నిన్ను విశ్వసించిన వారికి చేసిన హానిని గురించి అనేక విషయాలను నేను విన్నాను.

14 ఇంకా ఇక్కడ కూడా నీ పేరట ప్రార్థించే వారందరిని బంధించడానికి ముఖ్యయాజకుల నుండి అధికారాన్ని పొందుకొని ఇక్కడికి వచ్చాడు” అని జవాబిచ్చాడు.

15 అయితే ప్రభువు అననీయతో, “వెళ్లు! ఇతడు ఇశ్రాయేలీయులకు మరియు యూదేతరులకు మరియు వారి రాజులకు నా నామంను ప్రకటించడానికి నేను ఏర్పరచుకున్న నా సాధనం.

16 నా పేరు కొరకు ఇతడు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతనికి చూపిస్తాను” అని చెప్పారు.

17 అప్పుడు అననీయ ఆ ఇంటికి వెళ్లి సౌలు మీద తన చేతులుంచి అతనితో, “సహోదరుడా సౌలు, నీవు ఇక్కడ వస్తున్నప్పుడు మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు, నీవు మరలా చూపు పొందాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని నన్ను నీ దగ్గరకు పంపించారు” అని చెప్పాడు.

18 వెంటనే, సౌలు కళ్ళ నుండి పొరల వంటివి రాలిపడి, అతడు మరలా చూడగలిగాడు. అతడు లేచి బాప్తిస్మం పొందుకొన్నాడు.

19 అతడు కొంత ఆహారం తీసుకున్న తర్వాత శక్తి పొందుకొన్నాడు. సౌలు కొన్ని రోజులు దమస్కులోని శిష్యులతో గడిపాడు.


దమస్కు మరియు యెరూషలేములో సౌలు

20 యేసే దేవుని కుమారుడని సమాజమందిరాలలో ప్రకటించడం మొదలుపెట్టాడు.

21 అతని మాటలు విన్న వారందరు ఆశ్చర్యపడి, “యెరూషలేములో యేసు పేరట ప్రార్థించిన వారిని నాశనం చేసిన వాడు ఇతడే కదా? ముఖ్యయాజకుల దగ్గరకి వారిని బందీలుగా పట్టుకొని వెళ్లడానికే ఇక్కడి వచ్చాడు కదా?” అని చెప్పుకొన్నారు.

22 అయినా సౌలు మరింత ఎక్కువ బలపడి యేసే క్రీస్తు అని రుజువుచేస్తూ దమస్కులో జీవిస్తున్న యూదులను ఆశ్చర్యపరిచాడు.

23 చాలా రోజులు గడిచిన తర్వాత అతన్ని చంపాలని యూదులు కుట్ర చేశారు.

24 కాని వారి కుట్ర గురించి సౌలు తెలుసుకొన్నాడు. అతన్ని చంపడానికి వారు రాత్రింబగళ్ళు పట్టణపు ద్వారాల దగ్గర చాలా జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు.

25 అయితే అతని అనుచరులు రాత్రి వేళలో అతన్ని తీసుకువెళ్లి గంపలో కూర్చోబెట్టి గోడలోని సందు గుండా క్రిందకు దించారు.

26 అతడు యెరూషలేముకు వచ్చినప్పుడు, శిష్యులతో చేరడానికి ప్రయత్నించాడు, కాని అతడు నిజమైన శిష్యుడని నమ్మలేక వారు అతనికి భయపడ్డారు.

27 కానీ బర్నబా అతన్ని దగ్గరకు చేరదీసి అపొస్తలుల దగ్గరకు అతన్ని తీసుకు వచ్చాడు. సౌలు తన ప్రయాణంలో ప్రభువును ఎలా చూసాడు, ప్రభువు అతనితో మాట్లాడిన విషయం, అతడు దమస్కులో యేసు పేరట ధైర్యంగా ఎలా బోధించాడు అనే విషయాలను వారికి చెప్పాడు.

28 కనుక సౌలు వారితో కలిసివుంటూ యెరూషలేములో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రభువు పేరట ధైర్యంగా బోధించసాగాడు.

29 అతడు గ్రీకుభాష మాట్లాడే యూదులతో మాట్లాడుతూ వాదించాడు, అయితే వారు అతన్ని చంపాలని ప్రయత్నించారు.

30 దీనిని గురించి తెలుసుకొన్న విశ్వాసులు, అతన్ని కైసరయకు తీసుకువచ్చి తార్సుకు పంపించారు.

31 ఆ తర్వాత యూదయ, గలిలయ మరియు సమరయ ప్రాంతాలలో ఉన్న సంఘం కొంత సమయం ప్రశాంతాన్ని ఆనందిస్తూ బలపడింది. దేవుని భయాన్ని కలిగి జీవిస్తూ పరిశుద్ధాత్మచేత ప్రోత్సాహింపబడి, సంఘం సంఖ్య మరింత పెరిగింది.


ఐనెయ మరియు దొర్కా

32 పేతురు దేశమంతా ప్రయాణిస్తూ, లుద్ద అనే ఊరిలో నివసిస్తున్న విశ్వాసులను కలవడానికి వచ్చాడు.

33 అక్కడ పక్షవాతంతో ఎనిమిది సంవత్సరాలుగా మంచం మీద ఉన్న ఐనెయ అనే వ్యక్తిని కలిసాడు.

34 పేతురు అతనితో, “ఐనెయా, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరస్తున్నారు. నీవు లేచి నీ పడకను సర్దుకో” అని చెప్పిన వెంటనే ఐనెయ లేచి నిలబడ్డాడు.

35 లుద్ద మరియు షారోనులో నివసించే వారందరు అతన్ని చూసి ప్రభువు వైపుకు తిరిగారు.

36 యొప్పే పట్టణంలో తబితా అనే ఒక శిష్యురాలు ఉంది, గ్రీకు భాషలో ఆమెకు దొర్కా అని పేరు దానికి లేడి అని అర్థం. ఆమె ఎప్పుడూ మంచి పనులు చేస్తూ పేదలకు సహాయం చేసేది.

37 ఆ సమయంలో ఆమె అనారోగ్యంతో చనిపోయింది, కనుక ఆమె శరీరాన్ని కడిగి మేడ గదిలో ఉంచారు.

38 లుద్ద యొప్పేకు దగ్గరగా ఉంటుంది. పేతురు లుద్దలో ఉన్నాడని శిష్యులు విని “వెంటనే రమ్మని బ్రతిమాలడానికి” ఇద్దరిని అతని దగ్గరకు పంపించారు.

39 కనుక పేతురు వారితో వెళ్లాడు, అతడు అక్కడ చేరుకొన్న తర్వాత అతన్ని మేడ గదికి తీసుకువెళ్ళారు. విధవరాండ్రందరు అతని చుట్టూ నిలబడి, ఏడుస్తూ దొర్కా తమతో ఉన్నప్పుడు ఆమె తయారు చేసిన అంగీలను ఇతర వస్త్రాలను అతనికి చూపించారు.

40 పేతురు వారందరిని గది నుండి బయటకు పంపించి, మోకరించి ప్రార్థించాడు. చనిపోయిన ఆ స్త్రీ శవం వైపు తిరిగి, “తబితా లే!” అని చెప్పాడు. ఆమె తన కళ్ళను తెరిచి పేతురును చూసి లేచి కూర్చుంది.

41 అతడు ఆమె చెయ్యి పట్టుకుని పైకి లేపి నిలబెట్టాడు. అప్పుడు అతడు విశ్వాసులను, ముఖ్యంగా విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవంగా వారికి అప్పగించాడు.

42 ఈ సంగతి యొప్పే పట్టణమంతా తెలిసి, చాలామంది ప్రజలు ప్రభువును నమ్ముకున్నారు.

43 పేతురు సీమోను అనే చర్మకారునితో కలిసి కొంత కాలం యొప్పే పట్టణంలో ఉన్నాడు.

తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version™, New Testament

Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan