అపొస్తలుల 23 - తెలుగు సమకాలీన అనువాదము1 పౌలు న్వాయసభ వారిని సూటిగా చూసి, “నా సహోదరులారా, ఈ రోజు వరకు నేను నా మంచి మనస్సాక్షితో దేవుడు నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని పూర్తి చేశాను” అని చెప్పాడు. 2 అందుకు ప్రధాన యాజకుడైన అననీయ, పౌలుకు దగ్గరగా నిలబడివున్న వానితో, అతని నోటి మీద కొట్టమని ఆదేశించాడు. 3 అప్పుడు పౌలు అతనితో, “ఓ సున్నం కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొడతాడు! ధర్మశాస్త్రం ప్రకారం నాకు తీర్పు తీర్చడానికి అక్కడ కూర్చుని, నన్ను కొట్టమని ఆదేశించి నీవు ధర్మశాస్త్ర ఆజ్ఞలను అతిక్రమిస్తున్నావు!” అన్నాడు. 4 పౌలుకు దగ్గరగా నిలబడినవారు, “దేవుని ప్రధాన యాజకుని విమర్శించడానికి నీకెంత ధైర్యం!” అన్నారు. 5 అందుకు పౌలు, “సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు; అయితే ‘మీ ప్రజల అధికారులను నిందించవద్దు అని’ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉంది” అన్నాడు. 6 అక్కడ ఉన్నవారిలో కొందరు సద్దూకయ్యులు మరియు మరికొందరు పరిసయ్యులు ఉన్నారని పౌలు గ్రహించి, ఆ న్యాయసభలోని వారితో, “నా సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతానంగా పుట్టాను. నేను మృతులకు పునరుత్థానం ఉందనే నిరీక్షణ కలిగినందుకు ఈ విచారణ పాలయ్యాను” అని బిగ్గరగా చెప్పాడు. 7 అతడు ఆ విధంగా చెప్పిన వెంటనే, అక్కడ ఉన్న పరిసయ్యులు మరియు సద్దూకయ్యుల మధ్య విభేధం పుట్టి, ఆ సభ రెండుగా చీలిపోయింది. 8 ఎందుకంటే, సద్దూకయ్యులు పునరుత్థానం లేదని, దేవదూతలు లేరని, ఆత్మలు లేవని అంటారు. కానీ పరిసయ్యులు ఇవన్ని ఉన్నాయని నమ్ముతారు. 9 అప్పుడు పరిసయ్యులలోని ధర్మశాస్త్ర ఉపదేశకులు కొందరు లేచి, “ఈ వ్యక్తిలో మాకు ఏ తప్పు కనిపించడం లేదు, అతనితో ఆత్మ కాని దేవదూత కాని మాట్లాడి ఉంటే తప్పు ఏంటి?” అని అడుగుతూ గట్టిగా వాదించారు, కనుక గొప్ప అల్లరి చెలరేగింది. 10 ఈ విభేధం మరింత హింసాత్మకంగా మారినందుకు పౌలును ముక్కలుగా చీల్చివేస్తారేమో అని ఆ అధిపతి భయపడ్డాడు. అతడు సైనికులను వెళ్లి వారి మధ్యలో నుండి పౌలును బలవంతంగా పట్టుకొని, సైనికుల కోటలోకి తీసుకొని రమ్మని ఆదేశించాడు. 11 ఆ రాత్రి ప్రభువు పౌలు దగ్గర నిలబడి, “ధైర్యం తెచ్చుకో! యెరూషలేములో నా గురించి నీవు సాక్ష్యం ఇచ్చినట్టే రోమాలో కూడా నీవు సాక్ష్యం ఇవ్వాలి” అని చెప్పారు. పౌలును చంపడానికి కుట్ర 12 మరుసటిరోజు ఉదయం కొందరు యూదులు ఒక కుట్ర పన్ని, తాము పౌలును చంపే అంతవరకు ఏమి తినకూడదు త్రాగకూడదని ఒట్టు పెట్టుకొన్నారు. 13 ఇలా కలిసి ఒట్టుపెట్టుకొన్న వారు సుమారు నలభై కంటే ఎక్కువ మంది ఉన్నారు. 14 వారు ముఖ్య యాజకులు మరియు యూదా నాయకుల దగ్గరకు వెళ్లి, “మేము పౌలును చంపే వరకు ఏమి తినకూడదని ఒట్టు పెట్టుకొన్నాం. 15 కనుక మీరు న్యాయసభతో కలిసి, పౌలును మరింత వివరంగా విచారణ చేయాలని అతన్ని మీ దగ్గరకు తీసుకురమ్మని అధిపతితో మనవి చేయండి. అతడు ఇక్కడికి రావడానికి ముందే అతన్ని చంపడానికి మేము సిద్ధంగా ఉంటాం” అని చెప్పుకొన్నారు. 16 అయితే పౌలు అక్క కొడుకు ఈ కుట్ర గురించి విన్నప్పుడు, సైనిక కోటలోనికి పోయి ఆ విషయం పౌలుతో చెప్పాడు. 17 అప్పుడు పౌలు ఒక శతాధిపతిని పిలిచి, “ఈ యువకుడిని అధిపతి దగ్గరకు తీసుకొనివెళ్ళండి; ఇతడు అధిపతికి ఒక మాట చెప్పాలి” అని చెప్పాడు. 18 కనుక అతడు ఆ యువకుని అధిపతి దగ్గరకు తీసుకొని వెళ్లాడు. అప్పుడు శతాధిపతి, “ఈ యువకుడు నీకు ఒక మాట చెప్పాలి కనుక ఇతన్ని మీ దగ్గరకు తీసుకువెళ్ళమని ఖైదీగా ఉన్న పౌలు నన్ను విన్నవించుకున్నాడు” అని అధిపతితో చెప్పాడు. 19 అప్పుడు ఆ అధిపతి అతని చేతిని పట్టుకొని ప్రక్కకు తీసుకుపోయి, “నీవు నాకు ఏమి చెప్పాలని అనుకున్నావు?” అని అడిగాడు. 20 అందుకు అతడు, “కొందరు యూదులు పౌలును మరింత వివరంగా విచారణ చేయాలనే వంకతో రేపు న్యాయసభకు అతన్ని పంపించమని మిమ్మల్ని విన్నవించుకొంటారు. 21 అయితే మీరు వారికి అనుమతి ఇవ్వకండి, ఎందుకంటే సుమారు నలభై కన్నా ఎక్కువ మంది అతని కొరకు పొంచి ఉన్నారు. పౌలును చంపే వరకు ఏమి తినకూడదని వారు ఒట్టు పెట్టుకొన్నారు. ఇప్పుడు వారు మీ దగ్గర అనుమతి కొరకు ఎదురుచూస్తూ, సిద్ధంగా ఉన్నారు” అని చెప్పాడు. 22 ఆ అధిపతి, “ఈ సంగతిని నాకు చెప్పావని ఎవరికి చెప్పవద్దు” అని హెచ్చరించి ఆ యువకుడిని పంపించాడు. పౌలు కైసరయకు పంపబడుట 23 తర్వాత ఆ అధిపతి తన శతాధిపతులలో ఇద్దరిని పిలిచి, “రెండువందల మంది సైనికులు, డెబ్బై మంది గుర్రపురౌతులను మరియు రెండువందల మంది ఈటెల సైన్య పటాలంతో ఈ రాత్రి తొమ్మిది గంటలకు కైసరయకు వెళ్లడానికి సిద్ధపడండని ఆదేశించాడు. 24 అలాగే అధిపతియైన ఫెలిక్స్ దగ్గరకు పౌలును క్షేమంగా తీసుకువెళ్లడానికి అతనికి గుర్రాన్ని ఇవ్వండి” అని ఆదేశించాడు. 25 అతడు ఈ విధంగా ఒక ఉత్తరం వ్రాసాడు: 26 క్లౌదియ లూసియ, మహా గౌరవనీయులైన ఫెలిక్స్ అధిపతికి నా వందనాలు. 27 ఈ వ్యక్తిని యూదులు పట్టుకొని చంపబోతుంటే, ఇతడు రోమీయుడని తెలుసుకొని నేను సైనికులతో వెళ్లి రక్షించాను. 28 వారు అతన్ని ఎందుకు నిందిస్తున్నారో తెలుసుకోవడానికి, వారి న్యాయసభ ముందు అతన్ని నిలబెట్టాను. 29 వారు అతనిపై వారి ధర్మశాస్త్రానికి సంబంధించిన నిందలను మోపారు కాని, మరణశిక్ష వేయడానికి లేదా చెరసాలలో ఖైదీగా బంధించడానికి తగిన నేరమేదీ అతనిలో లేదు. 30 అతన్ని చంపాలని కుట్ర పన్నుతున్నారని నాకు తెలియగానే, ఇతన్ని మీ దగ్గరకు పంపాను అతని మీద నిందమోపే వారిని వారి ఫిర్యాదులను మీ ముందు చెప్పుకోవాలి అని ఆదేశించాను. 31 కనుక సైనికులు, తమకు ఇచ్చిన ఆ దేశం ప్రకారం, రాత్రి వేళ బయలుదేరి తమతో పౌలును యెరూషలేము నుండి అంతిపత్రి ప్రాంతానికి తీసుకువెళ్లారు. 32 మరుసటిరోజు గుర్రాల దండును పౌలుతో పాటు పంపి, వారు సైనికుల కోటకు తిరిగి వచ్చారు. 33 ఆ గుర్రాల దండు కైసరయకు చేరిన తర్వాత, వారు ఆ ఉత్తరంతో పాటు పౌలును అధిపతికి అప్పగించారు. 34 ఆ అధిపతి ఆ ఉత్తరం చదివి, అతడు ఏ ప్రాంతానికి చెందినవాడు అని అడిగాడు. అతడు కిలికియకు చెందినవాడని తెలుసుకొని, 35 “నీ మీద నేరం మోపిన వారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నీ విషయాన్ని నేను విచారిస్తాను” అని చెప్పి, అతన్ని హేరోదు రాజగృహంలో కాపలా మధ్యలో ఉంచాలని ఆదేశించాడు. |
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.