అపొస్తలుల 20 - తెలుగు సమకాలీన అనువాదముమాసిదోనియా ప్రాంతం నుండి గ్రీసు దేశానికి వెళ్లుట 1 ఆ అల్లరంతా తగ్గిన తర్వాత, పౌలు శిష్యులను తన దగ్గరకు పిలుచుకొని, వారిని ధైర్యపరచి వారి దగ్గర సెలవు తీసుకుని మాసిదోనియకు బయలుదేరాడు. 2 అతడు ఆ ప్రాంతంలో ప్రయాణం చేస్తూ ప్రజలను ధైర్యపరచే మాటలను చెప్పుతూ, చివరికి గ్రీసు దేశం చేరాడు. 3 అతడు అక్కడ మూడు నెలలు గడిపిన తర్వాత, ఓడ ఎక్కి సిరియా దేశానికి బయదేరుతున్నప్పుడు, కొందరు యూదులు అతని మీద కుట్ర పన్నుతున్నారని తెలుసుకొని మాసిదోనియా గుండా తిరిగి వెళ్లడానికి నిర్ణయించుకొన్నాడు. 4 అతనితో బెరయా పట్టణస్థుడు పుర్రు కుమారుడైన సోపత్రు, థెస్సలొనీక పట్టణస్థుడైన అరిస్తర్కు మరియు సెకుందు, దెర్బే పట్టణస్థుడైన గాయి, తిమోతి, తుకికు మరియు ఆసియా ప్రాంతం నుండి త్రోఫిము అనేవారు ఉన్నారు. 5 వీరందరు మాకంటే ముందుగా త్రోయ పట్టణం చేరుకొని మా కొరకు ఎదురు చూస్తున్నారు. 6 కానీ మేము పులియని రొట్టెల పండుగ తర్వాత మాసిదోనియలోని ఫిలిప్పీ పట్టణం నుండి ఓడ ఎక్కి బయలుదేరి, ఐదు రోజుల తర్వాత మిగిలిన వారిని త్రోయ పట్టణంలో కలుసుకొని వారి దగ్గర ఏడు రోజులు గడిపాం. త్రోయా పట్టణంలో చనిపోయిన ఐతుకును బ్రతికించుట 7 వారపు మొదటి రోజున రొట్టె విరవడం కొరకు మేము ఒక్కచోట చేరినప్పుడు, పౌలు మరుసటిరోజు వెళ్లిపోవాలి, కనుక వారితో అర్ధరాత్రి వరకు మాట్లాడుతూనే ఉన్నాడు. 8 మేము సమావేశమైన మేడ గదిలో చాలా దీపాలు ఉన్నాయి. 9 ఆ గది కిటికీ మీద ఐతుకు అనే పేరుగల ఒక యవ్వనస్థుడు కూర్చుని ఉన్నాడు, పౌలు ఇంకా మాట్లాడుతుండగా వాడు మత్తు నిద్రలోకి వెళ్లిపోయాడు. వాడు బాగా నిద్రలోకి వెళ్లినప్పుడు, వాడు మూడవ అంతస్తు నుండి క్రింద నేలపై పడి చనిపోయాడు. 10 అప్పుడు పౌలు క్రిందికి వెళ్లి, ఆ యువకుని మీద పడి, తన చేతులతో కౌగలించుకొని, “మీరు కలవరపడకండి, ఇతడు బ్రతికే ఉన్నాడు” అని వారితో చెప్పాడు. 11 అతడు మళ్ళీ మేడ గదికి వెళ్లి వారందరితో కలిసి రొట్టెను విరిచి తిన్నాడు. అతడు తెల్లవారే వరకు వారితో మాట్లాడి బయలుదేరి వెళ్లాడు. 12 ఆ యువకుని సజీవంగా ఇంటికి తీసుకొని వెళ్లిన ప్రజలందరు గొప్ప ఆదరణ పొందారు. ఎఫెసు సంఘపెద్దల వద్ద సెలవు తీసుకొన్న పౌలు 13 పౌలును ఎక్కించుకోవాలని, మేము ఓడలో ముందుగా బయలుదేరి అస్సోసు చేరిపోయాం. పౌలు అక్కడికి కాలినడకన రావాలని ఈ ఏర్పాటును చేశాడు. 14 అనుకున్న విధంగానే అతడు మమ్మల్ని అస్సోసులో కలుసుకున్నాడు, మేము అతన్ని మితులేనేకు తీసుకొని వెళ్లాము. 15 మరుసటిరోజు మేము అక్కడి నుండి ఓడలో బయలుదేరి కీయోసు చేరి, మరుసటిరోజు సమొసును దాటి, ఆ తర్వాత రోజు మిలేతు చేరుకొన్నాం. 16 పెంతెకొస్తు పండుగ రోజు యెరూషలేములో ఉండాలని పౌలు ఆతురతలో ఉన్నాడు కనుక, అతడు ఆసియా ప్రాంతంలో సమయం వ్యర్థం చేయకూడదని ఎఫెసు పట్టణం దాటి పోవడానికి నిర్ణయించుకొన్నాడు. 17 పౌలు మిలేతు నుండి ఎఫెసు సంఘ పెద్దలకు వర్తమానం పంపి వారిని పిలిపించాడు. 18 వారు వచ్చినపుడు, వారితో ఈ విధంగా చెప్పాడు: “నేను ఆసియా ప్రాంతానికి వచ్చిన మొదటి రోజు నుండి మీతో గడిపిన సమయమంతటిలో నేను ఎలా జీవించానో మీకు తెలుసు. 19 నాకు విరోధంగా యూదులు చేసిన కుట్రల వలన నేను ఎదుర్కొన్న శ్రమల మధ్యలో కూడా నేను కన్నీరు విడుస్తు, మిక్కిలి వినయంగా ప్రభువును సేవించాను. 20 మీకు ఉపయోగకరమైన దానిని సంకోచించకుండా బహిరంగంగా ఇంటింటికి తిరిగి బోధించానని మీకు తెలుసు. 21 పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగి ప్రభువైన యేసును నమ్మమని యూదులకు గ్రీసు దేశస్థులకు నేను ప్రకటించాను. 22 “ఇప్పుడు, నేను ఆత్మ చేత బలవంతం చేయబడి, నేను యెరూషలేముకు వెళ్తున్నాను, అక్కడ నాకు ఏమి జరుగబోతుందో తెలియదు. 23 ప్రతి పట్టణంలో నా కొరకు సంకెళ్ళు మరియు హింసలు వేచి ఉన్నాయని, పరిశుద్ధాత్మ నన్ను హెచ్చరిస్తున్నాడని మాత్రం నాకు తెలుసు. 24 అయినా కాని, నా జీవితం నాకు విలువైనది కాదని నేను భావిస్తున్నాను; ప్రభువైన యేసు నా ముందు ఉంచిన పరుగు పందెంను పూర్తి చేసి, దేవుని కృపను గురించిన సువార్తను ప్రకటించాలని ఆయన నాకు ఇచ్చిన పనిని పూర్తి చేయడమే నా ఏకైక లక్ష్యంగా ఉంది. 25 “ఇదిగో, నేను దేవుని రాజ్యం గురించి మీ మధ్య తిరుగుతూ ప్రకటించిన నన్ను మీరెవరు మళ్లీ చూడరని నాకు ఇప్పుడు తెలుస్తుంది. 26 కనుక, మీరు పొందుకొన్న ఈ రక్షణ పోగొట్టుకొంటే ఇక మీరే కారకులు, మీ రక్తం విషయంలో నేను నిర్దోషిని అని నేడు మీ ముందు ప్రకటిస్తున్నాను. 27 ఎందుకంటే, దేవుని ఉద్దేశమంతటిని మీకు ప్రకటించడానికి నేను సంకోచించలేదు. 28 అయితే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాచుకొంటూ పరిశుద్ధాత్మ మీకు అప్పగించిన మందను సంఘపెద్దలుగా కాయండి. దేవుడు తన స్వంత రక్తాన్ని క్రయధనంగా చెల్లించి కొన్న ఆయన సంఘానికి కాపరులుగా ఉండండి. 29 నేను వెళ్లిన తర్వాత, భయంకరమైన తోడేళ్ళు మీ మధ్యకు చొరబడతాయి, అవి మందను విడిచిపెట్టవని నాకు తెలుస్తుంది. 30 శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవడానికి సత్యాన్ని మళ్ళించే వారు మీ సొంతవారిలో నుండే బయలుదేరుతారు. 31 కనుక మీరు మెలకువగా ఉండండి! నేను మూడు సంవత్సరాలు రాత్రింబగళ్ళు ఎలా కన్నీరు కార్చుతూ మీలో ప్రతి ఒక్కరిని మానకుండా హెచ్చరించానో జ్ఞాపకం చేసుకోండి. 32 “ఇప్పుడు నేను మిమ్మల్ని దేవునికి మరియు మిమ్మల్ని అభివృద్ధిపరచి పరిశుద్ధులందరితో పాటు మీకు స్వాస్థ్యాన్ని ఇవ్వగల ఆయన కృపావాక్యానికి అప్పగిస్తున్నాను. 33 నేను ఎవరి వెండిని కాని బంగారం కాని వస్త్రాలను కాని ఆశించలేదు. 34 నా సొంత చేతులతో నా అవసరాలను మరియు నాతో ఉన్న వారి అవసరాలను తీర్చానని మీకే తెలుసు. 35 నేను చేసే ప్రతి పనిలో మీకు మాదిరిని చూపిస్తూ, ‘పుచ్చుకోవడం కంటే ఇవ్వడం ఎంతో దీవెనకరం’ అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోవాలని, నేను కష్టపడి బలహీనులకు సహాయం చేసి మీకు మాదిరిని చూపించాను” అని చెప్పాడు. 36 పౌలు మాట్లాడటం ముగించిన తర్వాత, అతడు వారందరితో కలిసి మోకరించి ప్రార్థించాడు. 37 వారందరు పౌలును కౌగిలించుకొని ముద్దు పెడుతూ ఏడ్చారు. 38 మీరు మరలా ఎన్నడు నా ముఖం చూడరు అని అతడు చెప్పిన మాట వారికి చాలా దుఃఖం కలిగించింది. ఆ తర్వాత వారు అతన్ని ఓడ వరకు సాగనంపారు. |
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.