అపొస్తలుల 18 - తెలుగు సమకాలీన అనువాదముకొరింధీ పట్టణంలో పౌలు 1 ఆ తర్వాత, పౌలు ఏథెన్సు పట్టణం నుండి కొరింథీ పట్టణానికి వెళ్లాడు. 2 అక్కడ పొంతు అనే ప్రాంతానికి చెందిన అకుల అనే ఒక యూదుడు తన భార్య ప్రిస్కిల్లతో కలిసి, యూదులందరు రోమా ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవాలనే క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞ మేరకు ఇటలీ దేశం నుండి కొరింథీ పట్టణానికి వచ్చాడు. పౌలు వాళ్ళను చూడటానికి వెళ్లాడు. 3 పౌలు కూడా వారిలా డేరాలను తయారు చేసేవాడు, కనుక అతడు వారితో నివసిస్తూ కలిసి పని చేశాడు. 4 అతడు యూదులను మరియు గ్రీసుదేశస్థులను ఒప్పించే ప్రయత్నం చేస్తూ, ప్రతి సబ్బాతు దినాన సమాజమందిరంలో తర్కించేవాడు. 5 సీల తిమోతిలు మాసిదోనియ ప్రాంతం నుండి వచ్చినప్పుడు, పౌలు యేసే క్రీస్తు అని యూదులకు ప్రకటించడానికి, సాక్ష్యమివ్వడానికి తనను తాను ప్రత్యేకంగా అంకితం చేసుకున్నాడు. 6 అయితే వారు పౌలును దూషిస్తూ ఎదురు తిరిగినప్పుడు, అతడు తన బట్టలను దులుపుకొని, “ ‘మీ రక్తం మీ తలల మీదికే వచ్చు గాక!’ నేనైతే ఈ విషయంలో నిర్దోషిని. ఇక ఇప్పటి నుండి నేను యూదేతరుల దగ్గరకు వెళ్తున్నాను” అని వారితో చెప్పాడు. 7 పౌలు సమాజమందిరం నుండి బయటకు వెళ్లి దాని ప్రక్కనే ఆనుకొని ఉన్న దేవుని ఆరాధించే తీతియు యూస్తు అనే వాని ఇంటికి వచ్చాడు. 8 ఆ సమాజమందిరపు నాయకుడైన క్రిస్పు మరియు అతని కుటుంబమంతా ప్రభువును నమ్ముకున్నారు; అలాగే పౌలు మాటలు విన్న చాలామంది కొరింథీయులు నమ్మి బాప్తిస్మం పొందుకొన్నారు. 9 ఒక రాత్రి దర్శనంలో ప్రభువు పౌలుతో, “భయపడకు; భయపడకు; మాట్లాడుతూనే ఉండు, మౌనంగా ఉండకు. 10 ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను, ఎవరు నీ మీద దాడి చేసి నీకు హాని చేయరు, ఈ పట్టణంలో నాకు చెందిన ప్రజలు చాలామంది ఉన్నారు” అని చెప్పారు. 11 కనుక ఒకటిన్నర సంవత్సరం పాటు పౌలు అక్కడే ఉండి దేవుని వాక్యాన్ని వారికి బోధించాడు. 12 అకయ ప్రాంతానికి గల్లియో అధిపతిగా ఉన్నపుడు, కొరింథీలోని యూదులందరు కలిసి పౌలు మీద దాడి చేసి, అతన్ని న్యాయస్థానానికి తీసుకొని వచ్చారు. 13 వారు అతని మీద, “ఇతడు ధర్మశాస్త్రానికి విరుద్ధమైన పద్ధతులతో దేవుని ఆరాధించండని ప్రజలను ఒప్పిస్తున్నాడు” అని ఫిర్యాదు చేశారు. 14 పౌలు మాట్లాడడం ఆరంభిస్తుండగా, గల్లియో వారితో, “యూదులారా, మీరు ఒక అన్యాయం లేదా నేరానికి సంబంధించి ఫిర్యాదు చేస్తే, నేను మీమాటలు వినడం న్యాయంగా ఉంటుంది. 15 కాని ఇది మీ ధర్మశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు, మాటలు, పేర్ల గురించే కనుక మీరే పరిష్కరించుకొండి. అలాంటి విషయాలకు నేను న్యాయాధికారిని కాను” అని వారితో చెప్పి, 16 వారందరిని అక్కడి నుండి పంపేశాడు. 17 అప్పుడు ఆ ప్రజలందరు సమాజమందిరపు అధికారి సోస్తెనేసును పట్టుకొని న్యాయస్థానం ముందు కొట్టారు, అయినా కానీ గల్లియో దాని గురించి ఏమి పట్టించుకోలేదు. అకుల, ప్రిస్కిల్ల మరియు అపొల్లో 18 పౌలు మరికొన్ని రోజులు కొరింథీలోనే గడిపాడు. తర్వాత అక్కడి సహోదర సహోదరీల వద్ద సెలవు తీసుకొని, ప్రిస్కిల్ల మరియు అకులతో కలిసి ఓడలో సిరియా దేశానికి వెళ్లాడు. అతడు ప్రయాణానికి ముందు తాను చేసుకొన్న మ్రొక్కుబడి ప్రకారం తన తల వెంట్రుకలను కెంక్రేయలో కత్తిరించుకొన్నాడు. 19 వారు ఎఫెసుకు చేరుకున్నాక, పౌలు ప్రిస్కిల్ల మరియు అకులను అక్కడ విడిచిపెట్టాడు. తాను ఒక్కడే సమాజమందిరంలోనికి వెళ్లి యూదులతో తర్కించేవాడు. 20 వారు తమతో ఇంకా కొంత సమయం ఉండుమని పౌలును అడిగారు, కాని అతడు ఒప్పుకోలేదు. 21 కానీ వెళ్లే ముందు వారితో, “దేవుని చిత్తమైతే నేను తిరిగి వస్తాను” అని వాగ్దానం చేసి, ఎఫెసులో ఓడ ఎక్కి బయలుదేరాడు. 22 అతడు కైసరయ తీరాన దిగి, యెరూషలేముకు వెళ్లి సంఘాన్ని పలకరించాడు మళ్ళీ అక్కడి నుండి అంతియొకయ పట్టణానికి తిరిగి వచ్చాడు. 23 అంతియొకయలో కొంత కాలం గడిపిన తర్వాత, పౌలు అక్కడి నుండి బయలుదేరి గలతీయ ఫ్రుగియ పరిసర ప్రాంతాలంతట, ఒక స్థలం నుండి మరొక స్థలానికి తిరుగుతూ శిష్యులందరిని బలపరిచాడు. 24 ఆ సమయంలో అలెక్సంద్రియ పట్టణానికి చెందిన అపొల్లో అనే ఒక యూదుడు ఎఫెసుకు వచ్చాడు. అతడు విద్యావంతుడు, లేఖనాలలో పూర్తి ప్రవీణ్యత కలిగినవాడు. 25 అతడు ప్రభువు మార్గం గురించి ఉపదేశాన్ని పొంది, తనకి యోహాను బాప్తిస్మం గురించి మాత్రమే తెలిసినప్పటికి చాలా ఆసక్తితో యేసు గురించి స్పష్టంగా బోధిస్తున్నాడు. 26 అతడు సమాజమందిరంలో ధైర్యంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అకుల ప్రిస్కిల్లలు అతని మాటలను విని, అతన్ని తమ ఇంటికి ఆహ్వానించి దేవుని మార్గం గురించి మరింత పూర్తిగా అతనికి వివరించారు. 27 అపొల్లో అకయ ప్రాంతానికి వెళ్లాలని తలంచినప్పుడు అక్కడి సహోదరి సహోదరులు అతన్ని ప్రోత్సహించి, అతన్ని చేర్చుకోవాలని అకయలోని శిష్యులకు ఉత్తరాన్ని వ్రాసి పంపారు. అతడు అక్కడికి చేరినప్పుడు కృప చేత నమ్మిన వారికి అతడు గొప్ప సహాయంగా నిలిచాడు. 28 ఎందుకంటే, అతడు లేఖనాల ఆధారంతో యేసే క్రీస్తు అని నిరూపిస్తూ తనకు వ్యతిరేకంగా ఉన్న యూదుల వాదనలను బహిరంగంగా గట్టిగా ఖండించాడు. |
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.