Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

అపొస్తలుల 11 - తెలుగు సమకాలీన అనువాదము


పేతురు తన పనులను వివరించుట

1 యూదేతరులు కూడా దేవుని వాక్యాన్ని స్వీకరించారని యూదయ ప్రాంతమంతటిలో ఉన్న అపొస్తలులు మరియు విశ్వాసులు విన్నారు.

2 కనుక పేతురు యెరూషలేముకు తిరిగి వెళ్లినప్పుడు, సున్నతి పొందిన విశ్వాసులు అతన్ని విమర్శించి,

3 “నీవు సున్నతి పొందని వారి ఇంటికి వెళ్లి వారితో భోజనం చేసావు” అన్నారు.

4 అప్పుడు పేతురు మొదటి నుండి జరిగినదంతా వారితో చెప్పాడు,

5 “నేను యొప్పే పట్టణంలో ప్రార్థిస్తున్నప్పుడు, నేను స్వాప్నిక స్థితిలో ఒక దర్శనం చూసాను. అందులో పరలోకం నుండి నాలుగుమూలలు పట్టుకోబడి భూమి మీదకు దింపబడుతున్న ఒక పెద్ద దుప్పటి నేనున్న చోటికి దిగి రావడం చూసాను.

6 భూమిపై ఉండే నాలుగు కాళ్ళ జంతువుల, అడవి మృగాలు, ప్రాకే ప్రాణులు మరియు పక్షులు దానిలో ఉండడం నేను చూసాను.

7 అప్పుడు ఒక స్వరం నాతో, ‘పేతురు లేచి, వాటిని చంపుకొని తిను’ అని చెప్పడం విన్నాను.

8 “అందుకు నేను ‘వద్దు ప్రభువా, అపవిత్రమైన మరియు అపరిశుభ్రమైన దానిని ఎప్పుడూ నా నోటిలో పెట్టుకోలేదు’ అన్నాను.

9 “రెండవ సారి పరలోకం నుండి ఆ స్వరం నాతో, ‘దేవుడు పవిత్రపరచిన వాటిని నీవు అపవిత్రమని పిలువద్దు’ అని చెప్పడం వినబడింది.

10 ఈ విధంగా మూడుసార్లు జరిగింది, ఆ తర్వాత అదంతా తిరిగి ఆకాశానికి తీసుకుపోబడింది.

11 “అలా జరిగిన వెంటనే నా కొరకు కైసరయ పట్టణం నుండి పంపబడిన ముగ్గురు వ్యక్తులు నేను ఉన్న ఇంటి ముందు నిలబడ్డారు.

12 అప్పుడు ఆత్మ నాతో, వారితో వెళ్లడానికి సందేహించవద్దు అని ఆదేశించాడు. ఈ ఆరుగురు సహోదరులు కూడా నాతో వచ్చారు, మేము ఆ వ్యక్తి ఇంటికి వెళ్లాము.

13 అతడు తన ఇంట్లో ఉన్నప్పుడు ఎలా దూత ప్రత్యక్షమవ్వడం చూసాడో మరియు దూత తనతో, ‘యొప్పేకు మనుష్యులను పంపించి పేతురు అని పిలువబడే సీమోనును పిలిపించు.

14 అతడు తెచ్చే సందేశం ద్వారా నీవు నీ ఇంటివారందరు రక్షించబడతారని’ చెప్పాడని మాతో చెప్పాడు.

15 “నేను బోధించడం మొదలుపెట్టగానే ప్రారంభంలో మన మీదకు పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగానే వారి మీదకు కూడా దిగివచ్చాడు.

16 అప్పుడు: ‘యోహాను నీటితో బాప్తిస్మమిచ్చాడు, కాని మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుకొంటారు’ అని ప్రభువు చెప్పినది నేను జ్ఞాపకం చేసుకొన్నాను.

17 ప్రభువైన యేసుక్రీస్తును నమ్మిన మనకు ఇవ్వబడిన వరాన్నే దేవుడు వారికి కూడా ఇస్తే, దేవుని అడ్డగించి నిలబడడానికి నేను ఎవరిని?” అని వారితో అన్నాడు.

18 వారు ఈ మాటలను విన్నప్పుడు, వారు ఏ అభ్యంతరం చెప్పకుండా, “అయితే దేవుడు యూదేతరులకు కూడా జీవంలోనికి నడిపించే పశ్చాత్తాపాన్ని అనుగ్రహించాడని” చెప్పుకొంటూ దేవుని స్తుతించారు.


అంతియొకయ పట్టణంలోని సంఘం

19 స్తెఫను చంపబడినప్పుడు హింస కారణంగా చెదిరిపోయిన విశ్వాసులు ఫేనీకే, కుప్ర మరియు అంతియొకయ పట్టణ ప్రాంతాల వరకు వెళ్లి కేవలం యూదుల మధ్యనే సువార్త ప్రకటించారు.

20 వారిలో కుప్ర మరియు కురేనీకు చెందిన కొందరు అంతియొకయ పట్టణానికి వెళ్లి గ్రీకు దేశస్థులతో కూడా ప్రభువైన యేసు సువార్తను చెప్పడం మొదలుపెట్టారు.

21 ప్రభువు హస్తం వారికి తోడుగా ఉన్నందున, పెద్ద సంఖ్యలలో ప్రజలు నమ్మి, ప్రభువు వైపు తిరిగారు.

22 ఈ సమాచారం యెరూషలేములో ఉన్న సంఘానికి చేరినప్పుడు వారు బర్నబాను అంతియొకయ ప్రాంతానికి పంపించారు.

23 అతడు అక్కడ చేరాక దేవుని కృప చేసిన కార్యాలను చూసి అతడు సంతోషించి, తమ పూర్ణహృదయంతో ప్రభువుకు నమ్మకంగా ఉండాలని వారందరిని ప్రోత్సాహించాడు.

24 బర్నబా మంచివాడు, పరిశుద్ధాత్మతో మరియు విశ్వాసంతో నిండినవాడు, అతని ద్వార పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రభువులోనికి చేర్చబడ్డారు.

25 ఆ తర్వాత బర్నబా సౌలును వెదకడానికి తార్సు పట్టణానికి వెళ్లి,

26 అతన్ని కలుసుకొని అంతియొకయ ప్రాంతానికి తీసుకు వచ్చాడు. ఒక సంవత్సరం అంతా బర్నబా మరియు సౌలు ఆ సంఘంతో కలిసి ఉంటూ అనేకమందికి బోధించారు. అంతియొకయలో శిష్యులు మొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడ్డారు.

27 ఆ రోజులలో యెరూషలేము నుండి అంతియొకయకు కొందరు ప్రవక్తలు వచ్చారు.

28 వారిలో అగబు అనే పేరుగలవాడు నిలబడి, రోమా సామ్రాజ్యం అంతటా గొప్ప కరువు వస్తుందని ఆత్మ ద్వారా ప్రవచించాడు. అతడు చెప్పింది క్లౌదియ చక్రవర్తి కాలంలో జరిగింది.

29 అప్పుడు ప్రతి ఒక్క విశ్వాసి తమ శక్తికొలది యూదయలో నివసిస్తున్న విశ్వాసులకు సహాయం అందించడానికి నిశ్చయించుకున్నారు.

30 కనుక వారు బర్నబా మరియు సౌలుల ద్వారా ఆ సహాయాన్ని అక్కడి సంఘ పెద్దలకు పంపించారు.

తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version™, New Testament

Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan