Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 తిమోతికి 3 - తెలుగు సమకాలీన అనువాదము

1 అంత్యదినాలలో భయంకరమైన కాలాలు వస్తాయని నీవు తెలుసుకో.

2 ఎందుకంటే, ప్రజలు స్వార్ధపరులుగా, ధనాన్ని ప్రేమించేవారిగా, గొప్పలు చెప్పుకునేవారిగా, అహంకారులుగా, దూషించేవారిగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా, కృతజ్ఞతలేనివారిగా, అపవిత్రులుగా,

3 ప్రేమలేనివారిగా, క్షమించలేనివారిగా, అపనిందలు వేసేవారిగా, స్వీయ నియంత్రణ లేనివారిగా, క్రూరులుగా, మంచితనాన్ని ప్రేమించలేనివారిగా,

4 ద్రోహులుగా, మొండివారిగా, అహంకారులుగా, దేవునికి బదులు సుఖానుభవాన్ని ప్రేమించేవారిగా,

5 దైవభక్తి కలిగివున్నా దాని శక్తిని నమ్మనివారిగా ఉంటారు. అలాంటి వారికి దూరంగా ఉండు.

6 అలాంటివారు, పాపంతో నిండిన అన్ని రకాల దురాశలకు బానిసలైన మోసపూరిత స్త్రీల ఇళ్లలో చొరబడి వారిని లోబరుచుకుంటారు.

7 ఈ స్త్రీలు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు కాని సత్యాన్ని ఎన్నడు గ్రహించలేరు.

8 యన్నే, యంబ్రే అనేవారు మోషేను ఎదిరించినట్లే ఈ బోధకులు కూడా సత్యాన్ని ఎదిరిస్తున్నారు. వారికున్న దుష్టహృదయాన్ని బట్టి విశ్వాస విషయంలో తృణీకరించబడ్డారు.

9 అయినా వారు ముందుకు సాగలేరు ఎందుకంటే, ఆ ఇద్దరికి జరిగినట్లే, వీరి మూర్ఖత్వం అందరికి స్పష్టమవుతుంది.


తిమోతికి చివరి హెచ్చరికలు

10 అయితే, నా బోధల గురించి, నా జీవిత విధానం, నా ఉద్దేశాలు, విశ్వాసం, ఓర్పు, ప్రేమ, దీర్ఘశాంతం,

11 హింసలు, శ్రమలు అంటే, అంతియొకయలో, ఈకొనియలో, లుస్త్ర ప్రాంతాలలో నాకు కలిగిన హింసను నేను ఎలా సహించానో అన్ని నీకు తెలుసు. అయితే ప్రభువు వాటన్నిటి నుండి నన్ను తప్పించారు.

12 నిజానికి, క్రీస్తు యేసులో భక్తిగల జీవితాన్ని జీవించాలనుకొనే వారందరు హింసకు గురి అవుతారు.

13 అయితే దుష్టులు, వంచకులు ఇతరులను మోసం చేస్తూ తామే మోసపోతూ మరింతగా చెడిపోతారు.

14 కాని నీవైతే, నీవు నేర్చుకున్న వాటిని, నీవు నమ్మి విశ్వసించిన వాటిలో స్థిరంగా కొనసాగు ఎందుకంటే, నీవు ఎవరి నుండి వాటిని నేర్చుకున్నావో నీకు తెలుసు.

15 క్రీస్తు యేసులో విశ్వాసం ద్వారా కలుగు రక్షణ గురించిన జ్ఞానాన్ని నీకు కలుగజేయడానికి శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుండే నీకు తెలుసు.

16 ప్రతి లేఖనం దేవుని ప్రేరణ చేతనే కలిగింది, అది బోధించడానికి, గద్దించడానికి, సరిదిద్దడానికి, నీతిలో నడిపించడానికి ఉపయోగపడుతుంది.

17 ఈ లేఖనాలను బట్టి, దేవుని సేవకుడు ప్రతి మంచిపనిని చేయడానికి పూర్తిగా సిద్ధపడి ఉండాలి.

తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version™, New Testament

Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan