Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 థెస్సలొనీకయులకు 2 - తెలుగు సమకాలీన అనువాదము


దుర్మార్గుడైన వ్యక్తి

1 సహోదరీ సహోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడ గురించి మనం ఆయనను కలుసుకొనుట గురించి మేము మిమ్మల్ని అడిగేది ఏంటంటే,

2 ప్రభువు రాబోయే దినము వచ్చేసిందని ప్రకటించే ప్రవచనాల ద్వారా గాని నోటిమాటల ద్వారా లేదా ఏదైన ఉత్తరం ద్వారా గాని మీకు తెలిస్తే తొందరపడి కలవరంతో భయపడకండి.

3 మిమ్మల్ని ఎవరైనా ఏ రీతిగానైనా మోసపరచనివ్వకండి. ఎందుకంటే తిరుగుబాటు వచ్చేవరకు, నాశనానికి కర్తయైన దుర్మార్గుడు బయటపడే వరకు ఆ దినము రాదు.

4 వాడు దేవునిగా పిలువబడే ప్రతిదానిని, పూజించబడే వాటన్నిటిని వ్యతిరేకించి, తనను తాను వాటన్నిటికంటే పైగా హెచ్చించుకొంటూ, తనంతట తానే దేవాలయంలో కూర్చొని, తానే దేవుడనని ప్రకటించుకుంటాడు.

5 నేను మీతో ఉన్నప్పుడు మీకు తెలియజేసిన ఈ సంగతులు మీకు జ్ఞాపకం లేవా?

6 అయితే అతడు సరియైన సమయంలో బయలుపరచబడడానికి ఏది అతన్ని అడ్డగిస్తూ ఉందో ఇప్పుడు మీకు తెలుసు.

7 ఆ దుర్మార్గుని యొక్క రహస్యశక్తి ఇప్పటికే పనిచేస్తూ ఉంది; అయితే దానిని అడ్డగిస్తున్నవాడు మార్గంలో నుండి వాడిని తీసివేసే వరకు వాడు అడ్డగిస్తూ ఉంటాడు.

8 ఆ దుర్మార్గుడు బయలుపరచబడినప్పుడు, ప్రభువైన యేసు తన నోటి ఊపిరితో అతన్ని పడగొట్టి, తన రాకడ ప్రకాశంతో అతన్ని నాశనం చేస్తారు.

9 సాతాను చేసే పనులకు అనుకూలంగా దుర్మార్గుని రాకడ ఉంటుంది. అతడు తన అబద్ధాన్ని నిరూపించుకోవడానికి, తన శక్తిని చూపించుకోడానికి సూచక క్రియలు, అద్బుతాలు, మహాత్కార్యాలను చేస్తాడు,

10 అతడు నశించువారిని అన్ని విధాలుగా దుష్టత్వంతో మోసగిస్తాడు, వారు రక్షణ పొందడానికి గాని సత్యాన్ని ప్రేమించడానికి నిరాకరించారు కనుక వారు నశిస్తారు.

11 ఈ కారణంగా, వారు అబద్ధాన్ని నమ్మేలా దేవుడు వారి మీదకు బలమైన భ్రమను పంపాడు.

12 అప్పుడు సత్యాన్ని నమ్మకుండా దుర్మార్గంలో ఆనందించేవారు శిక్షకు పాత్రులుగా ఎంచబడతారు.


స్థిరంగా నిలబడు

13 ప్రభువు ప్రేమించిన సహోదరీ సహోదరులారా, మేము మీ కొరకు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించ వలసిందే ఎందుకంటే, మీరు రక్షణ పొందడానికి సత్యాన్ని నమ్మడం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆత్మ చేత పరిశుద్ధపరచడానికి ప్రారంభం నుండి ఏర్పరచుకొన్నారు.

14 మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు మహిమలో పాలుపొందేలా మా సువార్త ద్వారా దేవుడు మిమ్మల్ని పిలిచాడు.

15 కనుక సహోదరీ సహోదరులారా, మీరు మా నోటి మాటలతో లేదా ఉత్తరాల ద్వారా మేము మీకు అందించిన బోధను గట్టిగా పట్టుకొని దానిలో స్థిరంగా ఉండండి.

16 మన ప్రభువైన యేసుక్రీస్తును మన తండ్రియైన దేవుడు మనలను ప్రేమించి తన కృప చేత మనకు నిత్య ప్రోత్సాహాన్ని స్థిరమైన నిరీక్షణను ఇచ్చి,

17 మన హృదయాలను ధైర్యపరచి, ప్రతి మంచి పనిలో మంచి మాటలలో మిమ్మల్ని బలపరచును గాక.

తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version™, New Testament

Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan