2 పేతురు 2 - తెలుగు సమకాలీన అనువాదముఅబద్ధ బోధకులు వారి నాశనం 1 అయితే మీలో అబద్ధ బోధకులు ఉన్నట్లుగానే, గతంలో కూడా ప్రజల మధ్యలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారు రహస్యంగా నాశనకరమైన నియమాలను ప్రవేశపెడుతూ, వారిని కొన్న సర్వాధికారియైన ప్రభువును కూడా తిరస్కరిస్తూ, వేగంగా వారి మీదికి వారే నాశనం తెచ్చుకొంటారు. 2 చాలామంది వారి పోకిరి చేష్టలను అనుసరిస్తారు, వీరిని బట్టి సత్యమార్గంలో ఉన్న వారిని గురించి చెడుగా దూషిస్తారు. 3 ఈ బోధకులు పేరాశ గలవారైవుండి, కట్టుకథలు చెప్పి మిమ్మల్ని దోచుకుంటారు, వారి తీర్పు వారి మీదికే వస్తుంది, వారి నాశనం ఆలస్యం కాదు. 4 ఎందుకంటే, దేవదూతలు పాపం చేసినపుడు దేవుడు వారిని విడిచిపెట్టక, వారిని సంకెళ్లతో బంధించి, చీకటి గల పాతాళానికి పంపి, తీర్పు దినం వరకు వారిని కాపలాలో ఉంచారు. 5 ఆయన పూర్వకాలపు లోకాన్ని విడిచిపెట్టక అప్పటి భక్తిహీనులైన ప్రజల మీదికి జల ప్రళయాన్ని రప్పించారు కాని, నీతిని బోధించిన నోవహును మరి ఏడుగురిని రక్షించారు; 6 దేవుడు సొదొమ, గొమొర్రాలకు తీర్పు తీర్చి వాటిని దహించి బూడిద చేశారు, భక్తిహీనులకు ఏమి జరుగుతుందో తెలియజేయడానికి వాటిని ఒక మాదిరిగా ఉంచారు; 7 దుష్టుల కామ వికార ప్రవర్తన వలన బాధపడిన, నీతిమంతుడైన లోతును ఆయన రక్షించారు. 8 ఎందుకంటే, ఈ నీతిమంతుడు దినదినం వారి మధ్య జీవిస్తూ వారి చెడు కార్యాలను చూసి, వారి మాటలు విని తన నీతిగల మనస్సులో వేదన చెందాడు. 9 అదే నిజమైతే, భక్తులను శ్రమలలో నుండి ఎలా విడిపించాలో ప్రభువుకు తెలుసు, అలాగే తీర్పు దినాన దుష్టులను ఎలా శిక్షించాలో కూడా ఆయనకు తెలుసు. 10 మరి ముఖ్యంగా శరీరాశలను అనుసరించి చెడిపోయిన వారిని, ఆయన అధికారాన్ని తృణీకరించిన వారిని శిక్షించడం ఆయనకు తెలుసు. వీరు ధైర్యం, దురహంకారం కలిగి, పరలోకసంబంధమైన వారిని దూషించడానికి భయపడరు; 11 బలవంతులు శక్తిమంతులైన దేవదూతలు సహితం, ప్రభువు తీర్పు తెచ్చినపుడు వారిని అలా దూషించరు. 12 కాని ఈ ప్రజలు తాము గ్రహించలేని విషయాలను దూషిస్తారు. వారు స్వాభావికంగా పట్టబడడానికి, నశించడానికి పుట్టిన వివేకంలేని జంతువుల వంటివారు, ఆ జంతువుల్లా వీరు కూడా నశించిపోతారు. 13 వారు ఇతరులకు చేసిన హానికి ప్రతిఫలంగా వారు హానికి గురవుతారు. వారు పట్ట పగలే త్రాగుతూ ఆనందించాలని భావిస్తారు. వారు కళంకులు నిందలుగలవారై విందులలో మీతో పాల్గొని తిని త్రాగి ఆనందిస్తారు. 14 వ్యభిచారం నిండిన కళ్ళతో, పాపం చేయడం వారెప్పటికి మానరు; వారు అస్థిరత కలుగచేస్తారు; దురాశలో నేర్పుకలిగినవారు, శాపగ్రస్థులైన పిల్లలు! 15 వారు సరియైన మార్గాన్ని విడిచిపెట్టి, దుష్టత్వానికి వచ్చే జీతాన్ని ప్రేమించిన బెయేరు కుమారుడైన బిలాము మార్గాన్ని అనుసరించడానికి వెళ్ళారు. 16 అయితే అతడు తన చెడు కార్యాన్ని బట్టి ఒక గాడిద చేత గద్దింపబడ్డాడు, ఒక మాట్లాడలేని జంతువు మానవ స్వరంతో మాట్లాడి ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డుకుంది. 17 వీరు నీళ్ళు లేని ఊటల వంటివారు. తుఫాను తీవ్రతకు కొట్టుకొని పోవు మేఘాల వంటివారు. కటిక చీకటి వారి కొరకు సిద్ధపరచబడింది. 18 ఎందుకంటే, వారి మాటలు వట్టివి డాంబికమైనవి, వారు శరీర సంబంధమైన దురాశలు గలవారై, చెడు మార్గంలో జీవిస్తూ అప్పుడే తప్పించుకొన్నవారికి పోకిరి చేష్టలను ఎరగా చూపించి ప్రలోభపెడతారు. 19 తామే దుర్నీతికి బానిసలై ఉండి, అలాంటి వారికి స్వాతంత్ర్యం ఇస్తామని చెప్తారు. ఎందుకంటే “ఒకరు దేని చేతిలో ఓడిపోతారో దానికే దాసులవుతారు.” 20 మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును తెలుసుకోవడం వల్ల లోకంలోని పాపం నుండి తప్పించుకొని, మరల వాటిలో చిక్కుబడి వాటి చేత జయించబడితే, వారి చివరి స్థితి మొదటి స్ధితి కన్నా దారుణంగా ఉంటుంది. 21 వారు నీతి మార్గాన్ని తెలుసుకొని వారికి ఇవ్వబడిన పరిశుద్ధ ఆజ్ఞల నుండి వెనక్కి తిరిగితే, ఆ మార్గం వారికి తెలియక పోవడమే మంచిది. 22 “కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడుగబడిన పంది బురదలో దొర్లడానికి మళ్లినట్లు” అనే సామెతలు వీరి విషయంలో నిజం. |
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.