Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 కొరింథీ 7 - తెలుగు సమకాలీన అనువాదము

1 ప్రియ మిత్రులారా, మనం ఈ వాగ్దానాలను కలిగివున్నాం కనుక, దేవుని భయంతో పవిత్రతను సంపూర్ణం చేసుకొంటూ, శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని మనం పవిత్రులుగా చేసుకుందాం.


సంఘాల పశ్చాత్తాపం గురించి పౌలు ఆనందం

2 మీ హృదయంలో మాకు చోటియ్యండి. మేము ఎవరికీ అన్యాయం చేయలేదు, ఎవరిని పాడుచేయలేదు, ఎవరినీ మోసగించలేదు

3 మిమ్మల్ని గద్దించాలనే ఉద్దేశంతో నేను ఇలా చెప్పడం లేదు; ఎందుకంటే, జీవించినా మరణించినా మేము మీతో ఉండేలా మా హృదయాల్లో మీకు ప్రత్యేక స్థానం ఉందని నేను ముందే చెప్పాను.

4 ఎంతో నిష్కపటంగా నేను మీకు చెప్పాను; మీ గురించి నేను చాలా గర్వపడతాను. ఎంతో ధైర్యపరచబడతాను; మా శ్రమలన్నింటిలో నా ఆనందానికి హద్దులు లేవు.

5 మాసిదోనియాకు చేరిన తరువాత కూడా మాకు విశ్రాంతి లేదు, అయితే అన్నిచోట్ల తీవ్రమైన ఆందోళనలు, బయట కలహాలు లోపల భయాలు.

6 కానీ, బలహీన హృదయులను ధైర్యపరచే దేవుడే తీతు రాక ద్వారా మమ్మల్ని ఓదార్చాడు.

7 అతని రాక వల్లనే కాదు కాని, మీరు అతనికిచ్చిన ఆదరణ వల్ల కూడా. నన్ను చూడాలనే మీ కోరిక గురించి, మీ లోతైన దుఃఖం గురించి, నా పట్ల మీకున్న అభిమానం గురించి అతడు మాకు చెప్పాడు. అందుకు నేను ఎంతో ఎక్కువగా ఆనందించాను.

8 నేను వ్రాసిన పత్రిక మీకు బాధ కలిగించినా, దానికి నేను చింతించను. ఆ పత్రిక మీకు బాధ కలిగించిందని తెలిసి నేను చింతించినా, అది కొంత వరకే.

9 మీకు విచారాన్ని కలిగించినందుకు కాదు, మీ విచారం మీ పశ్చాత్తాపానికి దారితీసినందుకు ఇప్పుడు నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే, మా వలన మీరు ఏ రీతిగా నష్టపోకూడదని ఉండడానికి దేవుని చిత్తప్రకారం మీరు విచారించారు.

10 దైవికమైన విచారం, రక్షణ కలిగించే పశ్చాత్తాపానికి దారి తీస్తుంది ఏ చింత ఉండదు, కాని లోకసంబంధమైన విచారం మరణాన్ని తెస్తుంది.

11 దైవికమైన విచారం మీలో మీ నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలనే ఎలాంటి ఆతురతను, ఆసక్తిని, ఆగ్రహాన్ని, భయాన్ని, అభిలాషను, శ్రద్ధను, న్యాయం జరిగించడానికి ఎలాంటి సంసిద్ధతను పుట్టిస్తుందో చూడండి. ప్రతిసారి ఈ విషయంలో మీరు నిర్దోషులని మీకు మీరే నిరూపించుకున్నారు.

12 కనుక నేను మీకు పత్రిక వ్రాసినప్పటికి, తప్పు చేసినవారి గురించి గాని బాధించబడినవారి గురించి గాని వ్రాయలేదు. అయితే మీరు మా పట్ల ఎలా శ్రద్ధ చూపించారో దాన్ని దేవుని ముందు మీరు చూడాలని వ్రాసాను.

13 వీటన్నిటిని బట్టి మేము ధైర్యపరచబడ్డాము. మాకు ఈ ఆదరణ కలిగినపుడు, తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన నెమ్మది పొందినందుకు అతడు ఎంత సంతోషంగా ఉన్నాడో చూసి మరి ఎక్కువగా సంతోషించాము.

14 మిమ్మల్ని అతని ముందు చాలా పొగిడాను, మీరు నన్ను సిగ్గుపరచలేదు, మీకు ఎప్పుడు నిజమే చెప్పాము. అలాగే తీతు ముందు మేము చేసిన పొగడ్తలు వాస్తవమైనవే అని నిరూపించబడ్డాయి.

15 కనుక మీరందరు విధేయత చూపించి, భయంతో వణుకుతో అతన్ని మీరు ఎలా చేర్చుకున్నారో జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీ మీద అతనికున్న అభిమానం అధికమవుతుంది.

16 ప్రతి విషయంలో మీలో నాకు పూర్తి నమ్మకం ఉన్నందుకు నేను ఆనందిస్తున్నాను.

తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version™, New Testament

Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan