Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 కొరింథీ 13 - తెలుగు సమకాలీన అనువాదము


తుది హెచ్చరికలు

1 నేను మీ దగ్గరకు రావడం ఇది మూడవసారి. “ఇద్దరు లేక ముగ్గురు సాక్షులచేత ప్రతి విషయం నిర్ధారించబడాలి.”

2 నేను రెండవ సారి మీ వద్ద ఉన్నపుడే మిమ్మల్ని హెచ్చరించాను, ఇప్పుడు మీ దగ్గర లేను, కనుక మళ్ళీ చెప్తున్నాను: అదేమంటే నేను మళ్ళీ వచ్చినపుడు, గతంలో పాపం చేసిన వారిని, ఇతరులను ఎవరిని విడిచిపెట్టను.

3 ఎందుకంటే, క్రీస్తు నా ద్వారా మాట్లాడుతున్నాడని, మీరు రుజువులు అడిగారు. ఆయన మీ వ్యవహారంలో బలహీనుడు కాడు, కాని మీలో ఆయన బలవంతుడు.

4 నిజానికి, బలహీనతలో ఆయన సిలువ వేయబడ్డాడు గాని, దేవుని శక్తిని బట్టి ఆయన జీవిస్తున్నాడు. అలాగే మేము ఆయనలో బలహీనులం, అయినా మేము మీతో వ్యవహరించే విషయంలో దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడ జీవిస్తున్నాం.

5 మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి; మీరు పరీక్షలో ఓడిపోతే తప్ప యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మీకు తెలియదా?

6 కాని మేము పరీక్షలో ఓడిపోలేదని మీరు తెలుసుకుంటారని నేను నమ్ముతున్నాను.

7 మీరు ఏ తప్పులు చేయకూడదని, మేము పరీక్షలో నిలబడినట్లు ప్రజలు చూడాలని కాదు కాని, మేము ఓడిపోయినట్లుగా కనిపించినా మీరు మాత్రం సరియైన దానినే చేయాలని మేము దేవుని ప్రార్థిస్తున్నాము.

8 కాబట్టి మేము సత్యానికి విరోధంగా ఏమి చేయలేము, కాని సత్యం కోసమే మాత్రమే చేస్తాం.

9 మేము బలహీనంగా ఉన్నా మీరు బలంగా ఉంటేనే మాకు సంతోషం. మీరు సంపూర్ణంగా పునరుద్ధరించబడాలని మేము ప్రార్థిస్తున్నాము.

10 కాబట్టి, పడద్రోయడానికి కాదు కాని, మిమ్మల్ని కట్టడానికే ప్రభువు ఇచ్చిన అధికారాన్ని నేను వచ్చినప్పుడు ఉపయోగించుకొని మీ పట్ల నేను కఠినంగా ఉండాల్సిన అవసరం లేకుండా నేను మీ దగ్గర లేనప్పుడు ఇవన్ని మీకు వ్రాస్తున్నాను.


చివరి శుభాలు

11 చివరిగా, సహోదరీ సహోదరులారా, సంతోషించండి! సంపూర్ణంగా పునరుద్ధరించబడడానికి పోరాడండి, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోండి, ఏక మనస్సు కలిగివుండండి, సమాధానం కలిగి జీవించండి, ప్రేమ సమాధానాలకు కర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉండును గాక.

12 ఒకరిని ఒకరు పవిత్రమైన ముద్దుతో శుభాలు చెప్పుకోండి.

13 ఇక్కడ ఉన్న దేవుని ప్రజలందరు మీకు శుభాలు పంపుతున్నారు.

14 ప్రభువైన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీకందరికి తోడై ఉండును గాక.

తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version™, New Testament

Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan